కొబ్బరితో క‌మ్మ‌గా

Delicious with coconutకొబ్బరిలో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలున్నాయి. రోజుకో చిన్న ముక్క కొబ్బరి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. శరీరానికి శక్తి వస్తుంది. జీర్ణ వ్యవస్థను చురుగ్గా మారుస్తుంది. బరువు తగ్గాలి అనుకునే వారికి కొబ్బరి మంచి ఆప్షన్‌. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు… విటమిన్‌ ఏ, బీ, సీతో పాటూ ఇనుము, కాల్షియం కూడా ఇందులో ఉంటాయి. మెదడు ఆరోగ్యానికీ ఇది చాలా అవసరం. పచ్చి కొబ్బరి లేదా, కొబ్బరితో వండిన వంటకాలు తినడం వల్ల శరీరం నీరు కోల్పోకుండా ఉంటుంది. డీహైడ్రేషన్‌ సమస్య వస్తే శరీరం పట్టుతప్పుతుంది. కొబ్బరి ఎక్కువగా తింటే గుండె జబ్బులు వస్తాయనే అపోహ ఉంది కానీ, అది నిజం కాదని చెబుతున్నారు వైద్యులు. కొబ్బరికి, గుండె జబ్బులకు సంబంధమే లేదంటున్నారు.
కొబ్బరి వడలు
కావలసిన పదార్థాలు
కొబ్బరి కోరు – అర కప్పు, బియ్యం – ఒక కప్పు, బియ్యంపిండి – పావు కప్పు, జీలకర్ర – ఒక టీస్పూను, ఉప్పు – తగినంత, నూనె – సరిపడినంత
తయారీ విధానం : బియ్యాన్ని నాలుగైదు గంటల పాటూ నానబెట్టుకోవాలి, తరువాత మిక్సీలో నానబెట్టిన బియ్యం, జీలకర్ర వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అందులోనే బియ్యం పిండి, కొబ్బరి కోరు, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈ పేస్టును ఓ గిన్నెలోకి తీసుకోవాలి. పిండి బూరెల సైజులో చేత్తో గుండ్రంగా చుట్టాలి. ఒక అరిటాకు లేదా, పాలిధిన్‌ కవర్‌ పై చేత్తోనే వడల్లా ఒత్తుకోవాలి. మరో పక్క కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక చేత్తో ఒత్తుకున్న వడలను అందులో వేసి వేయించాలి. అవి పూరీల్లా పొంగుతాయి. రుచి కూడా బావుంటుంది. కొంతమంది వీటిలో పంచదార కలుపుకుంటారు.
కొబ్బరితో కార్న్‌ ఇడ్లీ..
కావలసిన పదార్థాలు :
మొక్కజొన్న నూక – రెండు కప్పులు, కొబ్బరి పాలు – ఒక కప్పు, నూనె – రెండు టేబుల్‌ స్పూన్లు. ఆవాలు -ఒక టేబుల్‌ స్పూను, శనగపప్పు – ఒక టీ స్పూను, పల్లీలు – పావు కప్పు, అల్లం తురుము – రెండు టీ స్పూన్లు, పచ్చిమిర్చి -2 (చిన్నగా తరగాలి). ఉప్పు – తగినంత, బేకింగ్‌ సోడా – ఒక టీ స్పూన్‌, నెయ్యి – కొద్దిగా.
తయారీ విధానం :
ముందుగా నూనె వేడి చేసుకుని అందులో వేరుశనగలు, శనగపప్పు, ఆవాలు, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని చిన్న మంట మీద వేయించుకోవాలి. అందులో మొక్కజొన్న నూక వేసుకుని నిమిషం పాటు గరిటెతో అటూ ఇటూ తిప్పుతూ వేయించుకోవాలి.
ఆ తర్వాత కొబ్బరిపాలు, బేకింగ్‌ సోడా కలుపుకుని ఇడ్లీ పిండిలా చేసుకోవాలి. అనంతరం ఇడ్లీ ప్లేేటుకు నెయ్యి రాసుకుని.. కొద్దికొద్దిగా మిశ్రమం వేసుకుని ఆవిరిపై ఉడికించుకోవాలి. ఇవి బలానికి బలాన్నీ, రుచికి రుచినీ అందిస్తాయి.
కొబ్బరి బొబ్బట్లు
కావలసిన పదార్థాలు :
బెల్లం తరుగు – పావు కిలో, తురిమిన కొబ్బరి – పావు కిలో, శనగపప్పు – పావు కిలో, గోధుమపిండి – 300 గ్రాములు, యాలుకల పొడి – ఒక స్పూను.
తయారీ విధానం : కుక్కర్లో ముందుగా నానబెట్టిన శనగపప్పును వేసి ఆరు నుంచి ఏడు విజిల్స్‌ వరకు ఉడికించాలి. అప్పుడు పప్పు బాగా మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్‌ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి. ఆ నెయ్యిలో బెల్లం తరుగు, కొబ్బరి తురుమును వేసి బాగా కలపాలి. చిన్న మంట మీద పెడితే ఇవి మాడకుండా ఉంటాయి. అందులో యాలకుల పొడిని చల్లి బాగా కలుపుకోవాలి. ముందుగా ఉడికించుకున్న శనగపప్పును నీరు లేకుండా వడగట్టుకొని వేసుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలపాలి. గట్టిగా అయిన తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేయాలి.
ఇప్పుడు గోధుమ పిండిలో కాస్త నూనె లేదా నెయ్యి వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండి మృదువుగా కలుపుకున్నాక చిన్న ముద్దను తీసుకొని పూరీలాగా ఒత్తుకోవాలి. అందులో శనగగపిండి, కొబ్బరి తురుము మిశ్రమాన్ని పెట్టుకొని దాన్ని పూరీలా మడత పెట్టుకొని తిరిగి ఒత్తుకోవాలి. స్టవ్‌ మీద పెనం పెట్టి నెయ్యి వేయాలి. దానిపై ఒత్తుకున్న బొబ్బట్టు వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.

