పవన్‌ కళ్యాణ్‌ యువతను మోసగించొద్దు

– తనపై సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేసినంత మాత్రాన ఏమీ కాదు :
– సీపీిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పవన్‌ కళ్యాణ్‌ సంధాన కర్తగా వ్యవహరించొద్దని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. తనపై సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేసినంత మాత్రాన ఏమీ కాదని అన్నారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీ పర్యటనపై కె.నారాయణ గురువారం స్పందించారు. పవన్‌ కళ్యాణ్‌ చేగువేరా బొమ్మలతో కూడిన దుస్తులు ధరించేవారని, ఆయన లైబ్రరీలో కూడా వామపక్ష పుస్తకాలు ఉండేవని అన్నారు. ఆయన, మేము గతంలో దగ్గరయ్యామని పేర్కొన్నారు. వైసీపీని ఓడించాలని పవన్‌ తిరుగుతున్నారని, బీజేపీ, టీడీపీతో కలిసి వైసీపీని ఓడించాలని అనుకుంటున్నారని అన్నారు. అయితే ప్యాకేజీని పాచిపోయిన లడ్డుతో పోల్చిన పవన్‌, ఇప్పుడు ఇలా చేయడం ఏంటనీ ప్రశ్నించారు. బీజేపీతో కలుస్తానని చంద్రబాబు ఎక్కడా చెప్పలేదని, టీడీపీతో బీజేపీ కలుస్తుందో లేదో తెలియదని అన్నారు. పవన్‌ కళ్యాణ్‌ని యువత నమ్మతుందని, వారికి అన్యాయం చేయొద్దని అన్నారు. విభజన హామీలు అమలు చేయడం లేదని, రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఏపీ మాత్రమేనని అన్నారు. ప్రత్యేక హౌదా పోయింది, ప్యాకేజీ లేదని పేర్కొన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ అమ్ముతున్నారని, స్టీల్‌ ప్లాంట్‌ దొంగ చేతికి ఇచ్చినా రూ.3 లక్షల కోట్లు వస్తాయని, కానీ కేవలం రూ.30 వేల కోట్లకే ఆదానికి ఇచ్చేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఇది అడిగితే జగన్‌ జైలుకు వెళ్తారని పేర్కొన్నారు.
మణిపూర్‌ మండిపోతోందని, ఇవన్నీ ఎన్డీఏ చేస్తున్న కుట్రలని విమర్శించారు. గిరిజనులకు, గిరిజనేతరలకు గొడవలు పెట్టారని విమర్శించారు. కార్పొరేట్‌ వ్యవస్థలకు భూములు కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. 55 వేల ఎకరాల భూమిని ఆదానికి ఇచ్చారని, మైతి, కుకి తెగలకు మధ్య కొట్లాట పెట్టారని విమర్శించారు. ప్రధాని మోడీ పార్లమెంట్‌ లోపల చెప్పాల్సిన అంశాన్ని బయట చెప్పుతున్నారని దుయ్యబట్టారు. సేవ్‌ మణిపూర్‌ పేరిట 26న దేశ వ్యాప్తంగా మణిపూర్‌కి మద్దతుగా ఆందోళన చేపడుతున్నామని అన్నారు.

Spread the love