కుటిల రాజకీయాలతోనే మణిపూర్‌ మంటలు

ఇటీవలి చరిత్రలో ఎన్నడూ లేనంతగా మణిపూర్‌ దురంతం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కార్‌ వాషింగ్‌ వర్క్‌షాప్‌లో పనిచేసుకుని బతికే ఇద్దరు ఆదివాసి యువతులను వివస్త్రలను చేసి వెంటాడి మానప్రాణాలు బలిగొంటున్న బీభత్స దృశ్యం జాతిని కలచివేసింది. ఘోరకలి జరిగాక రెండున్నర నెలలకు ఈ వీడియోలు బయటకు వచ్చినా ఇంత ఆగ్రహావేదనలు ప్రజ్వరిల్లాయంటే జరిగింది ఎంత దారుణమో, వాస్తవ పరిస్థితి మరెంత ఘాతుకంగా ఉందోననే సందేహం ప్రతివారిలో కలిగింది. దానికదే విషయం బహిర్గతమయ్యే వరకూ తెలియనట్టే ప్రవర్తిస్తున్న డబుల్‌డబ్బా పాలకులకు ఘోర పరాభవం ఎదురైంది. మొన్ననే ఎన్‌డీఏ విస్తృత సమావేశంలో గజమాల వేయించుకుని సూక్తులు వినిపించిన విశ్వగురు ప్రధాని మోడీ బోనులో నిలబడాల్సి వచ్చింది. అయితే అలాంటి పరాభవాలు పట్టించుకునే ఘటం కాదు గనక పార్లమెంటు సమావేశాల సందర్భంగా చేసిన అనివార్య వ్యాఖ్యలలో ఆయన ఈ తప్పుకు దేశంలోని వంద కోట్లమంది ప్రజలదీ బాధ్యత అన్నట్టు మాట్లాడేశారు. దేశం, సమాజం సిగ్గుపడాలన్నారు. విశ్వగురుగా గజమాల వేయించుకోవడానికి నమో నమో కీర్తనలతో ఊరేగడానికి తాను, అమానుషానికి మాత్రం అందరిదీ బాధ్యత! ఇంత కన్నా విడ్డూరమైన విపరీతమైన విషయం మరొకటి ఉంటుందా? కాని బీజేపీ మోడీ పాలనలో అదే భారతీయ వాస్తవం.
చర్చకే దిక్కులేదు, చర్య ఎక్కడీ
మణిపూర్‌లోనూ, ఢిల్లీలోనూ పాలించేది అక్షరాలా వారు చెప్పే డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌. ఆపైన ఈశాన్య రాష్ట్రాలకు బీజేపీ తరపున బాధ్యుడూ, మంత్రిగా ఈ శాఖకు తన కుడిభుజమైన హోంమంత్రి అమిత్‌ షానే. మణిపూర్‌ పాలకుడైన బీరేన్‌ సింగ్‌ సరేసరి, అయినాసరే దేశ ప్రజలు వందకోట్ల మంది సిగ్గుపడాలి గాని ఈ ఇద్దరు ముగ్గురు మనుషులు ఈషణ్మాత్రం సిగ్గుపడినట్టు కనిపించరు. తమకు నచ్చని రాష్ట్రాలలో చీమ చిటుక్కుమంటే ట్వీట్లు పెట్టి ఫీట్లు చేసే సంఫ్‌ు పరివార్‌ పెద్దలెవరూ స్పందించరు. నూతన పార్లమెంటు భవనం ముందు ఈ ఘోరవార్తపై స్పందిస్తూ మణిపూర్‌ పుత్రికలకు జరిగిన ఘోరం పట్ల ప్రతివారూ విచారిస్తున్నారని కారకులెవరైనా వదలిపెట్టే ప్రసక్తి లేదని గంభీర ప్రకటన చేసిన ప్రధాని ఆ సభలోనే ఈ సమస్యపై చర్చకు హాజరు కారు. సమగ్ర చర్చ కాకుండా స్వల్ప వ్యవధితో సరిపెడతామంటారు. బాధ్యులెవరైనా కఠినచర్యలు తీసుకుంటామని గర్జించినవారు తమ అనుంగు ముఖ్యమంత్రిని మాత్రం ముట్టుకోరు, రాజీనామాకు ఆదేశించరు. మే 4న జరిగిన ఈ దారుణంపై మే 14న ఎఫ్‌ఐఆర్‌ నమోదైతే ఇంతకాలం ఏ గుడ్డిగుర్రానికి పళ్లుతొముతున్నారని నిలదీయరు. ఇవన్నీ చేయకపోవడం ఒకటి, ఈ వీడియో ఇంతకాలం తర్వాత ఇప్పుడే రావడంలో కుట్ర ఉందని ఆరోపిస్తారు. గతంలో జరిగిన మరికొన్ని ఆఘాయిత్యాలతో