పతక శతకం

 Hangzhou Asian Games 2023– 107 మెడల్స్‌తో భారత్‌ సెంచరీ
– కబడ్డీ జట్ల బంగారు ప్రదర్శన
–  సాత్విక్‌, చిరాగ్‌ సహా క్రికెట్‌లో స్వర్ణం
– హాంగ్జౌ ఆసియా క్రీడలు 2023
నవతెలంగాణ-హాంగ్జౌ
ఆసియా క్రీడల్లో టీమ్‌ ఇండియా సెంచరీ కొట్టింది. ఇంచియాన్‌లో 57, జకర్తాలో 70 పతకాలు సాధించిన భారత్‌.. ఇప్పుడు హాంగ్జౌలో ఏకంగా 100 మార్క్‌ దాటేసింది. అన్ని క్రీడాంశాల్లోనూ పతక పోటీలో నిలిచిన భారత్‌.. వంద మెడల్స్‌ టార్గెట్‌ను క్రీడల చివరి రోజు అందుకుంది. కబడ్డీ ఉమెన్స్‌, మెన్స్‌ జట్లు బంగారు ప్రదర్శనతో మెరువగా.. సాత్విక్‌, చిరాగ్‌ జోడీ గోల్డ్‌ మెడల్‌ కొట్టింది. క్రికెట్‌లో భారత్‌ చాంపియన్‌గా నిలిచి పసిడి ముద్దాడగా.. ఆర్చరీలో ఒకే ఈవెంట్‌లో గోల్డ్‌, సిల్వర్‌ లభించాయి. 2023 ఆసియా క్రీడలను భారత్‌ 107 పతకాలతో ముగించింది. 28 పసిడి, 38 రజతాలు, 41 కాంస్యాలతో పతకాల పట్టికలో భారత్‌ నాల్గో స్థానం సాధించింది.

కబడ్డీలో భారత్‌ బంగారు కూత. ఇటు అమ్మాయిలు, అటు అబ్బాయిలు పసిడి పతకాలతో అదరగొట్టారు. తొలుత అమ్మాయిల జట్టు 26-25తో చైనీస్‌ తైపీపై సాధికారిక విజయం నమోదు చేసింది. ఫైనల్లో చైనీస్‌ తైపీ నుంచి మనోళ్లకు గట్టి పోటీ ఎదురైంది. ప్రథమార్థంలో 14-9తో భారత్‌ ఐదు పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. కానీ ద్వితీయార్థంలో చైనీస్‌ తైపీ గట్టిగా పుంజుకుంది. చైనీస్‌ తైపీ సెకండ్‌ హాఫ్‌లో 16 పాయింట్లు సాధించింది. ఇదే సమయంలో భారత్‌ విరామం అనంతరం 12 పాయింట్లు మాత్రమే సాధించింది. ఆఖర్లో ఉత్కంఠకు దారితీసినా.. ఒక్క పాయింట్‌ తేడాతో అమ్మాయిలు పసిడి పతకం సొంతం చేసుకున్నారు. చైనీస్‌ తైపీ సిల్వర్‌ మెడల్‌తో సరిపెట్టుకుంది. ఇక వివాదాస్పదంగా మారిన మెన్స్‌ కబడ్డీ ఫైనల్లో భారత్‌ 33-29తో ఇరాన్‌పై విజయం సాధించింది. మరో నిమిషంలో మ్యాచ్‌ ముగుస్తుందనగా..భారత్‌ నుంచి రైడర్‌ పవన్‌ షెరావత్‌ కూతకు వెళ్లాడు. చావోరేవో తేల్చుకోవాల్సిన రైడ్‌లో పవన్‌ షెరావత్‌..ఇరాన్‌ డిఫెండర్లను టచ్‌ చేయకుండానే సైడ్‌లైన్‌ వద్ద నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఐదుగురు ఇరాన్‌ డిఫెండర్లు పవన్‌ షెరావత్‌ను కోర్టు ఆవలకు నెట్టేందుకు అతడికిపైకి దూసుకెళ్లారు. తొలుత ఫీల్డ్‌ అంపైర్‌ ఇరాన్‌కు ఓ పాయింట్‌ ప్రదానం చేశారు. కానీ భారత ఆటగాళ్లు అంపైర్లు, టీవీ అంపైర్‌తో వాగ్వివాదానికి దిగారు. దీంతో టీవీ రిఫరల్‌ అనంతరం కొత్త, పాత రూల్స్‌ను అనుసరించి భారత్‌కు నాలుగు పాయింట్లు అవార్డ్‌ చేశారు. అంపైర్‌ నిర్ణయం పట్ల ఇరాన్‌ ఆటగాళ్లు తీవ్ర నిరసన తెలిపారు. దీంతో వివాదం నడుమే టీమ్‌ ఇండియా కబడ్డీ పసిడి పతకం సొంతం చేసుకుంది. ప్రథమార్థంలో భారత్‌ 17-13తో మనోళ్లు ఆధిక్యంలో నిలువగా..