గ్రేహౌండ్స్‌ శిక్షకుడు భాటి కన్నుమూత

నవతెలంగాణ – హైదరాబాద్‌: దిగ్గజ యాంటీ-నక్సల్స్‌ స్క్వాడ్‌ గ్రేహౌండ్స్‌ ముఖ్య శిక్షకుడు ఎన్‌.ఎస్.భాటి(94) ఇక లేరు. మంగళవారం తెల్లవారుజామున 4.30కు రాజేంద్రనగర్‌లోని ప్రేమావతిపేట్‌ గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రంలో ఆయన కన్నుమూశారు. మూడు దశాబ్దాలకు పైగా గ్రేహౌండ్స్‌ దళాలకు గెరిల్లా యుద్ధ తంత్రాల్లో శిక్షణ ఇచ్చిన ఆయన.. ఆ క్యాంప్‌సలోనే తుదిశ్వాస విడిచారు. భాటికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. భాటి కుమారుడు కూడా గ్రేహౌండ్స్‌ దళాలకు ‘జంగిల్‌ వార్‌ఫేర్‌’లో శిక్షణనిస్తున్నారు. 1989లో గ్రేహౌండ్స్‌ ఆవిర్భవించినప్పటి నుంచి భాటీ శిక్షణ విభాగానికి సంబంధించి కన్సల్టెంట్‌గా కొనసాగారు. కానిస్టేబుల్‌ మొదలు.. దేశంలోని సీనియర్‌ ఐపీఎ్‌సలు, విశ్రాంత ఐపీఎస్‌ అధికారులు, పలు దేశాల పోలీసులు భాటిని ద్రోణాచార్యుడిగా గౌరవిస్తారు. ఆయన సేవలకు గాను.. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. గ్రేహౌండ్స్‌ బలగాలు, అధికారులు, మాజీ ఐపీఎ్‌సల సందర్శనార్థం బుధవారం ఉదయం 9.30 వరకు భాటి పార్థివ దేహాన్ని గ్రేహౌండ్స్‌ పరిపాలన భవనం వద్ద ఉంచుతామని అధికారులు వివరించారు. ఆ తర్వాత అంతిమ యాత్ర ప్రారంభమవుతుందని, 11 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు.

Spread the love