పోటీపెట్టి మాట్లాడతారు. చర్చలు జరిపిస్తారు, వ్యాసాలు రాయిస్తారు. జరిగిందాన్ని కప్పిపుచ్చడానికి తీవ్రత తగ్గించడానికి సకల శక్తియుక్తులూ వెచ్చిస్తారు. అందుకే ఇది డబుల్‌ హిపోక్రసీ. రెట్టింపు వంచన. టెలిగ్రాఫ్‌ పత్రిక 79 మొసళ్ల కార్టూన్‌ వేసి ఆపైన మోడీ విచారాన్ని పెట్టి క్యాప్షన్‌ కూడా రాయకుండా వదలిపెట్టింది. ఎందుకంటే నవవర్ష నమో పాలన తర్వాత వీటికి తేలిగ్గా లోబడిపోయే స్థితిలో దేశ ప్రజలు లేరు.
కాషాయ వ్యూహాల కరాళ ఫలితమే
ఈశాన్య రాష్ట్రాలు కూడా తమ ప్రాబల్యంలోకి రావడం మోడీ మహత్తులలో ఒకటని చెప్పుకునే బీజేపీ అందుకు అనుసరించిన ఎత్తులు జిత్తుల పర్యవసానమే ఈశాన్య జ్వాలలు. గుర్తు చేసుకుంటే కొంతకాలం కిందట అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్‌ల మధ్య సరిహద్దు వివాదం ప్రజ్వరిల్లడం ఎవరూ మర్చిపోలేదు. నిరంతరం తన మాటలతో వివాదాలు సృష్టించే అస్సాం ముఖ్యమంత్రి హేమంత్‌ బిశ్వశర్మ పరిష్కారానికి ఏమీ చేసింది లేదు ఎగదోయడం తప్ప. తర్వాత మేఘాలయతోనూ ఇదే తరహా ఘర్షణ చెలరేగి ఆరుగురు చనిపోయారు. ఇవి అసాం నుంచి విడదీయబడిన రాష్ట్రాలు కావడం గుర్తుంచుకోదగింది. ఎందుకంటే 1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఈశాన్యాన మణిపూర్‌, త్రిపుర మాత్రమే కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉండేవి. 1954లో అరుణాచల్‌ ప్రదేశ్‌, 1963లో నాగాలాండ్‌, 1969లో మేఘాలయ,1972లో మిజోరాం అస్సాం నుంచి విడదీసి ఏర్పాటు చేసినవే. మొదటి నుంచి ఉన్న మణిపూర్‌, త్రిపుర 1972లో పూర్తి రాష్ట్రాలయ్యాయి. ఈశాన్య ప్రాంతం నేరుగా బ్రిటిష్‌ వారి పాలనలో ఎన్నడూ లేదు. వారు కావాలనే చైనాకూ తమకూ మధ్య ఒక విడుపులాగా దాన్ని అట్టిపెట్టారు. అక్కడ అనేక జాతులు, ఉపజాతుల గిరిజనులు, ఆదివాసులు జీవించేవారు. నాగా, కుకీ, మిసో తదితర తెగలు ఉపజాతులు అలాంటివే. గిరిజనులలో క్రైస్తవ మిషనరీల ప్రభావం కూడా ఎక్కువే. మణిపూర్‌ మైదాన ప్రాంతాలలో మైతేయిలు ఉంటారు. కుకీలు మూలవాసులైనప్పటికీ రాజకీయ వ్యవస్థలో మైతేయిల ప్రాబల్యమే ఎక్కువ. ఈ చిన్న రాష్ట్రంలో మొత్తం 36తెగలు ఉపజాతులు ఉంటారంటే సమస్య అర్థమవుతుంది. మైతేయిలు ఇంపాల్‌ లోయలో ఉంటూ హిందూమతాన్ని సనామహి అనే స్థానిక విశ్వాసాలను ఆచరిస్తారు. కుకీలు, నాగాలు అత్యధికంగా క్రైస్తవ మతానుయాయులు. ఈతెగలు ఉపజాతుల మధ్య స్వార్థరాజకీయ శక్తులు పట్టించుకోని కేంద్రం కారణంగా నిరంతర ఘర్షణలు తిరుగుబాట్లు జరుగుతూ వచ్చాయి. అందులో నాగా, కుకీల తగాదాలు ప్రధానమైనవి. 2017లో బీజేపీ అధికారంలోకి రావడంతో ఆరెస్సెస్‌ రంగంలోకి దిగి హిందూ విశ్వాసాలు గల మైతేయిలను క్రైస్తవాన్ని అనుసరించే కుకీలకు వ్యతిరేకంగా కూడగట్టింది. దాంతో ఇది మత వివాదంలా కూడా మారిపోయింది.
