భువనగిరి సీపీఐ(ఎం) అభ్యర్థిగా ఎండీ జహంగీర్ నామినేషన్

– ప్రజాస్వామ్యానికి లౌకిక తత్వానికి హాని కలిగిస్తున్న కేంద్రం..
– కేంద్రము రాష్ట్రాలను మున్సిపల్ స్థాయికి దిగజార్చుచున్నారు..
– కేసీఆర్ అహంకారంతోటే ఓడిపోయిండు..
– రేవంత్ రెడ్డి అహంకారం తగ్గించుకో..
– మోడీని బడేభాయ్ అంటూ నెత్తిన ఎత్తుకుంది రేవంత్ రెడ్డి
– బీజేపీతో దేశానికి పెను ప్రమాదం..
– ఇండియాకుటంలో అందరం ఉన్న విషయం మర్చిపోవద్దు..
– పన్నుల్లో 50 శాతం నిధులను రాష్ట్రానికి కేటాయించాలి..
– బీవి రాఘవులు సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు..
– సోయి లేకుండా మాట్లాడుతున్న రేవంత్..
– తమ్మినేని వీరభద్రం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి..
– రైల్వే స్టేషన్ నుండి ఏ ఆర్ గార్డెన్ వరకు భారీ ర్యాలీ, సభ..
నవతెలంగాణ – భువనగిరి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి లౌకిక తత్వానికి హాని  కలిగిస్తుందని, తెలంగాణలో బీజేపీ అడ్డుకోవాలని ఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విమర్శించారు. శుక్రవారం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి జహంగీర్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ నుండి ఏ ఆర్ గార్డెన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీజేపీ పదేళ్ల పాలనలో దేశానికి పెను ప్రమాదం వచ్చిందన్నారు. కార్మికులకు అన్యాయం జరిగిందన్నారు. వ్యవసాయ కార్మికులు విచ్ఛిన్నమైనరని తెలిపారు. దళితులు, మైనార్టీల జీవితాలు బుగ్గిపాలైనాయని ఆవేదన వ్యక్తపరిచారు. బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే సీపీఐ(ఎం) చేయమన్నారు. సీపీఐ(ఎం) కు బలం ఉన్నచోట బీజేపీని ఓడిస్తామని, బలము లేని చోట ఇతర పార్టీలకు సహాయం చేస్తామని అన్నారు. 10 సంవత్సరాల కాలంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాజ్యాంగాన్ని విచ్చిన్నం చేయడానికి బీజేపీ పూలమాలలు వేస్తే, మేము ఆయన ఆశయాల కోసం భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం పూల మాలలు వేస్తామన్నారు. ఎన్నికల్లోసీపీఐ(ఎం) ను ఆదరించాలని కోరారు.
కేంద్రంలో ప్రత్యామ్నాయ లౌకిక ప్రభుత్వ ఏర్పాటుకు తోడ్పడాలని కోరారు. బీజేపీ అనుసరిస్తున్న విధానాలు దేశానికి ఐక్యతకు అభివృద్ధికి ఆటంకం అని అన్నారు బీజేపీ సీఏఏ పౌరసత్వ చట్టాన్ని  తీసుకు వచ్చిందని, అది లౌకిక వాదానికి మైనార్టీలకు హాని కలిగిస్తుంది అన్నారు. దానిని రద్దు చేయాలన్నారు. దేశంలో  వసూలు చేసే అన్ని రకాల  పన్నులలో 50 శాతం రాష్ట్రాలకు కేటాయించాలని సూచించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాలను మున్సిపల్ స్థాయికి దిగజార్చారని విమర్శించారు. రాజ్యాంగం ద్వారా సామాజిక న్యాయం లభిస్తుంది అన్నారు. మత కుల వ్యవస్థ ద్వారా మైనార్టీలో గిరిజనులు మహిళలకు, హక్కులు ప్రత్యేక సంక్షేమ పథకాలు వారికి అందకుండా పోతాయన్నారు. ప్రభుత్వ రంగాన్ని ఒకవైపు నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ కు మోడీ ఒప్పుకోవడం లేదన్నారు. కేంద్రం వివక్షతపై కేరళ ముఖ్యమంత్రి  పినరై విజయన్ ఢిల్లీకి వెళ్లి పోరాడాడని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ప్రశ్నించిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సూరెన్  ను,  జైల్లో పెట్టారని తెలిపారు.
