గీత దాటితే వేటే

– ఓటర్లను కలువకుండా షో చేస్తే టికెట్లు ఇవ్వం
 – క్రమశిక్షణ ఉల్లంఘించేవారిపై కఠినంగా ఉంటాం
– పార్టీ నేతలకు బండి సంజరు హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అనీ, గీత దాటితే వేటు తప్పదని ఆ పార్టీ నేతలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్‌ హెచ్చరించారు. ఓటర్లను కలువకుండా షో చేస్తే టికెట్లు రావని స్పష్టం చేశారు. నిత్యం ప్రజల్లో ఉండాలని సూచించారు. సోమవారం హైదరాబాద్‌లోని చంపాపేటలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరిగాయి. అందులో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ లక్ష్మణ్‌, మధ్యప్రదేశ్‌ ఇన్‌చార్జి మరళీధర్‌ రావు, జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, తెలంగాణ రాష్ట్ర సహ ఇన్‌చార్జి అరవింద్‌ మీనన్‌, తమిళనాడు సహ ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు ఇంద్రసేనారెడ్డి, ఏపీ జితేందర్‌ రెడ్డి, ఈటల రాజేందర్‌, వివేక్‌ వెంకటస్వామి, ఎమ్మెల్సీ కేవీఎన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి అధ్యక్ష్యోపన్యాసం చేశారు. నిరుద్యోగులకు కొలువులు కావాలంటే కమలం పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాల్సిందేనన్నారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కారుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. తాము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఏటా జాబ్‌క్యాలెండర్‌ ప్రకటించి ఖాళీలను భర్తీచేస్తామని చెప్పారు. ప్రతి విద్యార్థినీ ప్రయివేటు స్కూళ్లలోని స్టూడెంట్స్‌తో పోటీపడేలా చదివిస్తామన్నారు. బకాయిల్లేకుండా ఫీజు రీయంబర్స్‌ మెంట్‌ చెల్లిస్తూ చిన్న ప్రయివేటు కాలేజీలను ఆదుకుంటామన్నారు. కార్పొరేట్‌ విద్యాలయాల దోపిడీకి అడ్డుకట్ట వేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి పేద, మధ్య తరగతి ప్రజలకు హెల్త్‌ కార్డు అందిస్తామనీ, ఏ జబ్బుకైనా ఉచితంగా ప్రయివేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వైద్యం అందిస్తామని హామీనిచ్చారు. మోడీ పాలనలో తెలంగాణకు వచ్చిన కేంద్రం నిధులను గణాంకాలతో వివరించారు. వాటిని ప్రజలకు చెప్పేందుకుగానూ ఈనెల 30 నుంచి జూన్‌ 30 వరకు మహా జన సంపర్క్‌ అభియాన్‌ నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఏం సాధించారని కేసీఆర్‌ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణకు కేసీఆర్‌ మెయిన్‌ విలన్‌ అయితే కాంగ్రెస్‌, ఎంఐఎం సహ విలన్లు అనీ, కమ్యూనిస్టులు ఆకు రౌడీలని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ గెలవలేని చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్ధులకు కేసీఆర్‌ ఎన్నికల నిధిని ఇస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ విశ్వాసఘాతకుడనే విషయం పలు సందర్భాల్లో స్పష్టమైందన్నారు. ‘సారు- కారు- 60 పర్సంట్‌ సర్కార్‌’ నినాదంతో కేసీఆర్‌ను ఇంటికి సాగనంపేదాకా పోరాడతామని నొక్కి చెప్పారు. 111 జీవో రద్దు, కోకాపేట భూముల కేటాయింపు వెనుక కుట్ర ఉందనీ, లీగల్‌ సెల్‌ ద్వారా న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు.

Spread the love