టీటీడీ నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టిన శ్యామలరావు

నవతెలంగాణ – హైదరాబాద్: ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో కొందరు ఉన్నతాధికారులకు స్థాన చలనం కలుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో టీటీడీ ఈవోగా వ్యవహరించిన ధర్మారెడ్డిని కూటమి ప్రభుత్వం పక్కనబెట్టింది. దాంతో ఆయన సెలవుపై వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో, టీటీడీ నూతన ఈవోగా ఐఏఎస్ అధికారి జె.శ్యామలరావును నియమించారు. శ్యామలరావు ఇవాళ టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టారు. సంప్రదాయం ప్రకారం మొదట వరాహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా వచ్చిన శ్యామలరావుకు టీటీడీ వర్గాలు స్వాగతం పలికాయి. మాజీ ఈవో ధర్మారెడ్డి… శ్యామలరావుకు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా శ్యామలరావు మాట్లాడుతూ, ఎంతో పవిత్రతో కూడిన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో పదవిని అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. ఈ పదవిని చేపట్టే అవకాశం తనకు రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.

Spread the love