కేంద్ర ప్రభుత్వ వైఖరిపై విరుచుకుపడిన కపిల్‌ సిబల్‌

నవతెలంగాణ – న్యూఢిల్లీ :  నీట్‌ వివాదంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిపై  ఎంపి కపిల్‌ సిబల్‌ విరుచుకుపడ్డారు. ఈ వివాదంపై ప్రధాని మోడీ మౌనం వహించడం సరికాదన్నారు. ఆదివారం ఆయన జాతీయ మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. నీట్‌ వివాదంపై సుప్రీంకోర్టు నియమించే అధికారులతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. భవిష్యత్తుల ఈ పరీక్షను ఎలా నిర్వహించాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలని అన్నారు. రానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ అంశాన్ని బలంగా లేవనెత్తాలని అన్ని రాజకీయ పార్టీలకు సూచించారు. అయితే చర్చకు రాకపోవచ్చని, కోర్టు పరిధిలో ఉందంటూ ప్రభుత్వం చర్చకు అనుమతించకపోవచ్చని అన్నారు.

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ (ఎన్‌టిఎ) దుర్వినియోగమైందని, ఈ సంస్థ అవినీతిని మీడియా వెలుగులోకి తీసుకు వచ్చిందని అన్నారు. గుజరాత్‌లో జరిగిన కొన్ని ఘటనలు కలవరపరిచాయని, దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించాయని అన్నారు. తీవ్రమైన ప్రశ్నలలో కొన్నింటికీ ఎన్‌టిఎ సమాధానమివ్వాలని తాను భావిస్తున్నాని అన్నారు.
ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగినప్పుడల్లా మోడీ అనుచరులు ( అంధ్‌ భక్తులు) యుపిఎని నిందిస్తారని ఇది ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నారు. ఈ చట్టాన్ని ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, దీనికి యుపిఎతో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. నీట్‌ ప్రశ్నాపత్రం లీక్‌ కాలేదని, రిగ్గింగ్‌ ఆరోపణలను తిరస్కరిస్తూ విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చేసిన వ్యాఖ్యలపై కూడా సిబల్‌ మండిపడ్డారు. ఒక్క గుజరాత్‌లోనే కాదని దేశవ్యాప్తంగా పరీక్షల విధానంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని ధ్వజమెత్తారు.

Spread the love