విరామం అనంతరం మరో 17 పాయింట్లు సాధించారు. ద్వితీయార్థంలో ఇరాన్‌ 16 పాయింట్లు సొంతం చేసుకుంది. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన కబడ్డీ ఫైనల్లో భారత్‌ గోల్డ్‌ మెడల్‌ కైవసం చేసుకుంది. మహిళల, పురుషుల జట్లు బంగారు పతకాలు సాధించి..కబడ్డీలో పసిడి క్లీన్‌స్వీప్‌ చేశారు.
గురి తప్పని బాణం
ఆర్చరీలో భారత పతక వేట ఆటల చివరి రోజు సైతం కొనసాగించింది. తొలుత ఆల్‌ ఇండియన్‌ కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో పసిడి, రజతాలు సొంతమయ్యాయి. పసిడి పోరులో అభిషేక్‌ వర్మ, ప్రవీణ్‌ ఓజాస్‌లు ముందే భారత్‌కు పసిడి, రజత పతకాలు ఖాయం చేశారు. 149-147తో అభిషేక్‌ వర్మపై ప్రవీణ్‌ ఓజాస్‌ విజయం సాధించాడు. 30-30, 60-59, 90-87, 119-117, 149-147తో సహచర ఆర్చర్‌ అభిషేక్‌ను ప్రవీణ్‌ ఓడించాడు. పసిడి పతకం ప్రవీణ్‌ ఓజాస్‌ సొంతమవగా.. అభిషేక్‌ వర్మ రజత పతకం కైవసం చేసుకున్నాడు. మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో సైతం భారత్‌కు రెండు పతకాలు లభించాయి. తెలుగు తేజం వెన్నం జ్యోతి సురేఖ పసిడి పతకంతో మెరిసింది. పసిడి పోరులో జ్యోతి సురేఖ 149-145తో దక్షిణ కొరియా ఆర్చర్‌ను ఓడించింది. 29-30, 59-58, 89-87, 119-116, 149-145తో జ్యోతి సురేఖ గోల్డ్‌ మెడల్‌ కైవసం చేసుకుంది. కాంస్య పతక పోరులో అదితి స్వామి గోపీచంద్‌ 146-140తో ఇండోనేషియా ఆర్చర్‌పై విజయం సాధించింది. బ్రాంజ్‌ మెడల్‌ సొంతం చేసుకుంది. రికర్వ్‌ విభాగంలో మెన్స్‌, ఉమెన్స్‌ సహా మిక్స్‌డ్‌ జట్లు సైతం బంగారు పతకాలు సాధించిన సంగతి తెలిసిందే.
చెస్‌లో సిల్వర్‌ షో
చదరంగంలో భారత్‌ సత్తా చాటింది. బంగారు పతకాలు ఆశించిన భారత చెస్‌ గ్రాండ్‌మాస్టర్లకు రజత పతకాలు దక్కాయి. మహిళల జట్టు చివరి రౌండ్లో నాలుగు విజయాలు నమోదు చేసి భారత్‌ సిల్వర్‌ మెడల్‌తో మెరిసింది. దక్షిణ కొరియాపై భారత్‌ 4-0తో గెలుపొందింది. భారత మహిళల జట్టు తరఫున ద్రోణవల్లి హారిక, రమేశ్‌ బాబు వి, అగర్వాల్‌ వి, భాస్కర్‌ ఎస్‌ఎస్‌లు రాణించారు. చైనా బంగారం, కజకిస్థాన్‌ రజతం సొంతం చేసుకున్నాయి. పురుషుల జట్టు విభాగంలోనూ భారత్‌కు సిల్వర్‌ మెడల్‌ లభించింది. చివరి రౌండ్‌లో ఫిలిప్పిన్స్‌పై 3.5-0.5తో భారత్‌ గెలిచింది. భారత గ్రాండ్‌మాస్టర్లు పి రమేశ్‌ బాబు, విఎస్‌ గుజరాతీ, ఎకె ఎరిగైసి, పి హరికృష్ణలు రాణించారు.
