ఎమ్మెల్సీగా వజ్రేష్‌ యాదవ్‌ ?

ఎమ్మెల్సీగా వజ్రేష్‌ యాదవ్‌ ?– మేడ్చల్‌ ప్రత్యేకం..!
– కలిసొచ్చిన సామాజిక తరగతి..
– యాదవ సామాజిక తరగతికి అవకాశం
– ముఖ్యమంత్రి అనుచరుడిగా గుర్తింపు
– ఎమ్మెల్యే ఎన్నికలలో మల్లారెడ్డికి గట్టి పోటీ ఇచ్చిన వజ్రేష్‌
నవతెలంగాణ-బోడుప్పల్‌
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతోపాటు ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉండటంతో అందుకు ఆశావహుల ప్రయత్నాలు మొదలయ్యాయి. ముఖ్యంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలైన వారు ముందు రేసులో ఉండి తమ నాయకుల ప్రసన్నం కోసం ఎదురుచూస్తున్నారు. మేడ్చల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డికి ఎన్నికలలో గట్టి పోటీనిచ్చిన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తోటకూర వజ్రేష్‌ యాదవ్‌కు శాసనమండలి సభ్యుడిగా అవకాశం ఖాయమనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి అనుంగు అనుచరుడిగా పేరుండటంతోపాటు ఎన్నికలలో బలమైన అభ్యర్థి మల్లారెడ్డితో పోటీ పడి గణనీయమైన ఓటు బ్యాంకు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వజ్రేష్‌ యాదవ్‌ పోడిపోయినా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మల్లారెడ్డికి గట్టి పోటీనే ఇచ్చారు. ఒక దశలో మల్లారెడ్డి ఓటమి ఖాయమనే సంకేతాలు వినిపించాయి. రాష్ట్రంలోనే మేడ్చల్‌ అసెంబ్లీ నియోజకవర్గం ప్రత్యేకమైందనే చెప్పొచ్చు. దీని పరిధిలో మూడు కార్పొరేషన్లు, ఏడు మున్సిపాల్టీలు, ఐదు జెడ్పీటీసీలు, ఐదు ఎంపీపీలు ఉన్నాయి. నియోజకవర్గం పూర్తిగా పట్టణం కాదు.. పూర్తి గ్రామీణం కాకుండా ఉంది. అందుకే రాష్ట్రంలో మేడ్చల్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వజ్రేష్‌ యాదవ్‌కు శాసనమండలి సభ్యునిగా అవకాశం ఇవ్వడం సబబనే సూచనలు కూడా అధిష్టానం వద్దకు వెళ్లాయని సమాచారం. వజ్రేష్‌ యాదవ్‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మేడ్చల్‌లో మల్లారెడ్డికి దీటుగా కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసే దిశగా రేవంత్‌ రెడ్డి ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. అంతే కాకుండా యాదవ సామాజిక తరగతి నుంచి ఎవ్వరూ ఎమ్మెల్యేగా గెలుపొందకపోవడంతో ప్రస్తుతం ఎమ్మెల్యే కోటా, గవర్నర్‌ కోటాలలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాల్లో అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇలా చేయడం ద్వారా నగర శివారు ప్రాంతాలలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతంతో పాటు, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో ఏకపక్ష విజయాలు సాధించేందుకు అవకాశాలు ఉంటాయనేది అధిష్టానం ఆలోచనగా ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు.

Spread the love