ప్రజాభాగస్వామ్యంతో అవతరణోత్సవాలు

– సాధించిన ప్రగతిపై విస్తృత ప్రచారం
– చెరువుల పండుగ రోజున నాన్‌ వెజ్‌తో భోజనాలు
– ర్యాలీలు, ప్రదర్శనలు విరివిగా చేపట్టాలి
– రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో ప్రజా భాగస్వామ్యం భారీగా ఉండాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకొని విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఐడీఓసీలోని సమావేశ మందిరంలో అధికారులతో దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై మంత్రి దిశానిర్దేశం చేశారు. సకలజనుల సమ్మెతో ఉద్యోగులు తెలంగాణ ఆకాంక్షను రగిల్చారని, సాధించిన తెలంగాణ అభివృద్ధిలో ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తున్నారని అన్నారు. 21 రోజల పాటు నిర్వహించే అవతరణ ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. జూన్‌ 2న అమరవీరులకు నివాళులర్పించి, ఐడిఓసిలో పతాకావిష్కరణ, సాయంత్రం లకారంలో సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 3న రైతుల దినోత్సవం పురస్కరించుకుని జిల్లాలోని 129 రైతు వేదికల్లో పెద్ద ఎత్తున రైతులతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. క్లస్టర్‌ పరిధిలోని రైతులు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలపై ఊరేగింపుగా తరలివచ్చేలా ఏర్పాట్లు చేయాలన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్‌ తదితరాలపై ప్రభుత్వం ఎంత ఖర్చుచేస్తున్నది, పథకాల పూర్వం స్థితి, ఇప్పటి పరిస్థితి పై అవగాహన కల్పించాలన్నారు. రైతుబీమా లబ్ధిదారులతో మాట్లాడిం చాలన్నారు. 4న సురక్షా దినోత్సవం రోజున షీ టీమ్స్‌, సైబర్‌ నేరాలపై అవగాహన ర్యాలీలు చేపట్టాలన్నారు. సత్పౌరులు, విశిష్ట సేవలందించిన పోలీసులను సత్కరించాలని సూచించారు. 5న విద్యుత్‌ దినోత్సవం రోజున సబ్‌ స్టేషన్లు, విద్యుత్‌ కార్యాలయాలను అలంకరించాలని, తెలంగాణకు పూర్వం రాష్ట్రంలో విద్యుత్‌, నేటి పరిస్థితులను వివరించాలన్నారు. 6న పారిశ్రామిక ఉత్సవం సందర్భంగా పరిశ్రమల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. 7న సాగునీటి దినోత్సవాన్ని పురస్కరించుకుని నియోజకవర్గస్థాయిలో సాగునీటి రంగంలో ప్రగతిని ప్రజల ముందు ఉంచాలన్నారు. 8న చెరువుల పండుగ రోజున గ్రామ గ్రామాన చెరువుల వద్ద సాంస్కతిక కార్యక్రమాలు చేపట్టాలని, కట్టలపై మాంసహార భోజనాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. 9న సంక్షేమ సంబురాల్లో భాగంగా రెండో విడత గొర్రెల పంపిణీ, సాంఘిక సంక్షేమశాఖ సేకరించిన 58 ఎకరాలను భూమి, ఇండ్లులేని 3000 మందికి పట్టాలు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. బీసీ సంక్షేమ శాఖ ద్వారా చెక్కుల పంపిణీ, కళ్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్లు తదితర లబ్ధిదారులకు అందజేయనున్నట్లు తెలిపారు. 10న సుపరిపాలన దినోత్సవం రోజున కొత్తగా ఏర్పాటైన మునిసిపాలిటీలు, మండలాలు, గ్రామపంచాయతీల్లో సంబురాలు చేసి ప్రయోజనాల కరపత్రాలను పంచాలన్నారు. 11న సాహిత్య దినోత్సవం రోజున భక్త రామదాసు క్షళాక్షేత్రంలో కవి సమ్మేళనం, కవితల పోటీలను నిర్వహించాలని తెలిపారు. 12న పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రన్‌, 13న మహిళా సంక్షేమ దినోత్సవం నాడు కళ్యాణలక్ష్మి, ఒంటరి మహిళా పెన్షన్లు, ఆరోగ్యమహిళ తదితరాలపై ప్రచారం చేయాలన్నారు. 14న వైద్య, ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కంటివెలుగు, పల్లె, బస్తీ దవాఖానాలు, ఆరోగ్య మహిళ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. 15న పల్లెప్రగతిలో భాగంగా గ్రామ సభలతో పాటు నూతన పంచాయతీ కార్యాలయం శంకుస్థాపన, ఉత్తమ సర్పంచులు, ఎంపీపీలకు సన్మానాలు చేయాలని మంత్రి తెలిపారు. 16న పట్టణ ప్రగతిలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు, వాహనాలతో ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. 17న గిరిజనోత్సవం రోజున గిరిజన గ్రామాల్లో 10 శాతం రిజర్వేషన్లు, గిరివికాసం లబ్ది, తండాలను పంచాయతీలుగా మార్చడంతో ప్రయోజనాలు, 18న మంచినీళ్ళ పండుగలో భాగంగా మిషన్‌ భగీరథ విజయాలపై ప్రచారం చేయాలన్నారు. 19న హరితోత్సవం రోజున నగరంలో 50వేల మొక్కలు నాటాలన్నారు. 20న విద్యా దినోత్సవం రోజున ‘మన ఊరు-మన బడి’ పనులతో మెరుగైన మౌలిక సౌకర్యాలు, పిల్లలకు యూనిఫామ్‌, పుస్తకాల పంపిణీ, వ్యాసరచన, ఉపన్యాసాలు, చిత్రలేఖనం తదితర పోటీలు నిర్వహించాలన్నారు. 21న ఆధ్యాత్మిక దినోత్సవం ఆలయాలు, మసీదులు, చర్చిల కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను వివరించాలన్నారు. 22న అమరులకు నివాళులు, స్మారక చిహ్నాల ప్రారంభోత్సవం చేయాలని అన్నారు. గ్రామ, మండల, మునిసిపల్‌, జిల్లా పరిషత్‌ స్థాయిల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, అమరులకు నివాళి తీర్మానం, 2 నిమిషాల మౌనం పాటించాలని, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 2 నిమిషాలు మౌనం పాటించాలని మంత్రి సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఉత్సవాలు వైభవోపేతంగా చేపట్టాలని కోరారు. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ ఉద్యమ సమయంలో ఘట్టాలను ప్రధాన కూడళ్ళలో ప్రదర్శించాలని, తొమ్మిదేండ్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డులను ప్రజల్లోకి తేవాలన్నారు. తెలంగాణ సాధన స్పూర్తిని, సాధించిన తెలంగాణ అభివద్ధిని ప్రజలకు వివరించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సూచించారు. జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పోలీస్‌ కమిషనర్‌ విష్ణు ఎస్‌. వారియర్‌, రాష్ట్ర విత్తనాభివద్ది సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, డిసిసిబి చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల వెంకట శేషగిరిరావు, నగర మేయర్‌ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్‌ బచ్చు విజరు కుమార్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ స్నేహలత మొగిలి, శిక్షణ సహాయ కలెక్టర్లు రాధిక గుప్తా, మయాంక్‌ సింగ్‌, జిల్లా రైతుబంధు సమితి కన్వీనర్‌ ఎన్‌. వెంకటేశ్వర రావు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love