మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు

మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు– రూ.10 లక్షల ప్రమాద బీమా
– ప్రధాన ప్రాంతాల్లో ‘మహిళా శక్తి క్యాంటీన్లు’ :మంత్రి సీతక్క
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
మహిళా సంఘాలు ప్రభుత్వమిచ్చే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పంచాయితీ రాజ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ దనసరి అనసూయ సీతక్క సూచించారు. శనివారం హైదరాబాద్‌లోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ- గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ‘ఎస్‌హెచ్‌జీ-బ్యాంక్‌ లింకేజి వార్షిక రుణ ప్రణాళిక 2024-25’ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రూ.20వేల కోట్లను 3,66,273 సంఘాలకు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పాడు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామనీ, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల క్రింద రూ. 264.34 కోట్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఇందుకోసం డిసెంబర్‌ 2023 నుంచి మార్చి 2024 వరకు అడ్వాన్స్‌గా నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. సంఘాల మహిళలకు రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా, రూ.2లక్షల వరకు అప్పును కల్పించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల స్కూల్‌ యూనిఫామ్స్‌ కుట్టుపని మహిళా సంఘాలకు అప్పగించినట్టు తెలిపారు. అన్ని ప్రధాన ప్రాంతాల్లో మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం క్రింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తామన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ. 2,500 ఇస్తామన్నారు.

Spread the love