భారతదేశం విద్యలో 139 వ స్థానంలో ఉన్నామని, మనకంటే బంగ్లాదేశ్, చైనాలో ఉద్యోగంలో ముందున్నాయని తెలిపారు. మోడీ ఇటీవల అసలు సినిమా చూపిస్తామని, తెలుగు సినిమా అయిన సినిమా చూపిస్త మామ అనే డైలాగులు చెప్తున్నారని విమర్శించారు. బీజేపీ తగలబాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ సీపీఐ(ఎం)పార్టీల చరిత్ర చూడాలని, వ్యక్తుల యొక్క చరిత్ర చూడాలని విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ తమ పార్టీ నుండి బీజేపీ బూర నర్సయ్య గౌడ్  బీజేపీలో చేరడం పట్ల బాధపడుతున్నాడని పెద్దవా చేశారు. మునుగోడు ఎన్నికల్లో సీపీఐ(ఎం) సహాయంతో బీఆర్ఎస్ గెలిచిందన్నారు. కవితని జైల్లో పెడతారని బీజేపీకి భయపడి, కమ్యూనిస్టులతో అవగాహనకు రాలేదన్నారు. బీజేపీ కవితను జైల్లో పెట్టిందని, దీంతో కేటీఆర్ మాట మూగబోయిందన్నారు. ఇప్పటికైనా ఇండియాకుటంలోకి రావాలని ఆహ్వానించారు. మాకు బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ తో ,కేరళ లో కాంగ్రెస్ తో విభేదాలు ఉన్నప్పటికీ, దేశ భవిష్యత్తు కోసం ఇండియా కూటంలో చేరి బీజేపీని ఓడించడానికి  పని చేస్తున్నామన్నారు. పాలిచ్చే గేదని విడిచిపెట్టి దున్నపోతును ఎన్నుకున్నారని ఇటీవల కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారని తెలిపారు.
జనాన్ని తిట్టవద్దని  హితవు పలికారు. బీజేపీతో పోరాడడానికి  ఇండియాకుటంలో చేరాలని కోరారు. కేరళకు వెళ్లి సీపీఐ(ఎం) ను తిట్టే అంత సమయం రేవంత్ కు ఉందని, బీజేపీ పై పోరాడడానికి మాత్రం  లేదన్నారు. పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరికినట్లు, కేరళకు వెళ్లి కేరళ ముఖ్యమంత్రి పినరన్ విజయ్ ని విమర్శిస్తున్నాడని విమర్శించారు. కక్ష కట్టి బీజేపీ కేసు నమోదు అయనంత మాత్రాన దోషి కాదని తెలిపారు. పొట్ట చిచ్చుకుంటే పేగులు కళ్ళ మీద పడ్డట్లు అనే సామెతను గుర్తు చేశాడు. ఓటుకు నోటు సంగతి ఏమయిందని రేవంత్ ని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సోనియా గాంధీ రూ.1500 కోట్ల రూపాయలకు సంబంధించి అపరాధ రుసుము కట్టాలని కేసు నమోదు అయిందన్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండించామన్నారు. నోరు ఉందని నోరు పారేసుకోవద్దని సూచించారు. రాజకీయాలు ఉండాలి కానీ ప్రతిదానికి ఒకే విధంగా చూడవద్దన్నారు. కేసీఆర్ అహంకారంతోటే ఓడిపోయారని, రేవంత్ రెడ్డి ఆ బాటలో నడవద్దని కోరారు. బీజేపీ, కమ్యూనిస్టులు కలిసి కేరళలో పనిచేస్తున్నారని రేవంత్ మాట్లాడటం అతని అవివేకం అన్నారు. కేరళ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లి సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేసిన విషయం మర్చిపోయాడని విమర్శించారు. బీజేపీ రాష్ట్రంలో ఐదు ఆరు స్థానాలు రాకుండా మేము సహాయం చేస్తామని, మీరు కలిసి రావాలని కోరారు. ప్రతి ఓటు విలువైనదని వివరించారు. భువనగిరిలో ప్రజాతంత్ర శక్తులు, లౌకిక శక్తులు సీపీఐ(ఎం)కు ఓటు వేయాలని కోరారు. సీపీఐ(ఎం) కి వేసే ఓటు సీపీఐ(ఎం) కు మాత్రమే ఓటు వేసినట్లు కాదని, రాష్ట్ర అభివృద్ధికి ఓటు వేసినట్లు అని తెలిపారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. బీజేపీవి సాదాసీదా రాజకీయలు కాదని,  ఫాసిస్టు విధానాలు ఆర్ఎస్ఎస్ భావజాలం దేశాన్ని బ్రష్టు పట్టించే విధానాలు ఉన్నాయన్నారు. దేశం ఐక్యంగా ఉండకుండా ముక్కలాగే ప్రమాదం ఉందన్నారు. హిందూ దేశంగా రాజ్యాంగం మారుస్తామని చెప్తున్నారని, ఇది ప్రమాదకరమని తెలిపారు. ముస్లింల, క్రిస్టియన్ల కే కాకుండా ఎక్కువమంది హిందువులకు అన్యాయం జరుగుతుందన్నారు. అగ్రకుల భావజాలం కార్పోరేట్ శక్తులు రాజ్యమేలుతారని, పేదలు మరింత పేదలుగా మారతారని తెలిపారు. సనాతన ధర్మం అంటే ఒక ఫ్యూడల్ ధర్మమని, అది