బైక్‌ను ఢీకొట్టిన బీఎండ‌బ్ల్యూ కారు.. ఒకరు మృతి

నవతెలంగాణ – న్యూఢిల్లీ: ఆదివారం తెల్ల‌వారుజామున ఢిల్లీలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. మోతీ బాగ్ ఫ్లై ఓవ‌ర్ వ‌ద్ద వేగంగా వ‌చ్చిన బీఎండబ్ల్యూ కారు.. బైక్‌పై వెళ్తున్న వ్య‌క్తిని ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డిన బాధిత వ్య‌క్తి.. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. మోతీ బాగ్ ఫ్లై ఓవ‌ర్ స‌మీపంలో ఉన్న ఓ మెడిక‌ల్ షాపులు మందులు కొనుగోలు చేసేందుకు గుప్తా(36) అనే వ్య‌క్తి ఆదివారం తెల్ల‌వారుజామున బ‌య‌ట‌కు వ‌చ్చాడు. మెడిసిన్స్ తీసుకొని ఇంటికి తిరిగి వెళ్తున్న ఆ వ్య‌క్తిని బీఎండ‌బ్ల్యూ కారు ఢీకొట్టింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. కేవ‌లం బాధితుడు ఒక్క‌డే అక్క‌డ ఉన్నాడు. ఈ ప్ర‌మాదానికి కార‌ణ‌మైన కారు డ్రైవ‌ర్ లేక‌పోవ‌డంతో.. ఆ వాహ‌నం నంబ‌ర్ ఆధారంగా స‌ద‌రు వ్య‌క్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్ర‌మాద స‌మ‌యంలో కారును డ్రైవింగ్ చేసింది మ‌హిళ అని తేలింది. అశోక్ విహార్‌కు చెందిన ఆమె గ్రేట‌ర్ కైలాష్‌లో ఓ పార్టీలో పాల్గొని తిరిగి వ‌స్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. ఆమె వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్ అని పేర్కొన్నారు. ఈ మ‌హిళ‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతుడికి భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. ఈ కుటుంబం బ‌సాయి ద‌ర‌పూర్‌లో నివసిస్తోంది. త‌న భ‌ర్త మృతికి కార‌ణ‌మైన మ‌హిళ‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని గుప్తా భార్య పోలీసుల‌ను కోరింది.

Spread the love