సమాజం వాస్తవ పరిస్థితులకు దూరంగా జరిగిపోతోంది

Society is moving away from realityమౌమితా ఆలం… బెంగాలి కవయిత్రి, ఉపాధ్యాయిని, ప్రముఖ పత్రికలకు కాలమ్స్‌ రాస్తున్న రచయిత. ఆమె కవితలు 2019 నుండి కరోనా వరకు జరిగిన ప్రతి సంఘటనలను పట్టుకోవ డానికి ప్రయత్నించాయి. ఆ కవిత్వం వేదనలు, మరణాలు, అమానవీయానికి గురవుతున్న ప్రజల బాధలకు ప్రతిధ్వనులు. ఆమె కవిత్వం పీడితులకు స్వరం. భిన్న కోణాలలో రాసిన కవిత్వం నూతన ప్రతీకలతో, రూపకాలతో పాఠకుని హృదయాన్ని తీవ్రంగా తాకుతుంది. తన మూడు పుస్తకాలలో ఒక బాలికగా, ఒక స్త్రీగా, ఒక ముస్లిం స్త్రీగా, ఒక సామాజిక బాధ్యత గల పౌరురాలిగా, అంతర్జాతీయంగా జరుగుతున్న దురదృష్టకర పరిణామాల వల్ల సర్వం కోల్పోతున్న వారికి సహానుభూతిగా తన స్వరం ఎత్తారు. తన పదునైన, ఛెళ్ళుమని రాసే శైలి వలష్ట్రa దేశంలోని పలు సాహితీ సమూహాల, ప్రజాస్వామ్య శక్తుల దృష్టిని ఆకర్షిం చారు. పలు భారతీయ భాషలలో ఆమె కవిత్వం అనువాదం జరుగుతోంది. ఆ సందర్భంగా హైదరాబాదు తొలిసారి వచ్చిన ఆమెతో సంభాషణ...
మీ కుటుంబ నేపథ్యం చెబుతారా..?
ఉత్తర బెంగాల్లోని మారుమూల ప్రాంతమైన సిలిగురి మా సొంత ఊరు. అక్కడే పుట్టి పెరిగాను. అది పూర్తిగా లోతట్టు ప్రాంతం. ‘తీస్తా’ నది పక్కనే ఉండేది. బాల్య మంతా అమ్మమ్మ, పిన్ని దగ్గర గడిచిపోయింది. నాకు మా అమ్మా నాయనలతో పెద్ద అనుబంధాలు ఏమీ లేవు. వాళ్లు టీ తోటల్లో పనిచేసేవాళ్ళు. నా చదువు విషయాలన్నీ మా పిన్ని చూసుకునేది. మా ఊరికి 20కి.మీ. దూరంలో ఉండే స్కూల్లో నాకు అడ్మిషన్‌ దొరికింది. ప్రయాణం చాలా దారుణంగా ఉండేది. రెండు కిలోమీటర్లు బురద రోడ్డులో నడుచుకుంటూ వెళ్ళి ఆ తర్వాత రిక్షాలో బస్టాండ్‌కు వెళ్ళేదాన్ని. కానీ ఆ ప్రయాణమే తర్వాతి కాలంలో నాకు ఒక వరంగా మారింది. స్కూలుకు వచ్చి పోయేటప్పుడు మార్గం మధ్యలో కలిసే ప్రజలతో మాట్లాడుతూ చాలా నేర్చుకున్నాను. అదే నాలో రాజకీయ స్పృహను కలిగించింది. తర్వాత పట్టణానికి వచ్చి డిగ్రీ పూర్తి చేశాను. అప్పటికే మా పిన్ని పెళ్లయిపోయింది. ఆమె భర్త వల్ల అనేక బాధలు అనుభవించాను. లైంగికంగా నన్ను వేధించేవాడు. దాంతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఆ బాధల మధ్యనే ఎమ్మె ఇంగ్లీష్‌ పూర్తి చేసి టీచర్‌గా ఉద్యోగ సంపాదించాను. ఆ సమయంలోనే ఓ వ్యక్తిని ప్రేమించి పెండ్లి చేసుకున్నాను. మా ఇంట్లో ఒప్పుకోకపోతే అతని కోసం నా కుటుంబాన్నే వదిలేసుకున్నాను. ప్రేమించి పెండ్లి చేసుకున్న వ్యక్తితో సంతోషంగా ఉండొచ్చు అనుకుంటే అదీ బెడిసి కొట్టింది. నిత్యం హింసించేవాడు. దాంతో విడాకులు తీసుకున్నాను. ఆ సమయంలో పుస్తకాలు నాకు ఓదార్పునిచ్చాయి. నాకు ఒక పాప ఉంది. తనకు ఎనిమిదేండ్లు. ఇప్పుడు అన్నీ తనే నాకు.
మిమ్మల్ని కవిత్వం రాయడానికి పురికొల్పిన అంశాలు ఏమిటి?
