దేశభక్తంటే
సరిహద్దుల్లో మీసాలు మెలేయ్యడమే కాదు
పేదల ఇండ్లల్ల పొయ్యి వెలుగాలే
కడుపులకింత కూడుడుకాలే !
బతుకును నెట్టుకురావడమంటే
నిచ్చెన లేకుండా మిద్దెక్కినట్లుంది
వొట్టి కాళ్లతో పలుగురాళ్లల్ల నడిచినట్లుంది
పేదల కన్నీళ్ళంటే ఎంత ప్రీతో
వెలిగిపోతున్న ”భారతం”లో
నెత్తిమీద గ్యాస్ బండలు
పొయిన కాలాలే బాగుండే
సెలుకల్ల కూలిపోయి వచ్చెటప్పడు
అమ్మ కట్టెలమోపుతోనె ఇంటికొచ్చేది
ఒక్కనాడు కట్టెల బాధలేదు
ఎన్ని దినాలైనా పొయ్యి దగాదగా మండేది
దీని పాడుగాను నెలకాకముందే
సిలిండర్ గ్యాస్ పెద్దపులై తరుముతున్నది
అడ్డామీది కూలి పని దొరుకని వెతలు
చెట్టుగొట్టొద్దు వంట చెరుకు తేరాదు
ఆరిపోతున్న పొయిల బతుకు బువ్వెట్ల
చేసిన పనంతా గ్యాస్‌కే కాలిపోతే
బతుకు చెరువులో
చేపలు ఈదెదెట్ల సంసారం సాగేదెట్ల ?
మహారాజా !
మీది పోయేదేముంది
కలం మీదే పాలన మీదే
అన్నీంటిని పెంచేయ్యండి
ఎన్నింటిని పెంచినా తిరిగితిరిగి
మీ బోశానమే గదా నిండేది !
కరోనాలో
చావుల్ని పెంచినట్లుగా
అన్నింటి మీద మీ ముద్దెరలేసుకోని
నిత్య అవసరాలను నిప్పులను చేయండి
కరెంట్‌ను ముట్టుకున్నా కాలిపోతలేం గానీ
ఏదికొన్నా బొగ్గులైతున్నం
మీది పోయేదేముంది
అన్నింటిని అందకుండా చేసే కాషాయపాలన
ఇప్పట్లో
ఇగ ఏ ఎన్నికల వానలు లేవేమో
మేం గుర్తుండటానికీ!
రోజురోజు అంగట్ల కొన్కొచ్చుకొనే బీదలం
మీరొక్కనాడే కొని అయిదేళ్ళు
మహారాజుల్లా వెలిగిపోతూనే వుంటారు
సబ్సీడీని
కత్తులమూటను చేసిన కర్కశ పాలన”
ఇన్నిసార్లు మా రక్తాన్ని పిండుకోవడమెందుకు
ఒకటేసారి
ఆ కంట్రోల్ బియ్యముల ఏమన్న కలపి పంపీయండి
ఒక్కసారే తిని ఒక్కపారే గుడ్డు పెడ్తాం !
– వనపట్ల సుబ్బయ్య
9492765358