పెండింగ్‌ బిల్లులకు మోక్షమెప్పుడో?

రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల వేతన బిల్లులు తప్ప మరే బిల్లులకు మోక్షం లభించడం లేదు. సప్లిమెంటరీ బిల్లులు, జీపీఎఫ్‌, టీఎస్‌జీఎల్‌ఐ, సరెండర్‌ లీవ్‌, మెడికల్‌ బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లోనే ఉంటున్నాయి. ఉపాధ్యాయులు, ఉద్యోగులు వైద్య అవసరాలు, గృహ నిర్మాణం, పిల్లల చదువులకు, వివాహాలకు, ఇతరత్రా అవసరాలకు పొదుపు చేసుకునే జీపీఎఫ్‌, టీఎసజీఎల్‌ఐ నుండి లోన్లు, తీసుకోవాలనుకున్నా నెలల తరబడి జాప్యం జరిగి సరైన సమయంలో సొమ్మందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హెల్త్‌ కార్డులు సక్రమంగా అమలుకు నోచుకోవడం లేదు. ఉద్యోగులు తమ చేతి నుండి లక్షల రూపాయలు నేరుగా చెల్లించి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. వారి మెడికల్‌ బిల్లు కూడా సంవత్సరకాలంగా చెల్లించకపోవడం పట్ల ఆందోళన చెందుతున్నారు. ప్రతి నెలా జీతాలు ఆలస్యం కావడం వల్ల ఇంటి రుణాలు, విద్యా రుణాల ఈఎంఐలు కూడా కట్టడం ఆలస్యం కావడం వల్ల పెనాల్టీలు పడుతూ ఉన్నాయి. కొన్ని ఆసుపత్రులు నగదు రహిత వైద్యం ద్వారా ఉద్యోగ, ఉపాధ్యాయులకు వివిధ వ్యాధులకు శస్త్ర చికిత్సలు చేయాల్సి ఉన్నప్పటికీ వారు నిరాకరిస్తున్నారు. వైద్య అనారోగ్య కారణాల చేత సెలవులో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయుల వేతన బిల్లులు కూడా మంజూరు కావడంలేదు. జీతాలు కూడా రోజుకు రెండు, మూడు జిల్లాల చొప్పున నెలలో పదిహేను రోజుల పాటు చెల్లిస్తున్నారు. సక్రమంగా అందక సప్లిమెంటరీ బిల్లలు నెలల తరబడి పెండింగ్‌లో ఉండటం మూలాన ఆర్థిక సమస్యలతో కొట్టు మిట్టాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పెండింగ్‌లో ఉన్న అన్ని బిల్లులు వెంటనే చెల్లించాల్సిన అవసరం ఉన్నది.
– తంగళ్ళపల్లి కుమారస్వామి, 8106133144.

Spread the love