చేనేత, పవర్‌లూమ్‌ కార్మికులను ఆదుకోవాలి

చేనేత, పవర్‌లూమ్‌ కార్మికులను ఆదుకోవాలి– సంక్షేమ చర్యలు చేపట్టాలి
– రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలివ్వాలి
– చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్‌
నవతెలంగాణ -నల్గొండ కలెక్టరేట్‌
చేనేత సహకార వ్యవస్థ నిర్వీర్యమై ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న చేనేత, పవర్‌లూమ్‌ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్‌ కోరారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమురయ్య భవన్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నియంత పాలన అంతరించి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడటంపై ముఖ్యమంత్రికి, మంత్రివర్గానికి తెలంగాణ చేనేత కార్మిక సంఘం అభినందనలు తెలియజేస్తుందన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా.. నిధులు కేటాయించకుండా ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. చేనేత, పవర్‌లూమ్‌ వృత్తి రక్షణ, వృత్తిదారుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. సహకార సంఘాలు, మాస్టర్‌ వీవర్స్‌ వద్ద పేరుకపోయిన బట్టల నిలువలను ప్రభుత్వమే కొనుగోలు చేసి కార్మికులకు ఉపాధి కల్పించాలని అన్నారు. చేనేత బీమాకు అర్హత వయస్సు సడలించి అందరికీ వర్తింపజేయాలని, సిరిసిల్ల తరహాలో రాష్ట్రమంతగా చేనేత, పవర్‌ లూమ్‌ కార్మికులకు వర్క్‌ షెడ్డు, ఇంటి నిర్మాణానికి ప్రత్యేక కోటా నిర్ణయించి అమలు చేయాలని కోరారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన జియో ట్యాగ్‌ యాప్‌ను రద్దు చేసి రాష్ట్రంలోని అన్ని మగ్గాలకు, అనుబంధ వృత్తులకు జియో ట్యాగ్‌ వేసి కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. చేనేత రంగానికి బడ్జెట్‌లో రూ.1200 కోట్లు కేటాయించాలని, కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పీఎఫ్‌, ఈఎస్‌ఐ, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని కోరారు. ప్రభుత్వ సిబ్బందికి యూనిఫారాలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలకు చేనేత వస్త్రాలను బహూకరించి చేనేత పరిశ్రమ అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలన్నారు. చేనేత మిత్రకు ఇస్తున్న నగదు బదిలీని పెంచాలని కోరారు.
చేనేత సహకార సంఘాల, చేనేత కార్మికుల అన్ని రకాల చేనేత రుణాలు మాఫీ చేసి 80 శాతం సబ్సిడీతో తిరిగి రుణాలు ఇవ్వాలని, జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.
త్వరలో ముఖ్యమంత్రిని కలిసి చేనేత రంగం సమస్యలపై విన్నవించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ పవర్‌లూమ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కందగట్ల గణేష్‌, నాయకులు ఏలే శ్రీనివాస్‌, గడ్డం దశరథ, జల్ల దేవదానం, నల్ల రాంబాబు, రాపోలు వెంకన్న, ఆలుగొండ మధు, వనం రాములు, గంజి నాగరాజు, సూరపల్లి భద్రయ్య తదితరులు ఉన్నారు.

Spread the love