రుణమాఫీ అమలుపై సీఎం సవాల్ స్వీకరించిన హరీశ్ రావు

నవతెలంగాణ – హైదరాబాద్: ఆగస్టు 15 లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు. సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడిన హరీశ్‌ రావు.. సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరించినట్లు తెలిపారు. సవాల్‌పై గురువారం అమరవీరుల స్తూపం వద్ద ప్రమాణం చేస్తానని.. ఒకే విడతలో రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా..? అని ప్రశ్నించారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధిపొందినట్లు ఇప్పుడు కుదరదని అన్నారు. ‘గతంలో కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న రేవంత్‌రెడ్డి ఇప్పుడు దేవుళ్ల మీద ఒట్టు వేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. ఎల్లుండి అసెంబ్లీ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వద్దకు వస్తాను. సీఎం రేవంత్‌రెడ్డి కూడా రావాలి. అమరవీరుల సాక్షిగా ఇద్దరం ప్రమాణం చేద్దాం. ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ, 6 గ్యారంటీలు, 13 హామీలు అమలు చేస్తామని ప్రమాణం చేయాలి. ఆ హామీలు అణలు చేస్తే అక్కడే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. ఉపఎన్నికల్లోనూ పోటీ చేయను. నా పదవికంటే తెలంగాణ ప్రజలకు మేలు చేయడమే సంతోషం.’ అని హరీశ్ రావు ఛాలెంజ్ చేశారు.

Spread the love