ఎఫ్‌ఐఆర్‌ తెలియదా?
పొరుగునే ఉన్న మయన్మార్‌లో 2021లో సైనిక నియంతృత్వం అధికారం కైవసం చేసుకున్నాక దాడి తట్టుకోలేక వేలాది మంది చిన్‌ శరణార్థులు వచ్చిపడటంతో పరిస్థితి మరింత దిగజారింది. వీరు కూడా కుకీలే. మిజోరాం, మణిపూర్‌లలోని కుకీలు వారిని ఆహ్వానించి ఆశ్రయమిచ్చారు. కాని మోడీ ప్రభుత్వం వారికి ఆశ్రయం నిరాకరించి అక్రమ చొరబాటుదారులుగా ప్రకటించింది. ఇదే సమయంలో బిరేన్‌ సింగ్‌ ప్రభుత్వం రిజర్వు అడవుల నుంచి కుకీలను భారీ ఎత్తున తొలగించడం మొదలెట్టింది. అడవులలో మాదక ద్రవ్యాల పంటలను నాశనం చేసేందుకు దాడి కూడా గిరిజనులను దూరం చేసింది. కుకీలు అక్రమ చొరబాటుదారులని ప్రచారం చేసే తీవ్రవాద మైతేయి వర్గాలకు ఆరెస్సెస్‌ వత్తాసునిచ్చింది. అస్సాం ముఖ్యమంత్రి శర్మ, బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ ఆ ప్రాంతంలో పనిచేస్తున్న కాలంలోనే కుకీ తీవ్రవాద సంస్థ యుకెఎల్‌ఎఫ్‌ (యునైటెడ్‌ కుకీ లిబరేషన్‌ ఫ్రంట్‌)తో సంబంధం పెట్టుకుని నిధులు సమకూర్చినట్టు తర్వాత వెల్లడైంది. ఇందుకు ప్రతిగా వారు 2017లోనూ 2019లోనూ బీజేపీకి ఎన్నికల్లో మద్దతునిచ్చారు. ఈ విషయం బయటకు వచ్చాక ముఖ్యమంత్రి బిరేన్‌సింగ్‌కు మైతేయిలలో కూడా మద్దతు లేకుండా పోయింది. కుకీలు ఆయనను తమ సమస్యలకు మూల కారణంగా ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. బీజేపీలోనే ఉన్న పదిమంది కుకీ ఎంఎల్‌ఎలు ప్రత్యేక పాలనా విభాగం కావాలని ఆందోళన మొదలెట్టారు. ఇప్పుడు మనం చూస్తున్న కల్లోలం వెనక ఇంత లోతైన నేపథ్యముందని గుర్తుంచుకోవాలి. పులి మీద పుట్రలా ఈ పరిస్థితులలో మైతేయిలను కూడా గిరిజనులుగా పరిగణించాలని మార్చి 27న మణిపూర్‌ హైకోర్టు తీర్పు చెప్పడం, దానికి అభ్యంతరం లేదని బీరేన్‌సింగ్‌ హడావుడిగా ప్రకటించడంతో ఈ ఘర్షణలు పరాకాష్టకు చేరాయి. ఈ క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోకపోగా కుటిల వ్యూహంతో మరింత రగలడానికి కారణమైనాయి. మే4వ తేదీ మహిళలపై ఘోర కలి వీడియో జులై 20 బయటకు వచ్చినప్పటికీ నిజానికి రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసులకు ఈ విషయాలు తెలియవని కాదు. మే రెండవ వారంలోనే వారు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం ఎఫ్‌ఐఆర్‌ నమోదు జరిగాయి. మే29న అమిత్‌షా అక్కడ పర్యటించి వచ్చారు. ఇక ఘనమైన మోడీకి ఈ సమస్య పట్టించుకునే ఆలోచనే లేకుండా పోయింది. ప్రతిపక్షాలు