– తల్లిదండ్రులకు పోస్ట్ కార్డులు పంపిన ఉన్నత పాఠశాల విద్యార్థులు
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఆయా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో బుధవారం వినూత్నంగా రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కమ్మర్‌పల్లి పోలీసుల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అరైవ్ అలైవ్ క్యాంపెయిన్-2026లో భాగంగా ‘చిల్డ్రన్స్ రోడ్ సేఫ్టీ డే’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కమ్మర్‌పల్లి, చౌట్‌పల్లి, ఉప్లూర్, హాసాకొత్తూర్, కోనసముందర్, కోనాపూర్, బషీరాబాద్ గ్రామాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులతో ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
ఇందులో భాగంగా విద్యార్థులచే వారి తల్లిదండ్రులకు ట్రాఫిక్ నిబంధనల ఆవశ్యకతను తెలుపుతూ పోస్ట్ కార్డులు రాయించే వినూత్న కార్యక్రమాన్ని పోలీసులు చేపట్టారు. ”నాన్న…దయచేసి నా కోసం, అమ్మ కోసం హెల్మెట్ వాడండి, మద్యం సేవించి వాహనం నడపకండి, మనందరి కోసం ట్రాఫిక్ రూల్స్ పాటించండి” వంటి భావోద్వేగ భరితమైన సందేశాలతో కూడిన పోస్ట్ కార్డులను విద్యార్థులు తమ తల్లిదండ్రులకు పంపారు. పెద్దల్లో మార్పు తీసుకురావడానికి పిల్లల ద్వారా చేసిన ఈ ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంది. అదేవిధంగా విద్యార్థులకు సురక్షితంగా రోడ్డు దాటడం, సీటు బెల్ట్, హెల్మెట్ వాడకం, స్కూల్ బస్సుల్లో భద్రత తదితర అంశాలపై పోలీసులు డెమో ద్వారా వివరించారు.
ముఖ్యంగా మైనర్ల డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, పాఠశాలల వద్ద అతివేగం వంటి వాటిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి, రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని కమ్మర్‌పల్లి పోలీసులు ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.



