ధాన్యం సేకరణ ప్రణాళిక బద్ధంగా చేపట్టి పూర్తి చేయాలి

జిల్లా అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ
నవతెలంగాణ-వికారాబాద్‌ కలెక్టరేట్‌
రైస్‌ మిల్లర్లకు కేటాయించిన ధాన్యాన్ని తప్పనిసరిగా దించుకునే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ అధికారులకు సూచించారు. గురువారం సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా వరి ధాన్యం సేకరణ, రవాణా, అన్‌ లోడింగ్‌ తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 13 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించడం జరిగిందని, ధాన్యం సేకరణ ప్రణాళిక బద్ధంగా చేపట్టి పూర్తి చేయాలన్నారు. మిల్లర్లు లారీలలో వచ్చిన దాన్యం లోడ్‌లను వెంటనే అన్‌ లోడ్‌ చేసే విధంగా తహసీల్దార్లు పర్యవేక్షించుకోవాలన్నారు. రైస్‌ మిల్లుల వద్ద అవసరం మేరకు హమాలీలను సమకూర్చుకోవాలని, ధాన్యం నిల్వల కోసం ఇంటర్మీడియట్‌ గోదాములను గుర్తించి అక్కడికి తరలించే ఏర్పాటు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యాన్ని తరలించేందుకు అవసరమైతే డీసీఎంలు, ట్రాక్టర్లను వినియోగించుకోవాలన్నారు. రాబోవు 10 రోజులు ధాన్యం సేకరణ చాలా కీలకమని, ఏజెన్సీలన్నీ కేటాయించిన లక్ష్యం మేరకు రోజు వారిగా ధాన్యం సేకరణ జరగాలన్నారు. వర్షాల వల్ల ధాన్యం తడిసిపోకుండా ఉండేందుకు వెంటనే అవసరమైన టార్పాలిన్లను జిల్లా మార్కెటింగ్‌ అధికారుల నుండి సేకరించుకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం సేకరణ పనులను గడువులోగా పూర్తి చేయాలని అన్నారు. సమావేశంలో జిల్లా పురసరఫరాల శాఖ అధికారి రాజేశ్వర్‌, పౌర సరఫరాల జిల్లా మేనేజర్‌ విమల, డిఆర్‌డిఓ కృష్ణన్‌, మార్కెటింగ్‌ శాఖ అధికారి సారంగపాని, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Spread the love