చిన్న దేశాలైనా గొప్ప ఆలోచనలతో…

మహిళలు ఉద్యోగాలు చేయాలంటే ఎన్నో అడ్డంకులు. సరైన ప్రోత్సాహం ఉండదు. అవకాశాలు తక్కువ దీనికి తోడు వివక్ష, ఆంక్షలు, విమర్శలు, లింగ అసమానతలు, ఇంటి బాధ్యతలు.. ఇలా ఎన్నో మన కెరీర్‌ అభివృద్ధికి ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. వీటన్నింటినీ అధిగమించి ఉద్యోగం చేస్తున్నా పని ప్రదేశంలోనైనా పనికి తగ్గ ప్రతిఫలం దక్కుతుందా అంటే.. అదీ ప్రశ్నార్థకమే. ఉద్యోగాల్లో మహిళల శాతం పెరగకపోవడానికి ఇవే కారణమవుతున్నాయంటున్నారు నిపుణులు. మన దగ్గరే కాదు కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఇదే పరిస్థితి. అయితే కొన్ని చిన్న దేశాలు మాత్రం ఈ విషయంలో ముందడుగు వేస్తున్నాయి. మరి, ఇంతకీ ఏయే దేశాల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య ఎక్కువ ఉందో.. దానికోసం అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలుసుకుందాం…
    ‘మహిళలే మహిళల్ని ముందుకు నడిపించగలరు’ అంటుంటారు. ఆ దేశ సారథి కూడా మహిళే అయితే.. ఆ దేశం మహిళల అభ్యున్నతికి మారుపేరుగా నిలిచే అవకాశం ఉంటుంది. తూర్పు ఆఫ్రికాలోని మడగాస్కర్‌ దేశమే ఇందుకు మంచి ఉదాహరణ. 2.89 కోట్ల జనాభా ఉన్న ఈ చిన్ని దేశానికి మియాలీ రజోలినా అనే మహిళ అధ్యక్షురాలిగా ఉన్నారు. 2019లో ఈ పదవి చేపట్టిన ఆమె ఆ దేశ అభివృద్ధిలో, ముఖ్యంగా మహిళల అభ్యున్నతికి పాటుపడుతున్నారు. అందుకు అనుగుణంగా బాలికలకు విద్యావకాశాలు, మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు గతేడాది ‘Girls Learn, Women Earn’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది గతేడాది నవంబర్‌ 25న ‘మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం’తో ప్రారంభమై ఈ ఏడాది ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ వరకు కొనసాగింది. సుమారు వంద రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాలికా విద్య, మహిళల ఆర్థిక సాధికారత, లింగ వివక్షపై చర్చించారు. దీంతో పాటు పని ప్రదేశంలో మహిళలకు సౌకర్యాలు, పని చేసే తల్లులకు ప్రత్యేక ఏర్పాట్లు కల్పించడంపై కూడా దృష్టి పెట్టారు ఆమె. ఇవే అక్కడ అన్ని రంగాల్లో మహిళల ప్రాతినిథ్యాన్ని పెంచిందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం అక్కడ మహిళా ఉద్యోగుల సంఖ్య 83 శాతానికి పైనే ఉన్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలకు ప్రాధాన్యం
చాలాదేశాల్లో పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలకు అంత విలువ ఉండదు. కానీ పార్ట్‌టైమ్‌ ఉద్యోగాన్ని కూడా పూర్తి స్థాయి ఉద్యోగంగా పరిగణిస్తోంది నెదర్లాండ్స్‌ దేశం. ముఖ్యంగా కొత్తగా తల్లైన మహిళలు, ఇంటి బాధ్యతలు, ఇతర కారణాల రీత్యా ఉద్యోగం చేయలేకపోతున్న స్త్రీల కోసం ప్రత్యేక సౌలభ్యాలు కల్పిస్తున్నది. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం, పని ప్రదేశంలో మహిళల ప్రాతినిథ్యం వంటి అంశాల్లో పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయని ఆ దేశం విశ్వసిస్తోంది. పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేసే మహిళలకూ వారి పని గంటల్ని బట్టి పూర్తి స్థాయి ఉద్యోగాలు చేసే వారితో సమానమైన జీత భత్యాలు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ 40 శాతానికి పైగా మహిళలు పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేస్తున్నట్లు.. కొన్ని దేశాలతో పోల్చితే ఈ రేటు అధికంగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో మహిళా ఉద్యోగులు 76 శాతానికి పైనే ఉంది.
