నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి

వ్యవసాయ అధికారి అరుణకుమారి
విత్తన విక్రయ కేంద్రాలను తనిఖీ చేసిన ఏఓ
నవతెలంగాణ-ఆమనగల్‌
నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని మండల వ్యవసాయ అధికారి అరుణకుమారి విత్తన విక్రయ దారులకు సూచించారు. శుక్రవారం ఆమనగల్‌ పట్టణంలోని వాసవి ఫర్టిలైజర్స్‌, శ్రీ సాయి సీడ్స్‌ అండ్‌ పెస్టిసైడ్స్‌ తోపాటు ఆగ్రో రైతు సేవ కేంద్రాన్ని వ్యవసాయ అధికారి అరుణకుమారి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విక్రయ కేంద్రాల్లో ఉన్న విత్తనాలకు సంబంధించిన ఇన్వాయిస్‌లు, రసీదులు, స్టాక్‌ రిజిస్టర్‌ తదితర వాటిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొన్నప్పుడు రైతులకు విధిగా బిల్లులు ఇవ్వాలని సూచించారు. అధిక ధరలకు విక్రయించి రైతులకు మోసం చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని డీలర్లకు హెచ్చరించారు. ఆగ్రో రైతు సేవ కేంద్రంలో రాయితీపై జనుము విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఏఓ తెలిపారు. పూర్తి ధర రూ.3,500 కల్గిన 40 కేజీల బస్తా 65 శాతం సబ్సీడీతో రూ.1,225 లకే లభిస్తుందని అన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏఓ అరుణకుమారి పేర్కొన్నారు. కార్యక్రమంలో విత్తన విక్రయ కేంద్రాల నిర్వాహకులు, ఆయా గ్రామాల రైతులు తిప్పిరెడ్డి కొండల్‌ రెడ్డి, శ్రీపాతి శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love