పేదలందరికీ ఇండ్ల స్థలాలు పంచాల్సిందే

– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌. వీరయ్య
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు ఇస్తామని వాగ్దానం చేసి ఆచరణలో అమలు చేయకపో వడం వల్లే రాష్ట్రవ్యాప్తంగా పేదలు ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని పోరాటాలు చేస్తున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య అన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య అధ్యక్షతన సోమవారం వరంగల్‌ జిల్లా శివనగర్‌లోని ఏసీరెడ్డి నగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర నాయకులు జి.రాములతో కలిసి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 జిల్లాల్లో 60 వేల మంది ఇండ్లు లేని నిరుపేదలు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని ఏడాది కాలంగా జీవిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 58 ప్రకారం పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలిస్తామని, ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు ఇస్తామన్న వాగ్ధానాన్ని వెంటనే అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం పేదలకు ఇల్లులు కట్టిస్తున్నామని చెప్పుతున్నారే తప్ప.. ఏ ఒక్కరికీ ఇచ్చిన పాపాన పోలేదని, చిత్తశుద్ధి ఉంటే ప్రతి పేద గుడిసె వాసులకి రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు అందించి వారి ఇల్లుల నిర్మాణానికి సహకరించాలన్నారు. జి. రాములు మాట్లాడుతూ.. వరంగల్‌ జిల్లాలో ఎన్నో భూ పోరాటాలు చేసి పేదలకు ఇండ్లు ఇప్పించిన ఘన చరిత్ర పార్టీకి ఉందన్నారు. పేదలకు ఇండ్లు ఇప్పించడంతోపాటు ప్రభుత్వ స్థలాలను ప్రయివేటు వ్యక్తులు కబ్జాలు చేస్తే వారి నుంచి స్థలాలను కాపాడేందుకు కోర్టు మెట్లు ఎక్కి ప్రభుత్వానికి అందించిన చరిత్ర కూడా సీపీఐ(ఎం) ఉందని గుర్తుచేశారు. పేదల సొంతింటి కల సాకారం కోసం ఎంత దూరమైనా ఎవరితోనైనా పోరాటాలు చేయడానికి సీపీఐ(ఎం) ఎల్లవేళలా ముందుంటుందని స్పష్టంచేశారు. సంవత్సరం క్రితం జక్కలొద్దితో పాటు శివనగర్‌ తదితర ప్రభుత్వ స్థలాల్లో పేదలు వేసుకున్న గుడిసెలకు, స్థలాలకు పట్టాలు అందజేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపైన ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించాలని, లేకుంటే పట్టాలు అందించే వరకు పార్టీ ఆధ్వర్యంలో భూ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నలగంటి రత్నమాల, సింగారపు బాబు, జిల్లా కమిటీ సభ్యులు మాలోతు సాగర్‌, ఆరూరి కుమార్‌, ఖిలా వరంగల్‌ ఏరియా కమిటీ సభ్యులు దుర్గయ్య, సారంగపాణి, వేణు, దయ, వెంకటేశ్వర్లు, మురళి తదితరులు పాల్గొన్నారు.

Spread the love