స్పందనలు

ఇది సమిష్టి విజయం
బెంగళూరు : కర్నాటకలో ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తల కృషితోనే గెలిచామని కర్నాటక కాంగ్రెస్‌ చీఫ్‌ డి.కె శివకుమార్‌ అన్నారు. ఈ నేపథ్యంలో ఫలితాలపై ఆయన స్పందిస్తూ ఎమోషనల్‌ అయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నామని వ్యాఖ్యానించారు. సిద్ధరామయ్యతో పాటు ఎమ్మెల్యేందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని డి.కె శివకుమార్‌ అన్నారు. ఏఐసీసీ క్యాడర్‌ నాయకులు, రాష్ట్ర నాయకులు అందరి కృషితో విజయం సాధించామన్నారు. ఇది సమిష్టి నాయకత్వమనీ, అందరినీ ఏకతాటిపై తీసుకెళ్లడమే ప్రగతి అని తెలిపారు.
గెలుపు పట్ల డి.కె శివకుమార్‌ ఎమోషనల్‌

మతతత్వ రాజకీయాలను కన్నడిగులు వ్యతిరేకించారు
న్యూఢిల్లీ : కర్నాటకలో రాహుల్‌ గాంధీ ‘భారత్‌ జోడో యాత్ర’ జరిపినపుడే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చాలా స్పష్టంగా ఖరారయ్యాయని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ అన్నారు. యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ సారథ్యం లోని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్‌ నేతలు సాగించిన ప్రచారం బాగా పని చేసిందన్నారు. కర్నాటక ప్రజలు మతతత్వ రాజకీయాలను వ్యతిరేకించి, అభివృద్ధి రాజకీయాలను ఎంచుకున్నారని అభినందించారు. త్వరలో జరగనున్న రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ ఎన్నికల్లోనూ కర్నాటక తరహా ఫలితాలే పునరావృతమవుతాయని అశోక్‌ గెహ్లాట్‌ అన్నారు.
– రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌

ఇది రాష్ట్ర ప్రజల విజయం
బెంగళూరు : కర్నాటకలో కాంగ్రెస్‌ విజయంపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. పార్టీ కార్యకర్తలతో కలిసి సంబరాలు జరపుకున్నారు. ఇది ఏ ఒక్కరి విజయం కాదనీ, ఇది రాష్ట్ర ప్రజలు విజయమని ఆయన అన్నారు. ఈర్ష్య సుదీర్ఘకాలం ఉండదన్నారు. ఇది ప్రజాస్వామ్య దేశమనీ, మనం ప్రజలు మాట వినాలను ఖర్గే తెలిపారు. మనకు సరైన దారిని చూపే ప్రజల ముందు తల వంచాలని చెప్పారు. బీజేపీ ముక్త భారత్‌కు కర్నాటక దారి చూపిందని ఆయన అన్నారు.
– కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే

బిజెపి అంతానికి ఆరంభం
‘బిజెపి నెగిటివ్‌, మతపరమైన, విభజన, అబద్ధపు ప్రచారాల అంతానికి ఈ ఫలితాలు ఆరంభం. ఇది ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతి, విద్వేషానికి వ్యతిరేకంగా నూతన సానుకూల భారతం ఇచ్చిన కచ్చితమైన ఆదేశం’ అని ఉత్తర ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ ట్వీట్‌ చేశారు.
అఖిలేష్‌ యాదవ్‌

బీజేపీ ప్రతీకార రాజకీయాలకు తగిన గుణపాఠం
చెన్నై : కర్నాటక ప్రజలు బీజేపీ ప్రతీకార రాజకీయాలకు తగిన గుణపాఠం చెప్పారని తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్‌ ఎంకె స్టాలిన్‌ అన్నారు. కాంగ్రెస్‌ విజయం సాధించటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాహుల్‌పై అనర్హత వేటు, రాజకీయ ప్రత్యర్థులపై దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగపర్చటం, హిందీ భాషను బలవంతంగా రుద్దడం, విచ్చలవిడి అవినీతి, ఇతర అంశాలు ఓటు వేసే సమయంలో కన్నడ ప్రజల మదిలో ప్రతిధ్వనించాయని తెలిపారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకుందామని అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ అందరం కలిసి గెలుపు కోసం సమిష్టిగా పని చేద్దామని పిలుపునిచ్చారు.
తమిళనాడు సీఎం స్టాలిన్‌

కర్నాటక ప్రజలకు అభినందనలు
న్యూఢిల్లీ : కర్నాటక ఎన్నికల ఫలితాలపై జమ్మూకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా స్పందించారు. విద్వేష రాజకీయాలను వ్యతిరేకించి, ప్రేమను పంచే రాజకీయాలను ఆమోదించినందుకు కర్నాటక ప్రజలకు తాను అభినందనలు తెలిపాలనుకుంటున్నానని నేషనలిస్ట్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ) చీఫ్‌ అయిన ఆయన చెప్పారు.
– ఫరూక్‌ అబ్దుల్లా

Spread the love