మనువాదం నుండి వచ్చింది అన్నారు. రాజ్యాంగానికి కూడా పెను ప్రమాదం ఉందని, ప్రజలు ఇది గ్రహించాలన్నారు. బీజేపీని ఓడించడానికి అందరితో కలిసి వెళ్తామని చెప్పారు. ఇండియా కూటమి పార్టీలను కాంగ్రెస్ సంప్రదించడం లేదన్నారు. కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషించాలని కోరారు. ఈనెల 21 తేదీన కాంగ్రెస్ నాయకత్వం సీపీఐ(ఎం) కలవనున్నట్లు సమాచారం ఇచ్చారని తెలిపారు. తెలంగాణలో భువనగిరి స్థానం నుండి పోటీ చేయడం ఖాయమన్నారు. కాంగ్రెస్ మొండి వైఖరి విడనాడాలన్నారు. సోయి లేకుండా ఆరోపణలు చేయవద్దని రేవంత్ రెడ్డికి హితవు పలికారు. మా దేహంబు ముక్కలైనా సరే మా దేశాన్ని ముక్కలు కానివ్వమని, ఈ దేశంలో బీజేపీని అడ్డుకుంటామని తెలిపారు. స్పష్టమైన లక్ష్యాలతో సీపీఐ(ఎం) ముందుకు పోతుందన్నారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశానికి తిరుగు లేదని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత కాంగ్రెస్ కు తిరుగు లేదన్నారు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కు తిరుగులేదు అన్నారు. ప్రస్తుతం ఆ పార్టీల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. రాజకీయాలలో ఏదైనా జరగవచ్చు అన్నారు. అర్థం చేసుకోకపోతే కమ్యూనిస్టుల ఆత్మవిశ్వాసం నిలబెట్టుకో లేమన్నారు. సిగ్గు ఎగ్గు లేకుండా పార్టీలు మారుతున్నారని, పార్టీలో చేర్చుకోవడం కూడా దగుల్బాజీ తనమేనని విమర్శించారు. గ్రామ వార్డు సభ్యుల నుండి సర్పంచులు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సిగ్గు, శరం లేకుండా ఇతర పార్టీలో చేరుతున్నారని, చేర్చుకునే వారికి సిగ్గులేదని విమర్శించారు. ఒకప్పుడు రాజకీయాలు ,వ్యాపారాలు వేరువేరుగా ఉండేవని, ప్రస్తుతం రాజకీయాలు వ్యాపారాలతో ముడి పడిపోయాయి అన్నారు. వాళ్లు లాభార్జన తప్ప ప్రజా సంక్షేమం చూడాలని అన్నారు. పార్లమెంట్లో శతకోటేశ్వర్లు వచ్చి చేరారని ఆవేదన వ్యక్తం చేశారు. భువనగిరి తెలంగాణ సాయుధ పోరాట నాయకత్వం వహించిన ఉద్యమాల గడ్డ అని తెలిపారు. అలాంటి ఉద్యమ గడ్డలో సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపించాలని కోరారు. చిన్ననాటి నుండి విద్యార్థి యువజన కార్మిక కర్షక ప్రజా సమస్యలపై 35 సంవత్సరాలుగా పోరాడిన వ్యక్తి అని తెలిపారు. నక్షత్రం పై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య మాట్లాడుతూ.. తెలంగాణలో భువనగిరి నియోజకవర్గంలో సీపీఐ(ఎం) పోటీ చేస్తుంది అన్నారు. సీపీఐ(ఎం) అభ్యర్థిగా పోటీ చేస్తున్న జహంగీర్ మూసి కాలుష్యం పై నెలరోజుల పాటు పోరాటం చేశారన్నారు. గంగా ప్రక్షాళనకు కోట్లు ఖర్చు పెట్టే కేంద్రము, మూసి కాలుష్యంపై డబ్బులు ఖర్చు చేయడం లేదన్నారు. మూసినది ఈ దేశంలో ఉందని, ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే జహంగీర్ ను గెలిపించాలన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు పార్లమెంట్లో గొంతు ఎత్తి అడుగుతారని తెలిపారు. కనీస వేతనం పై శాస్త్రీయ అంచనాల లేవన్నారు. కార్మిక వ్యవసాయ కార్మికుల వేతన పద్ధతిని సవరించాలన్నారు. సమగ్ర శాసనం తీసుకురావాలన్నారు. దేశంలో కులం ఉందని, కులవృత్తుల దెబ్బతింటున్నాయని అన్నారు. ఇలాంటి సమస్యలను ప్రస్తావిస్తారని తెలిపారు. జాంగిర్ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సభ్యులు జ్యోతి, మల్లు లక్ష్మి, తీగల సాగర్, జాన్ వెస్లీ, అబ్బాస్, డిజి. నర్సింగరావు, పోతినేని సుదర్శన్, పాలడుగు భాస్కర్, రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి కొండమడుగు నరసింహ మట్టుపల్లి అనురాధ పైళ్ల ఆశయ బురుగు ప్రసాద్, వెంకట్ రాములు, అరుణ జ్యోతి, విజయలక్ష్మి,  జగదీష్, ఎస్ రమా, వెంకట్,  పాల్గొన్నారు.
Spread the love