నేను కవిని. కాలానికి సాక్షిని. ఒక ముస్లిం యువతిగా నన్ను మూడు, నాలుగు విధాలుగా అట్టడుగుకు తోసేసారు. అణచివేతను ఎదుర్కొనే దారేది? కవిత్వం అణచివేతను ఎదుర్కొనే ఉత్తమ మాధ్యమం. అందుకే నేను కవిత్వాన్ని ఎంచుకున్నాను. నేను తిరగబడతాను. దానిలోనే నేనున్నాను.
మీరు రాస్తున్న ఈ భిన్నమయిన కవిత్వనికి దేశ వ్యాప్తంగా ఆదరణ, ప్రచారమూ లభిస్తుంది. వివిధ రాష్ట్రాలలో సాహితీ సమూహాలు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. దాని గురించి చెప్పండి?
ప్రజలు మన కవిత్వాన్ని ప్రేమించడం, ఆకర్షితులు కావడం ఆనందం ఇస్తుంది. ప్రజలను నిశ్శబ్దం నుండి మేల్కొలపడానికి నేను రాస్తాను. నిజానికి మౌనంగా ఉండడమంటే చచ్చిపోయినట్టు లెక్క. నేను ప్రయాణించాల్సిన దూరం ఇంకా చాలా వుంది. నేను గొప్ప సాహతీ ఉద్దండురాలినా కాదా అని ఆలోచించను. కానీ, కవిత్వాన్ని ఆదరించి, అక్కున చేర్చుకునేవాళ్లు ఉండటం బాగుంటుంది. నేను ఇంకా సుదూరంగా అడుగులు వేయాల్సి వుంది.
రాజ్యధిక్కార కవిత్వం రాస్తున్నారు. మీకు భయం లేదా? ఎప్పుడైనా బెదిరింపులు ఎదుర్కొన్నారా?
ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టు సరైన ప్రశ్న వేసారు. అణచివేతకు పాల్పడడమే రాజ్య ధోరణి. ఏ కారణం లేకుండానే అది మిమ్మల్ని తుడిచిపెట్టేయగలదు. కొన్ని ఏండ్లుగా మేము గమనిస్తూ వున్నాం. పేరుని బట్టి చంపేస్తున్నారు. లవ్‌ జిహాద్‌ అని చంపేస్తున్నారు. నేను రాసేటప్పుడు.. సత్యానికి కట్టుబడి వుంటాను. పాఠకుల పట్ల బాధ్యతగా వుంటాను. నేను భయపడను. నాలోని నొప్పి, వేదన భయపడదు. అయినా కవిత్వం రాయడం నేరం కాదు. ఇది ప్రజాస్వామ్య దేశం. ఎవరైనా కవిత్వం రాయవచ్చు.
ప్రస్తుతం రాస్తున్న యువకవుల గురించి మీ అభిప్రాయం?
దురదృష్టవశాత్తు గత ఇరవై, ముప్పై ఏండ్లుగా చూస్తే మన విద్యా విధానం మొత్తం ప్రైవేటు శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. యువతకి మట్టితో సంపర్కం తెగిపోతోంది. అపార్ట్‌మెంట్‌ సంస్కృతి పెరిగిపోయింది. మనం వాస్తవానికి ఎడంగా జరిగిపోతున్నాం. కొంతమంది యువత ఇంకా తిరుగుబాటు కవిత్వం రాస్తున్నారు. కానీ చాలా మంది చంద్రుడు, ప్రేమ అని రాస్తున్నారు. ప్రేమ కూడా విప్లవమే, ప్రతిఘటనే.. కానీ కళ్ళ ముందు ప్రపంచం రక్తమోడుతున్నప్పుడు చందమామ అందాల గురించి రాయడం నేరం.
కవిత్వం సామాన్య ప్రజల జీవితాలని మార్చ గలదని అనుకుం టున్నారా?
అవును. చరిత్ర చూసుకుంటే సమాజంలో మార్పు రావడానికి కవిత్వం, సాహిత్యం చాలా ముఖ్యపాత్ర పోషించాయి. మీరు వినే వుంటారు… బెంగాలీ ప్రముఖ కవి కజి నజ్రుల్‌ ఇస్లాం గురించి. మేము అతన్ని విప్లవ కవిగా పిలుస్తాము. కవిత్వం సమాజానికి అద్దం లాంటిది. ఈ నిశ్శబ్దం నుంచి, ఈ మొద్దు నిద్ర నుంచి సమాజం మేల్కోవాలి. తన అణచివేతను ఎదుర్కోవాలి. ఆ పోరాటం కవిత్వం కావొచ్చు. ఒక నినాదం కావొచ్చు. ఒక అహింసాయుత ప్రకటన కావొచ్చు. కవిత్వం సమాజాన్ని మార్చగలదని నేను నమ్ముతాను.
– పి.శ్రీనివాస్‌ గౌడ్‌, 9949429449

Spread the love