బడా అమెరికన్‌ కార్ల కంపెనీల్లో సమ్మెకు సన్నద్ధం

– 97శాతం మంది యునైటెడ్‌
– ఆటో వర్కర్స్‌ సభ్యుల ఓటు
వాషింగ్టన్‌ : సెప్టెంబరు 14కల్లా కొత్త కాంట్రాక్టుపై ఒప్పందం కుదరని పక్షంలో అమెరికాకు చెందిన మూడు బడా కార్ల తయారీ సంస్థలకు వ్యతిరేకంగా సమ్మె కార్యాచరణ చేపట్టేందుకు యునైటెడ్‌ ఆటో వర్కర్స్‌ (యుఎడబ్ల్యు) సభ్యులు నిర్ణయించారు. జనరల్‌ మోటార్స్‌, స్టెలాంటిస్‌ (పూర్వపు క్రిస్లర్‌), ఫోర్ట్‌ కంపెనీల్లో పనిచేసే 97శాతం మంది సభ్యులు సమ్మెలకు, వాకౌట్‌లకు అనుకూలంగా ఓటు వేశారని యూనియన్‌ ప్రకటించింది. కార్మిక శక్తి అంతా సమైక్యంగా వుందని దీన్ని బట్టి స్పష్టమవుతోందని యుఎడబ్ల్యు అధ్యక్షుడు షాన్‌ ఫెయిన్‌ చెప్పారు. కాంట్రాక్టు పొడిగింపులకు యూనియన్‌ అంగీకరించబోదని ఫెయిన్‌ స్పష్టం చేశారు. కొత్త కాంట్రాక్టు కావాల్సిందేనన్నారు. ఒక ఒప్పందం కోసం ఒక నమూనాను నిర్ణయిం చడానికి లక్షిత కంపెనీని యూనియన్‌ ఎంపిక చేయబోదని చెప్పారు. ”మాకు అవసరమైనవన్నీ సాధించడం కూడా మాకు సాధ్యం కాదు.” అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ కంపెనీలు అంకిత భావంతో తమ డిమాండ్ల పట్ల సీరియస్‌గా ఆలోచించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నాలుగేళ్ల కాలంలో 46శాతం వేతనాలు పెరగాలని యూనియన్‌ డిమాండ్‌ చేస్తోంది. 40గంటల వేతనానికి 32గంటల వారం -పని దినాలుగా వుండాలని, రిటైరైన వారికి పెన్షన్లు, ఆరోగ్య సంరక్షణ వంటి వాటిని నిర్వచించాలని, అలాగే రిటైరైన వారి ప్రయోజనాలు పెంచాలని, ప్లాంట్‌ మూసివేతలపై సమ్మె చేసే హక్కు కావాలని యూనియన్‌ డిమాండ్‌ చేస్తోంది.

Spread the love