ఉమ్మడి నిర్ణయంతో…
ఇంటి బాధ్యతలు, పిల్లల ఆలనా, పాలన, గృహ హింస, పని ప్రదేశంలో లైంగిక వేధింపులు.. ఇలాంటివి చాలా దేశాల్లో మహిళల కెరీర్‌కు అడ్డుపడుతున్నాయి. తమ దేశంలోనూ ఉన్న ఈ ప్రతిబంధకాలపై కొన్నేండ్ల కిందట దృష్టి సారించింది కంబోడియా దేశం. భార్యాభర్తల ఉమ్మడి నిర్ణయం మేరకు.. ఇంటి బాధ్యతలు మగవారికి అప్పగించి.. మహిళలు తమ కెరీర్‌పై దృష్టి పెట్టేలా వారిని ప్రోత్సహిం చింది. పని ప్రదేశంలో వేతన వ్యత్యాసాన్ని తొలగించడం, లైంగిక హింసకు అడ్డుకట్ట వేసేలా పలు పాలసీలు రూపొందించారు. బాలికల్ని ఉన్నత విద్యావంతుల్ని చేయడం, మహిళలకు వొకేషనల్‌ ట్రైనింగ్‌ అందించడం, వ్యాపారాల్లో వారిని ప్రోత్సహించడం, జాతీయ, అంతర్జాతీయంగా మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించడం.. ఇలా పలు చర్యలు తీసుకుంది ఆ దేశ ప్రభుత్వం. ఇవే అక్కడ లింగ సమానత్వానికి తెర తీశా యని, పని ప్రదేశంలో మహిళల ప్రాతి నిధ్యాన్ని పెంచాయని నివేదికలు చెబు తున్నాయి. ప్రస్తుతం అక్కడ మహిళా ఉద్యోగుల శాతం 70కి పైమాటే.
ప్రత్యేక నిబంధనలతో…
7.08 లక్షల జనాభా ఉన్న సోలోమన్‌ ఐల్యాండ్స్‌ దేశంలో పురుషుల కంటే మహిళల శాతమే ఎక్కువ. ప్రపంచ బ్యాంక్‌ లెక్కల ప్రకారం.. ఇక్కడి మహిళల సంఖ్య 4.17 లక్షలు (58 శాతం)గా నమోదైంది. అయితే మహిళల సంఖ్యే కాదు.. ఉద్యోగాలు చేసే మహిళలు కూడా ఇక్కడ ఎక్కువే. అన్ని రంగాల్లో కలుపుకుంటే ఇక్కడ 84 శాతం కంటే ఎక్కువమంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. నిజానికి కొన్నేండ్ల కిందటి వరకు ఇక్కడా పురుషాధిపత్య సమాజమే ఉండేది. కానీ పని ప్రదేశంలో మహిళల సంఖ్యను పెంచడానికి, లింగ సమానత్వం సాధించడానికి 2017లో ఆ దేశ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. Waka Mere Program అంటే ‘షీ వర్క్స్‌’ అని అర్థం. ‘సోలోమన్‌ ఐల్యాండ్స్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండిస్టీ’, ‘ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌’ సంయుక్తంగా రెండేండ్ల పాటు ఈ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో భాగంగా.. మహిళలు కెరీర్‌ పరంగా రాణించలేక పోవడానికి సామాజికపరంగా ఉన్న కారణాలు, ఆ వివక్షను అధిగమించే మార్గాలపై మహిళలకు అవగాహన కల్పించారు. ఇలా ఈ కార్యక్రమం ప్రభావం నేటికీ కొనసాగుతోందని, ఫలితంగానే అక్కడ మహిళా ఉద్యోగుల సంఖ్య 84 శాతానికి పెరిగిందని తేలింది.
మహిళల అభ్యున్నతి ప్రాధాన్యం
కేవలం 3.73 లక్షల జనాభా ఉన్న ఐస్‌ల్యాండ్‌ దేశం మహిళలకు సానుకూలమైన దేశాల్లో టాప్‌ ర్యాంకులో నిలుస్తుంటుంది. ఇందుకు కారణం.. ఇక్కడ మహిళల అభ్యున్నతి పరంగా సానుకూల చట్టాలు ఎక్కువ. ‘స్త్రీపురుషులకు సమాన హక్కులు కల్పించడం’ దగ్గర్నుంచి, ‘సమాన పనికి సమాన వేతనం’, ‘సంస్థ బోర్డుల్లో తప్పనిసరిగా 40 శాతం మహిళలుండాల’న్న నియమం, ‘ప్రపంచంలోనే అత్యుత్తమమైన పేరెంటల్‌ లీవ్‌ పాలసీ (తల్లిదండ్రులకు 9 నెలల వేతనంతో కూడిన సెలవు)’, ‘పాఠశాల దశ నుంచే లింగ సమానత్వంపై అవగాహన కల్పించడం’, సెక్స్‌ వర్క్‌ తరహా కార్యకలాపాలు చట్టవిరుద్ధం’.. ఇలా మహిళలకు సంబంధించిన ప్రతి విషయం అక్కడ చట్టంతో ముడిపడి ఉంటుంది. ఇలా మహిళలకు సానుకూలంగా ఉంటూ.. వారిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తోన్న ఐస్‌ల్యాండ్‌లో మహిళా ఉద్యోగుల సంఖ్య 77 శాతానికి పైనే ఉంది.

Spread the love