మధిర నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్ధి పాలడుగు భాస్కర్ ఉద్యమ ప్రస్ధానం…

నవతెలంగాణ మధిర: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, సీఐటీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి ఖమ్మం జిల్లా, గార్ల మండల కేంద్రానికి చెందిన పాలడుగు భాస్కర్ ది సీపీఐ(ఎం) మధిర నియోజకవర్గ అభ్యర్థిగా రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. భాస్కర్ సీపీఐ(ఎం) పార్టీ పూర్తి కాలం కార్యకర్తగా కొనసాగుతున్నారు. భార్య సునీత గృహిణి, ఇద్దరు పిల్లలు రాహుల్, సంఘవి ఉన్నత విద్య పూర్తి చేసుకొని ప్రవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా, గార్లలో పాలడుగు చిన్న వెంకయ్య, వెంకటమ్మ దంపతుల పెద్ద కుమారుడు పాలడుగు భాస్కర్. దళిత కుటుంబానికి చెందిన ఆయనది అతి నిరుపేద, వ్యవసాయ కార్మిక కుటుంబం. గార్లలో ప్రాథమిక విద్య, మహబూబాబాద్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్, ఖమ్మంలోని సిద్ధారెడ్డి కాలేజీలో 1992 నుంచి 1995 వరకు డిగ్రీ చదువుకున్నారు. ఈ సమయంలో ఎస్ఎఫ్ఐలో పనిచేస్తూ వామపక్ష భావాలను అలవర్చుకున్నారు. అనంతరం గార్ల మండల ప్రజాశక్తి దినపత్రిక విలేఖరిగా పని చేశారు. ఈ సమయంలోనే సీపీఐ(ఎం), సీఐటీయులో చురుకైన పాత్ర నిర్వహించారు. సీపీఐ(ఎం)లో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఎదుగుతూ వచ్చారు.
1999లో పిఎసిఎస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. తన మండలంలో రైతులకు గిట్టుబాటు ధర, ఋణ సదుపాయం కల్పించాలని, కల్తీ ఎరువులను, కల్తీ విత్తనాలను అరికట్టాలని తదితర రైతాంగ సమస్యలపై గట్టి కృషి చేశారు. గార్ల చెరువు కట్ట ఎత్తు పెంపుదల ఉద్యమం, ముల్కనూరు ప్రాజెక్టు సాధన కోసం సాగిన ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించారు. గిరిజన ప్రాంతం గార్లలో పనిచేసిన కాలంలో పోడు భూముల సాధన, అటవీ హక్కుల చట్టం కోసం జరిగిన పోరాటంలో పాల్గొన్నారు. బిజెపి నరేంద్రమోడీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా తీసుకొచ్చిన 3 రైతు చట్టాల రద్దు కోసం కొనసాగిన రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి నాయకత్వం వహించారు.
370 రోజులు ఢిల్లీ సరిహద్దుల్లో సాగిన రైతాంగ పోరాటంలో కూడా భాగస్వాములయ్యారు. పార్టీ అవసరాలరీత్యా పార్టీ జిల్లా నాయకత్వం ఖమ్మం జిల్లా కేంద్రానికి తీసుకువచ్చారు. ఖమ్మం జిల్లా కెవిపిఎస్ వ్యవస్థాపక జిల్లా ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. యస్.సి, యస్టి కమీషన్ చైర్మన్ జస్టిస్ పున్నయ్య పర్యటన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా దళిత, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి, వాటి పరిష్కారానికై పోరాడారు. తదనంతరం ఖమ్మం జిల్లా సిఐటియు కేంద్రంలో బాధ్యతలు నిర్వహించారు. తదనంతరం ఉద్యమ నిర్మాణంలో భాగంగా రాష్ట్ర కేంద్రం హైదరాబాద్కు వెళ్ళారు. 2003లో రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్, విఆర్ఎ, భవన నిర్మాణం, హమాలీ, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, ఐకెపి విఓఏలు, విద్యుత్, మిషన్ భగీరథ, వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, మార్కెట్ సెక్యూరిటీ గార్డ్స్, బేవరేజ్ హమాలీల రంగాలకు ప్రధాన బాధ్యతలు చేపట్టి అనేక ఆందోళనలు, పోరాటాలు నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ మధ్య కాలంలో వీఆర్ఎ పర్మినెంట్ కోసం జరిగిన పోరాటానికి మార్గదర్శకత్వం వహిస్తూ ప్రభుత్వంతో చర్చలు ఫలప్రదం కావడంలో కీలక పాత్ర పోషించారు.