ఆందోళన, ఆగ్రహం వెలిబుచ్చుతున్నా చీమకుట్టినట్టు లేకపోయింది. మణిపూర్‌ నుంచి బీజేపీ తరపున రెండు ప్రతినిధి బృందాలు, ప్రతిపక్షాల తరపున ఒక బృందం ఆయన్ను కలుసుకోవడానికి ఢిల్లీలో నిరీక్షిస్తుంటే ఆయన మాత్రం అమెరికాలో భుజకీర్తులందుకుంటున్నారు. అమెరికా, ఫ్రాన్స్‌ వంటి దేశాలలోనూ యూరోపియన్‌ పార్లమెంటులోనూ మణిపూర్‌ పరిస్థితిపై తీర్మానాలు చేస్తుంటే పట్టించుకోలేదు సరికదా చర్చ కూడా చేయకుండా మన పార్లమెంటును వాయిదా వేయించారు! కనుక మణిపూర్‌ పుత్రికలంటూ ఆయన మాట్లాడటాన్ని మొసలి కన్నీరు కన్నా మోడీ కన్నీరు అంటే చాలదా?
జరగాల్సిందేమిటి?
మాట్లాడితే వీర జవాన్లు దేశభక్తి అంటూ ఊదరగొట్టే కేంద్ర పాలకులు కార్గిల్‌ యుద్ధంలో పాల్గొన్న సైనికుని భార్యకు ఈ దుర్గతి పడితే స్పందించకపోవడం ఎమంటాం? మే 4 రాత్రి దుష్టమూకలు వేల సంఖ్యలో ఆగ్రామాన్ని చుట్టుముట్టి కుకీ కుటుంబాలను తరిమేయడమే గాక ఇద్దరు యువతుల బట్టలూడదీయించి మృగాల్లా హింసిస్తూ ఈడ్చుకుపోయారు. ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. వాళ్లను కాపాడేందుకు వెళ్లిన వారిని చంపేశారు. రక్తసిక్తమైన శరీరంతో ఆ అభాగ్యురాళ్లు ఇద్దరినీ తీసుకుని వారు ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్‌కు చేరుకుంటే పరిధి సమస్య వచ్చింది. దాన్ని మరో స్టేషన్‌కు బదలాయించారు. ఇంత జరిగినా ఏ చర్య తీసుకున్నది లేదు, ఇంటర్‌నెట్‌ సెన్సార్‌ ఉంది గనక బయటకు రాలేదు. ఈ లోగా మహిళా కమిషన్‌కు ముఖ్యమంత్రికి ఫిర్యాదు వెళ్లినా స్పందన లేదు. వందల సంఖ్యలో ఇలాంటివి వస్తుంటే ఏదని చూస్తామన్నది వారి అహంకార పూరితమైన జవాబు. ఇంత జరిగినా ఆ ముఖ్యమంత్రిని ముట్టుకోని కేంద్రాన్ని ఏమనాలి? ఈ విషయంలో ముందే జోక్యం చేసుకుని తీవ్రంగా ఖండించిన సిజెఐ డివై చంద్రచూడ్‌ ప్రభుత్వం చర్య తీసుకోకుంటే తాము రంగంలోకి దిగాల్సి వస్తుందన్నారు. అత్యున్నత న్యాయమూర్తి స్పందనకూ ప్రభుత్వాధినేత స్పందనకూ తేడా కనిపిస్తూనే ఉంది. వాస్తవానికి రాని స్పందనకోసం వ్యవధి ఇవ్వడం కంటే సుప్రీంకోర్టు వెంటనే రంగంలోకి దిగి చర్య తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యమంత్రి బిరేన్‌ సింగ్‌ తక్షణం గద్దెదిగాలి. ఇప్పటికీ బయటకు రాని ఘోరాలు మరెన్ని ఉన్నాయో ప్రత్యేకంగా దర్యాప్తు చేసేందుకు ఒక కమిటీని నియమించాలి. బాధితుల రక్షణ కోసం తక్షణం కేంద్రం రంగంలోకి దిగాలి.

తెలకపల్లి రవి 

Spread the love