దేశం తరపున కేరళ..

Kerala on behalf of the country..ఢిల్లీలో ధర్నాచౌక్‌ జంతర్‌మంతర్‌. కార్మికులో రైతు లో కాదు, రాష్ట్ర ప్రభుత్వాలే ధర్నాలకు దిగాల్సిరావడం నేటి పరిస్థితి. రాష్ట్రాల ఆర్థిక హక్కుల్ని, రాజకీయ హక్కుల్ని, యావత్‌ సమాఖ్య నిర్మాణాన్ని కూల్చివేస్తున్న కేంద్ర సర్కార్‌పై కేరళ చేస్తోన్న పోరు దేశంలోని అన్ని రాష్ట్రాల తరుపునా అనేది స్పష్టం. కేరళ, దీనికి ఒక రోజు ముందు కర్నాటక ప్రభుత్వం సైతం ఇదే వేదిక నుంచి కేంద్రంపై తన నిరసన గళం వినిపించింది. స్వయంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులే ఈ ఆందోళన లకు నేతృత్వం వహించగా ఆ రాష్ట్రాల ప్రజా ప్రతినిధులంతా పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా రాష్ట్రాల హక్కులను, సమాఖ్య వ్యవస్థను కాపాడు కోవడమే తమ పోరాట లక్ష్యంగా పినరై విజయన్‌, సిద్ధ రామయ్యలు స్పష్టం చేయడం గమనార్హం. అందువల్ల ఇదేదో కేరళ, కర్నాటకలకు సంబంధించిన విషయం మాత్రమే అనుకుంటే పొరపాటు. దేశ సమైక్యతకూ రాష్ట్రాల మనుగడకు సంబంధించిన పోరాటంగా భావించాలి.
భారత రాజ్యాంగం ఈ దేశాన్ని ”యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌”గా అభివర్ణించింది. రాష్ట్రాల సమాఖ్యగా నిర్దేశిం చింది. కానీ మోడీ సర్కారు గత దశాబ్ద కాలంగా ఈ సమాఖ్య భావననే నిర్వీర్యం చేస్తోంది. ”యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌”ను కాస్తా ”యూనియన్‌ ఓవర్‌ స్టేట్స్‌” (స్టేట్స్‌పై యూనియన్‌)గా మార్చేస్తోంది. భౌగోళికంగా సాంస్క తికంగా భిన్న ప్రాంతాల, జాతుల సమాహారం ఈ దేశం. ఆమేరకు స్వరూప స్వభావాల్లోనే కాదు, ప్రజల అవస రాలూ ఆదాయాల్లోనూ తేడాలుంటాయి. తదనుగుణం గా స్థానిక ప్రజలకు ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర ప్రభు త్వాలు మాత్రమే సరైన నిర్ణయాలు తీసుకోగలవు. ఈ కారణం చేతనే దేశాన్ని రాష్టాల సమాహారంగా పేర్కొన డమే గాక, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య స్పష్టమైన అధి కార విభజన చేసింది మన రాజ్యాంగం. దీనికి పూర్తి విరు ద్ధంగా వ్యవహరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. రాష్టాల హక్కు లనూ అధికారాలను ఒక్కొక్కటిగా అపహరిస్తూ సమాఖ్య విధానానికే తూట్లు పొడుస్తోంది. శాంతిభద్రతలతో సహా కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి జాబితాలోనివే కాదు, రాష్ట్రాల జాబితాలోని అధికారాలను కూడా స్వాహా చేస్తోంది. ఇందుకోసం అప్రజాస్వామికంగా చట్టాలు చేస్తోంది.
