నవతెలంగాణ -నవీపేట్: బక్క జీవులైన గ్రామపంచాయతీ కార్మికులపై బలవంతం చేసి సమ్మె విరమించాలని అధికారులు చూడవద్దని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నాయక్ వాడి శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయం వద్ద డిఎల్పిఓ నాగరాజు గ్రామం స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ జాబితాలో ఎంపికైనందున కార్మికులు సమ్మెను విరమించి విధుల్లోకి చేరి సహకరించాలని లేనియెడల ప్రైవేటు వ్యక్తులతో పారిశుద్ధ్య పనులు చేయించుకుంటామని, అపరిశుభ్రత కారణంగా సమస్యలు తలెత్తితే బాధ్యత వహిస్తారా అని తెలుపడంతో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నాయక్ వాడి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గతంలో సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు ప్రభుత్వం నెరవేర్చకపోవడం, వారం క్రితమే అధికారులకు సమ్మె నోటీసులు అందించి గ్రామ పంచాయతీ సిబ్బంది యూనియన్ జేఏసీ ఆదేశాల మేరకు సమ్మె చేస్తున్నామని, ప్రైవేట్ కార్మికులతో పారిశుధ్య పనులు చేస్తే ఖచ్చితంగా అడ్డుకుంటామని తెలిపారు. తమ సమ్మె డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని అన్నారు. ఈ సందర్భంగా కార్మికులకు కాంగ్రెస్ నాయకులు వడ్డే రవి మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సాజిద్ అలీ, ఎంపిఓ రామకృష్ణ, ఏపీవో రాజేశ్వర్, కార్యదర్శి రవీందర్ నాయక్ మరియు సఫాయి కార్మికులు ఉన్నారు.