నవతెలంగాణ – మణిపుర్: ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్‌లో ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. స్థానిక శిశు నిష్తా నికేతన్ పాఠశాల ఎదుట నేటి ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళను కాల్చి చంపారు. మృతురాలి వివరాలు ఇంకా తెలియరాలేదు. కాగా.. పాఠశాలలు తెరుచుకున్న మరుసటి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. మణిపుర్‌లో అల్లర్ల కారణంగా గత రెండు నెలలుగా విద్యాసంస్థలు మూతబడ్డాయి. జులై 5నే రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలను తిరిగి తెరిచారు. ఉద్రిక్తతల భయంతో తొలి రోజు విద్యార్థులు అంతంత మాత్రంగానే హాజరయ్యారు. తాజాగా పాఠశాల బయట మహిళ హత్యకు గురికావడం ప్రజలను మరింత భయభ్రాంతులకు గురిచేస్తోంది.