– కర్నాటక ఫలితాలపై సీపీఐ నేత నారాయణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కర్నాటకలో బీజేపీ ఓటమి ప్రధాని మోడీని నైతికంగా ఓడించిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ తెలిపారు. కర్నాటకలో బీజేపీ ఓటమి ద్వారా దక్షిణ భారతదేశం ద్వారం ఆ పార్టీకి మూతపడినట్టు అయ్యిందని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మోడీ సుదీర్ఘకాలం అక్కడే ఉండి కులాలు, మతాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని విమర్శించారు. రాజ్యాంగంలోని లౌకికవాదానికి కట్టుబడి ఉండాల్సిన ప్రధాని ఓట్ల కోసం కక్కుర్తి పడి భజరంగ్‌దళ్ జై అనమన్నారని గుర్తు చేశారు. రాహుల్‌పై కక్షసాధింపు చర్యలు ప్రజల్లో కాంగ్రెస్‌పై సానుభూతి వచ్చిందని తెలిపారు. గ్యాస్, పెట్రోల్ ధరల పెరుగుదల కూడా బీజేపీని ఓడించిందని పేర్కొన్నారు. కర్నాటకలో బీజేపీ ఓటమి దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతుందని తెలిపారు.
దేశానికే మార్గదర్శకం : కూనంనేని
కర్నాటక ఎన్నికల ఫలితాలు దేశానికే మార్గదర్శకంగా నిలిచాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. రానున్న కాలంలో దేశంలో బీజేపీ వ్యతిరేక ప్రభుత్వాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. సొంతంగా తొమ్మిది రాష్ట్రాల్లోనే బీజేపీ అధికారంలో ఉందని తెలిపారు. అత్యున్నత పదవిలో ఉండి మతాల పేరుతో ఓట్లు సంపాదిం చాలన్న దుర్బుద్ధితో దిగజారి మాట్లాడిన ప్రధాని మోడీకి ఈ ఫలితాలు చెంపపెట్టులాంటివని విమర్శించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇదేవిధమైన తీర్పును ప్రజలిస్తారని తెలిపారు.