అడుగడుగునా రాష్ట్రాల నిర్ణయాలపై ఆంక్షలు విధి స్తూ, గవర్నర్ల ద్వారా వాటి అభివృద్ధికి అడ్డుపడుతోంది. అంతేనా… వాటి ఆదాయ వనరులకు సైతం గండి కొడు తోంది. జీఎస్టీ ద్వారా ప్రధాన ఆదాయ వనరైన పన్నులపై రాష్ట్రాల నియంత్రణను తొలగించి తన ఆధీనంలోకి బదలాయించుకుంది. అందులో రాష్ట్రాల వాటాను క్రమేణా కుదిస్తోంది. జీఎస్టీ పన్ను లైతే రాష్ట్ర ప్రభుత్వాలతో పంచుకోవాల్సి వస్తుందని సెస్‌లు, సర్‌ఛార్జీల రూపంలో దొడ్డిదారిన కొల్లగొడు తోంది. ఉచితాల పేరుతో, అవి ప్రభుత్వాలకు భారమనే సాకుతో సంక్షేమ పథకాలపై దాడి చేస్తోంది. స్థానిక ప్రభుత్వ పథకాలు కాకుండా కేంద్రం రూపొందించిన పథ కాలను మాత్రమే అమలు పరుచాలంటోంది. వాటికి యాభై శాతం నిధులు రాష్ట్రాలే భరించాలంటోంది. అంటే ”సొమ్ము రాష్ట్రాలదీ సోకు కేంద్రానిది” అన్నమాట. కేంద్రం ఇవ్వాల్సిన మిగిలిన యాభై శాతం నిధులను కూడా వారి షరుతులకు లోబడితేనే ఇస్తానంటోంది. మో టార్లకు మీటర్లు బిగించాలనడం ఇందుకో ఉదాహరణ మాత్రమే. ఇలా చెప్పుకుంటూపోతే కేంద్ర పాలకుల లీలా విన్యాసాలు అనేకం…
దీనినే కేరళ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. సమాధానం చెప్పలేని కేంద్రం దీనిని ఉత్తర దక్షిణ సమస్యగా చిత్రించ జూస్తోంది. ఇదే నిజమైతే బెంగాల్‌లో తృణమూల్‌ ప్రభు త్వం కూడా కేంద్రంపై ఎందుకు నిరసన చేపట్టింది? తమిళనాడు సహా కేరళకు సంఘీభావం పలికిన ఢిల్లీ, పంజాబ్‌ ప్రభుత్వాలు కేంద్రాన్ని దక్షిణాది నుంచే నిరసిస్తున్నాయా? నిజానికి రాష్ట్రాలపై కేంద్రం సాగి స్తున్న ఈ దాడికి బీజేపీ పాలిత రాష్ట్రాలతో సహా ఏ రాష్ట్ర మూ మినహాయింపు కాదు. అన్ని రాష్ట్రాలదీ అదే కథ ఒకే వ్యథ. అయితే విపక్ష పార్టీల ప్రభుత్వా లున్న చోట వివక్ష, కక్షసాధింపులు అదనం. ఇందుకు కేరళ ఓ ఉదాహరణ మాత్రమే. కేరళ ప్రభుత్వం మోడీ సర్కారుకు భిన్నంగా ప్రత్యా మ్నాయ విధానాలతో ముందుకు సాగుతోంది. ఇది సహించలేని కేంద్రం గ్రాంట్ల విడుదల మొదలు రుణ పరిమితులు విధించడం వరకూ రకరకాల ఆంక్షలు విధిస్తోంది. అయిన ప్పటికీ దాదాపు అన్ని అభివృద్ధి సూచీల్లో అగ్రగామిగా దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పుడు కేంద్రం బారినుంచి హక్కుల రక్షణకు రాష్ట్రాలకూ మార్గం చూపుతోంది. ఇది మింగుడుపడని మోడీ పరివారం ఉత్తర దక్షిణ వాదాన్ని ముందుకు తెస్తోంది. ఇది ముమ్మాటికీ అబద్ధం, అసం బద్ధం. ఇంకా చెప్పాలంటే దేశాన్ని ఉత్తర దక్షిణ విభజన దృష్టితో చూస్తున్నది కేంద్రమే. ఇందుకు ఉదా హరణలు కోకొల్లలు. కానీ కేరళ ఇందుకు భిన్నం. వారిది దేశ ఐక్యతకు, సమాఖ్య నిర్మాణాన్ని కాపాడుకునేందుకు సాగుతున్న ప్రజాస్వామ్య పోరాటం.

Spread the love