పారిశుధ్య కార్మికులు ఆరోగ్య భద్రత పాటించాలి

– చైర్‌ పర్సన్‌ అనురాధ రాంరెడ్డి
నవతెలంగాణ-తుర్కయంజాల్‌
వేసవి కాలంలో ఉష్ణోగ్రతల పెరుగుదల దృష్ట్యా పారిశుధ్య కార్మికులు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని, తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ మల్‌రెడ్డి అనురాధ రాంరెడ్డి సూచించారు. సోమవారం కమిషనర్‌ సత్యనారాయణరెడ్డితో కలిసి ఇంజాపూర్‌లో నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో కార్మికుల పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అనురాధ రాంరెడ్డి మాట్లాడుతూ మున్సిపల్‌ పరిధిలో పారిశుధ్యానికి ప్రాధాన్యమిస్తున్నామని, ప్రజలంతా సహకరించాలని కోరారు. ఇంటింట చెత్త సేకరణ వంద శాతం జరగాలని, ఆరుబయట చెత్త వేయొద్దని సూచించారు. లేదంటే భారీ జరిమానా తప్పదని హెచ్చరించారు. రోడ్డుకు ఇరువైపులా పొదలను, తొలగించుట, గుంతలను పూడ్చుట, రోడ్లను చదునుచేయుట, ప్లాస్టిక్‌ సేకరణ, ఫాగింగ్‌ చేయుట, దోమల లార్వాను నివారించే రసాయనాలను పిచికారీ చేయాలన్నారు. ఈ క్రమంలో కార్మికులు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దని, వేసవిలో ఎండలు మండుతున్నందున ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, నగేశ్‌, ఎన్విరాన్‌మెంట్‌ ఇంజినీర్‌ హరీశ్‌, వార్డు ఆఫీసర్‌ శ్రీనివాస్‌, జవాన్‌ నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love