ప్రపంచానికి నాయకత్వం దిశగా భారత్ అడుగులు వేస్తోంది…

జీ 20 యూనివర్శిటీ కనెక్ట్ లెక్చర్ సిరీస్ లో భాగంగా “ఎంగేజింగ్ యంగ్ మైండ్స్”
జీ 20 యూనివర్శిటీ కనెక్ట్ లెక్చర్ సిరీస్ లో భాగంగా “ఎంగేజింగ్ యంగ్ మైండ్స్”
– ఆస్ట్రేలియాలో భారత మాజీ రాయబారి అంబాసిడర్ ఎ. గీతేష్ శర్మ
నవతెలంగాణ, ఓయూ:
ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ అడుగులు వేస్తోందని ఆస్ట్రేలియాలో భారత రాయబారిగా పనిచేసిన అంబాసిడర్ ఎ. గీతేష్ శర్మ అన్నారు. జీ 20 యూనివర్శిటీ కనెక్ట్ లెక్చర్ సిరీస్ లో భాగంగా “ఎంగేజింగ్ యంగ్ మైండ్స్” అనే అంశంపై శుక్రవారం ఓయూ దూరవిద్యాకేంద్రం ఆడిటోరియంలో  కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విదేశాలతో భారత సంబంధాల ఆవశ్యకతను వివరించారు. ఉక్రెయిన్, సుడాన్ సహా అనేక ప్రాంతాల్లో క్లిష్టపరిస్థితులు ఎదురైన సందర్భాల్లో భారత పౌరులను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేందుకు భారత విదేశీ వ్యవహారాల విభాగం అత్యుత్తమంగా పనిచేసిందని వెల్లడించారు.ఈ సందర్భంగా ఓయూ వీసీ ప్రో.రవీందర్ నేతృత్వంలో ప్రగతి దిశగా అడుగులు వేస్తోందని అభినందించారు.కాలానుగుణంగా విదేశీ సంబంధాలు, దౌత్య విధానాలు మారుతూ వచ్చాయన్న గీతేష్ శర్మ సాంకేతిక యుగంలో ప్రపంచం మరింత ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. సంఘర్షలు లేని ప్రపంచాన్ని స్వప్నించే ప్రతి దేశం భారత్ వైపు చూస్తోందని ప్రపంచానికి శాంతిని అందించటంలో నాయకత్వం వహించేది భారత్ మాత్రమేనని వివరించారు. హైదరాబాద్ నుంచి మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎడగటం, ఉస్మానియా విద్యార్థి శంతనునారాయణ్ అడాబ్ సీఈఓగా ఉండటం గర్వించదగినదని తెలిపారు. ఓయూ ని G20 యూనివర్శిటీ కనెక్ట్‌కు వేదికగా ఎంపిక చేసిన RIS (అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం పరిశోధన మరియు సమాచార వ్యవస్థ), న్యూఢిల్లీ అధికారులకు ఓయూ వీసీ కృతజ్ఞతలు తెలిపారు.ఓయూలో పరిశోధన, విద్యా కార్యకలాపాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పాఠ్య ప్రణాళిక సంస్కరణలపై వివరించారు.అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరిచేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇండో-పసిఫిక్ అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.
          ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ ప్రొ. వి. ప్రవీణ్ రావు మాట్లాడుతూ. దేశ ప్రజలకు అవసరమైన ఆహార ఉత్పత్తిలో సాధికారత సాధించామని స్పష్టం చేశారు. దేశంలోని పరిశోధనల ఫలితంగా వెనకబడిన దేశాలకు సైతం ఆహారాన్ని అందించే స్థాయికి ఎదిగిన విషయాన్ని గుర్తు చేశారు. ఇతర హక్కులతో పాటు, “భూమి హక్కు”, “ఆహార హక్కు” చట్టాలు చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పాడు. విశ్వవిద్యాలయాలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, ఒకే అంశంపై విశ్వవిద్యాలయాలు నడిచే కాలం పోయిందని వ్యాఖ్యానించారు. వ్యవసాయం, వాతావరణం, డాటాసైన్స్, కృత్రిమ మేధ ఇలా అన్ని విభాగాలు ఏకతాటిపైకి వచ్చినప్పుడు అభివృద్ధి సాధ్యమని, అందుకే అన్ని అంశాలు అందుబాటులో ఉండే విద్యావిధానానికి భవిష్యత్తు ఉందన్నారు.
        డాక్టర్ జహాగీర్దార్ హైదరాబాద్ శాస్త్రీయ కార్యకలాపాల కేంద్రంగా కాలక్రమేణా ఎలా అభివృద్ధి చెందిందో వివరించారు. పరిశోధన మరియు సహకారం కోసం RCI, DRDO, హైదరాబాద్ సౌకర్యాల గురించి ఆయన వివరంగా మాట్లాడారు. భారతదేశంలో పరిశోధనలను ప్రోత్సహించడంలో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (NRF) విలువను ఆయన స్పష్టం చేశారు. జీవితాన్ని మెరుగుపరుచుకోవడమే అంతిమ లక్ష్యంతో పరిశోధనలో కెరీర్ గురించి ఆలోచించమని అతను విద్యార్థులకు పిలుపునిచ్చారు. G20 లక్ష్యం కూడా ఇదేనని తెలిపారు. పాండిచ్చేరి యూనివర్సిటీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ డీన్, జీ 20 యూనివర్సిటీ కనెక్ట్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ… ఇతర అంతర్జాతీయ సంస్థలతో పోలిస్తే UN ప్రభావం క్షీణించడం గురించి చర్చించారు.
బ్లూ ఎకానమీ, జి20లో భారత్ భాగస్వామ్యంపై ఆయన చర్చించారు. భారతదేశం యొక్క G20 ప్రెసిడెన్సీ యొక్క “వసుధైక కుటుంబం”  లేదా “ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు” అనే భావనను అర్థం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతపై అతను హైలైట్ చేశాడు.అంతకుముందు ఓయూ ఇండో పసిఫిక్ అధ్యయన కేంద్రం డైరెక్టర్ ప్రొ. జె.ఎల్.ఎన్ రావు స్వాగతోపన్యాసం చేశారు. ముగింపు సందర్భంగా కార్యక్రమానికి హాజరైన అతిథులు, విద్యార్థులు, అధ్యాపకులకు దూరవిద్యా కేంద్రం డైరెక్టర్  ప్రొఫెసర్ జి.బి రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఆర్ఐఎస్ న్యూఢిల్లీ నుంచి సయ్యద్ అర్స్లాన్ అలీ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొ. పి. లక్ష్మీనారాయణ, యూజీసీ వ్యవహారాల డీన్ ప్రొ. జి. మల్లేశం, మాజీ వీసీ ప్రో తిరుపతి రావు, ప్రొ. పి.వి  రావు, ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్, డీన్లు, డైరెక్టర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.
Spread the love