Saturday, May 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకార్మికోద్యమ ఆదర్శ నాయకుడు 'పర్సా'

కార్మికోద్యమ ఆదర్శ నాయకుడు ‘పర్సా’

- Advertisement -

ఆయన పోరాట స్ఫూర్తితో ఐక్య ఉద్యమాలు : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
​పర్సా సత్యనారాయణ ఉద్యమ స్ఫూర్తితో కార్మిక వర్గ ఐక్య పోరాటాలను బలోపేతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ ‌పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో పర్సా 11వ వర్థంతి సభను రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేశ్‌ అధ్యక్ష‍తన నిర్వహించారు. ఈ సందర్భంగా పర్సా చిత్ర పట్టానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం భాస్కర్‌ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లో సీఐటీయూ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా సుధీర్ఘ కాలం పని చేసిన పర్సా.. కార్మికోద్యమానికి గొప్ప ఆదర్శ నాయకుడని కొనియాడారు. జీవితాంతం కష్టజీవుల కోసం పని చేసిన ఆయన వారి మధ్యలోనే జీవించారని గుర్తు చేశారు. తద్వారా కార్మికవర్గం తలలో నాలుకయ్యారని స్మరించుకున్నారు. ఆయన తన పుట్టిన ప్రాంతాన్ని వదిలి కొత్తగూడెం సింగరేణి పారిశ్రామిక ప్రాంతానికొచ్చారని తెలిపారు. అక్కడే చదువుకుని, సింగరేణిలో ఒక క్లర్క్ ఉద్యోగం చేస్తూ, తోటి ఉద్యోగులతో పాటు కార్మికులను సంఘటితం చేసి అనేక పోరాటాలు నిర్వహించారని గుర్తు చేశారు. సింగరేణి కోల్‌ ఎంప్లాయీస్‌ ‌యూనియన్‌ ‌వ్యవస్థాపక అధ్యక్ష‍ుడిగానేగాక, వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోనూ పాల్గొన్నారని గుర్తు చేశారు. ఆయన తన రాజకీయ జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారని తెలిపారు. సింగరేణి యజమాన్యం కక్ష‍ సాధింపు చర్యలు, కనిపిస్తే కాల్చివేత లాంటి ప్రభుత్వ ఆదేశాలు, అరెస్టులు, జైలు శిక్ష‍, పోలీసు చిత్రహింసలు ఇలా ఎన్నో ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. అయినా వెనుకడుగు వేయకుండా కార్మికులు, శ్రామికుల ప్రయోజనాల కోసమే పని చేశారని తెలిపారు. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గలేదని చెప్పారు. కార్మికులు, ప్రజల జీవన విధానానికి అనుగుణంగా సాధారణ జీవితాన్ని గడిపిన గొప్ప వ్యక్తని తెలిపారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు కూడా ఆడంబరాలకు దూరంగా, నిరాడంబరంగా జీవించారని వివరించారు. నమ్మిన సిద్దాంతం, ఎంచుకున్న లక్ష్యం పట్ల నిబద్ధత, అంకిత భావంతో పనిచేశారని గుర్తు చేశారు.కార్మిక వర్గం గతంలో పోరాడి సాధించుకున్న చట్టాలను నేటి బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని భాస్కర్‌ ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. యజమాన్యాలకు దోచిపెట్టేందుకే నాలుగు లేబర్ కోడ్ లను తెచ్చారని దుయ్యబట్టారు. మతం పేరుతో ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక హక్కులపైన, ఉద్యమాలపైనా తీవ్ర నిర్భంధాన్ని ప్రయోగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి నేపథ్యంలో పర్సా ఉద్యమ స్ఫూర్తితో కార్మిక వర్గమంతా ఐక్య ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె ఈశ్వర్‌రావు, రాష్ట్ర కార్యదర్శి పి.సుధాకర్, రాష్ట్ర కమిటీ సభ్యులు వై.సోమన్న, ఎస్.ఎస్.ఆర్.ఏ ప్రసాద్, ఎ. సునీత, కోయ్యల రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -