సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు ఒరిగిందేమీ?

– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివక్షను విడనాడాలి
– న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి : సీఎం కేసీఆర్‌కు ఎస్‌సీకేఎస్‌ బహిరంగ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తమ వేతనాలను కోల్పోయి మరీ తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న 25 వేల మంది సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వంగానీ, సింగరేణి యాజమాన్యంగానీ చేసిందేమీ లేదని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు పేర్కొన్నారు. జేబీసీసీఐలో చేసిన నిర్ణయాలను సింగరేణిలో అమలు చేయించడంలో కేంద్ర ప్రభుత్వం, బొగ్గుమంత్రిత్వ శాఖ నిర్లక్ష్యం వహిస్తున్నాయని విమర్శించారు.
సింగరేణికి లాభాలు గడించిపెట్టడంలో కీలకపాత్ర పోషిస్తున్న కాంట్రాక్టు కార్మికుల పట్ల వివక్ష తగదన్నారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పర్మినెంట్‌ కార్మికులకు స్వీట్లు పంచుతున్న సింగరేణి యాజమాన్యానికి కాంట్రాక్టు కార్మికులు పట్టరా? అని ప్రశ్నించారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగానైనా సీఎం కేసీఆర్‌ కాంట్రాక్టు కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై జోక్యం చేసుకోవాలనీ, వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యేలా చూడాలని కోరారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు బి.మధు బహిరంగ లేఖ రాశారు. అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. నేరుగా వేతనాలు చెల్లించడం ద్వారా సింగరేణికి నెలకు రూ.50 లక్షలు ఆదా అవుతాయని పేర్కొన్నారు. కోల్‌ఇండియా నిర్ణయించిన వేతనాన్నయినా, జీవో 22ని అయినా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రమాదంలో మరణించిన కాంట్రాక్ట్‌ కార్మికులకు కోల్‌ ఇండియాలో చెల్లించిన విధంగా రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరారు. సింగరేణిలో లాభాల వాటా లేదా చట్ట ప్రకారం 20 శాతం బోనస్‌ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 26-09-2022న సింగరేణి యాజమాన్యం చేసిన ఒప్పందంలోని అన్ని అంశాలను అమలు చేయాలని కోరారు. సింగరేణి హాస్పిటల్స్‌లో కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయం కల్పించాలనీ, లేదంటే ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని విన్నవించారు. ఖాళీ క్వార్టర్స్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు కేటాయించాలని కోరారు. కేటగిరీల వారీగా వేతనాలు చెల్లించాలని కోరారు.

Spread the love