కొబ్బరితో దోసె..
కావలసిన పదార్థాలు :
బియ్యం – రెండు కప్పులు, తురిమిన కొబ్బరి – అర కప్పు, చక్కెర – రెండు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు తగినంత.
తయారీ విధానం :
బియ్యాన్ని రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే నీళ్లను వడకట్టి.. బియ్యం, కొబ్బరి తురుము వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పంచదార, ఉప్పువేసి కలపాలి. తరువాత వాటిని దోసెల మాదిరిగా నూనె వేసి, కొద్దిగా మందంగా వేసుకోవాలి. ఇవి చాలా రుచిగా ఉంటాయి.
కొబ్బరి పాలతో ‘ఫిష్‌’ కర్రీ…
కావలసిన పదార్థాలు : చేపముక్కలు – 8, ఉల్లిగడ్డ పేస్ట్‌ – 4 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌-2 స్పూన్లు, పచ్చిమిర్చి పేస్ట్‌- 2 స్పూన్లు, జీలకర్ర పొడి- 4 స్పూన్లు, కారం – 2 స్పూన్లు, పసుపు పొడి- 2 స్పూన్లు, గరం మసాలా పొడి- టీ స్పూన్‌, జీలకర్ర- ఒక స్పూను, కొబ్బరి పాలు- రెండు కప్పులు, నూనె- 4 స్పూన్లు, ఉప్పు- సరిపడా.
తయారు చేసే విధానం:
మొదటగా చేప ముక్కలకు కొద్దిగా పసుపు, ఉప్పు పట్టించి అరగంట పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత చేప ముక్కలను నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత… వాటిని మరో ప్లేట్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే పాత్రలో… మరికొంచెం.. నూనె వేసి కాగిన తర్వాత… జీలకర్ర, బిర్యానీ అకు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో ఉల్లిగడ్డ పేస్ట్‌ కూడా వేసి బ్రౌన్‌ కలర్‌ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే జీలకర్ర పొడి, కారం, వేసి కాసేపు వేయించాలి. కొద్దిసేపటి తర్వాత కొబ్బరి పాలను తీసుకొని… ఆ మిశ్రమంలో పోస్తూ… కలుపుకోవాలి. ఇప్పడు అందులో చేప ముక్కలు వేసి… చిన్నగా కలపాలి… తగినంత ఉప్పువేసి… చేపముక్కలు పూర్తిగా ఉడికే వరకూ సన్నని మంట మీద ఉడికించుకోవాలి. చివ రిగా అందులో గరం మసాలా పొడి వేసి, కొత్తిమీర వేసి స్టౌ ఆఫ్‌ చేయాలి. 10 నిమిషాలు అలాగే ఉంచి… స్టౌ మీద నుంచి దించుకోవాలి. ఇక మీకు… కొబ్బరి పాలతో ‘ఫిష్‌’ కర్రీ రెడీ అయినట్లే. అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది.

Spread the love