సాత్విక్‌, చిరాగ్‌ ‘గోల్డ్‌’
భారత బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టిలు చరిత్ర సృష్టించారు. పురుషుల డబుల్స్‌లో విభాగంలో భారత్‌కు తొలిసారి ఆసియా పసిడి పతకం అందించారు. భారత బ్యాడ్మింటన్‌లో ఎన్నో చారిత్రక విజయాలు సాధించిన సాత్విక్‌, చిరాగ్‌లు.. ఇప్పుడు ఆసియా క్రీడల్లో బంగారు పతకం సొంతం చేసుకున్నారు. మెన్స్‌ డబుల్స్‌లో దక్షిణ కొరియా జోడీపై మనోళ్లు 2-0తో అదరగొట్టారు. 21-18, 21-16తో సాత్విక్‌, చిరాగ్‌లు ఏకపక్ష విజయం నమోదు చేశారు. తొలి గేమ్‌ను 29 నిమిషాల్లో ముగించిన సాత్విక్‌, చిరాగ్‌లు.. రెండో గేమ్‌ను 27 నిమిషాల్లోనే గెల్చుకున్నారు. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌.ఎస్‌ ప్రణరు కాంస్య పతకంతో మెరువగా.. మెన్స్‌ డబుల్స్‌లో సాత్విక్‌, చిరాగ్‌లు ఏకంగా పసిడి చరిత్ర సృష్టించారు.
దీపక్‌ రజత పట్టు
రెజ్లింగ్‌లో భారత్‌కు మరో మెడల్‌ లభించింది. పురుషుల 86 కేజీల ఫ్రీస్టయిల్‌ విభాగం ఫైనల్స్‌కు చేరుకున్న దీపక్‌ పూనియా.. పసిడి పోరులో అంచనాలను అందుకోలేదు. ఇరాన్‌ రెజ్లర్‌ హసన్‌ 10-0తో దీపక్‌ పూనియాపై గెలుపొందాడు. పసిడి పట్టులో దీపక్‌ పూనియా స్కోరు చేయలేకపోయాడు. అయినా, ఫైనల్లో పోరాట పటిమతో దీపక్‌ పూనియా సిల్వర్‌ మెడల్‌ కైవసం చేసుకున్నాడు.
క్రికెట్‌లో పసిడి
క్రికెట్‌లో టీమ్‌ ఇండియా పసిడి క్లీన్‌స్వీప్‌ చేసింది. మహిళల జట్టు ఇప్పటికే బంగారం సాధించగా, ఇప్పుడు పురుషుల జట్టు సైతం గోల్డ్‌ గెల్చుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో తొలుత అఫ్ఘనిస్థాన్‌ బ్యాటింగ్‌ చేసింది.18.2 ఓవర్లలో 5 వికెట్లకు 115 పరుగులు చేసింది. అఫ్గాన్‌ బ్యాటర్లలో షాహిదుల్లా (49 నాటౌట్‌, 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), గుల్బాదిన్‌ నయిబ్‌ (27 నాటౌట్‌, 24 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) రాణించారు. అఫ్గనిస్థాన్‌ ఇన్నింగ్స్‌ 18.2 ఓవర్ల సమయంలో వర్షం అంతరాయం కలిగింది. నిలకడగా వర్షం కురవటంతో మళ్లీ మ్యాచ్‌ పున ప్రారంభం కాలేదు. టాప్‌ సీడ్‌గా ఆసియా క్రీడలకు వచ్చిన భారత్‌.. మెరుగైన సీడింగ్‌తో పసిడి పతకం సొంతం చేసుకుంది. అఫ్గనిస్థాన్‌కు సిల్వర్‌ మెడల్‌ దక్కింది.

Spread the love