2006 సంవత్సరంలో కుల వివక్షత, అణిచివేతకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులుతో కలిసి 13 రోజులు, 205 గ్రామాల్లో సైకిల్ యాత్రను నిర్వహించారు. ఈ కాలంలో అనేక పోరాటాల్లో పాలుపంచుకున్నారు. 2007లో సీఐటీయు అఖిలభారత కౌన్సిల్ సభ్యుడిగా, 2016లో ఆలిండియా వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 20ఏండ్లుగా మున్సిపల్, పంచాయతీ, ఇతర రంగాల కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ మున్సిపల్, గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీలకు నాయకత్వం వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీకి ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తూ కొండగుంట వెంకటేశ్వర్లు, వెన్నపూస గోపాల్రెడ్డి, దేవీప్రసాద్, స్వామిగౌడ్లతో కలిసి పీఆర్సీ సాధన పోరాటంలో ముఖ్య భూమిక పోషించారు. ఆర్టీసీ పరిరక్షణ కోసం జరిగిన 56 రోజుల నిరవధిక సమ్మెలో రాష్ట్రమంతా పర్యటించి ఉద్యమంలో ప్రత్యక్షంగా భాగస్వామ్యులయ్యారు.
2022లో షెడ్యూల్ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు ప్రభుత్వం జీవోలను సవరించి వేతనాలు పెంచకపోవడాన్ని నిరసిస్తూ 22 రోజులు పాటు 450 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. 2023లో గ్రామ పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనాల పెంపు, కారోబార్లకు ప్రత్యేక హెూదా కల్పించాలని డిమాండ్ చేస్తూ 350 కిలోమీటర్లు 17 రోజుల పాటు మండుటెండలో పాదయాత్ర కొనసాగించారు. 2022 మార్చిలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై ప్రస్తుతం అదే బాధ్యతల్లో కొనసాగుతున్నారు. 2023లో బెంగళూరులో జరిగిన సీఐటీయూ జాతీయ మహాసభల్లో సీఐటీయూ జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలో పాల్గొన్నారు. రైతు, వ్యవసాయ కార్మికుల కూలి, భూమి, ఇండ్ల స్థలాల సాధన కోసం జరిగిన అనేక ఉద్యమాల్లో భాగ్యస్వామ్యం అవుతూ పోలీసుల నిర్బంధ కాండను సైతం ఎదుర్కొంటూ శ్రమజీవుల హక్కుల కోసం నినదిస్తున్నారు. 2023 నవంబర్ 30న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ పాలడుగు భాస్కర్ను మధిర నియోజకవర్గ అభ్యర్థిగా ఖరారు చేసింది. ఖమ్మం జిల్లా సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై మంచి అవగాహన కల్గిన రాష్ట్రస్థాయి నేతగా గుర్తింపు పొంది మధిర నియోజకవర్గ బరిలో నిలిచారు.
పేరు                    : పాలడుగు భాస్కర్
ప్రస్తుత హెూదా       : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు,
                            సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
చదువు                 : బీఏ
సామాజిక తరగతి    : ఎస్సీ
తల్లిదండ్రులు          : చిన్న వెంకయ్య, వెంకటమ్మ
పిల్లలు                 : రాహుల్, సంఘవి
సొంత ఊరు          : గార్ల, ఇల్లందు నియోజకవర్గం

Spread the love