అభివృద్ధి కేంద్రంగా ఆగ్నేయాసియా!

Southeast Asia as the center of development!ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో అభివృద్ధి కేంద్రంగా ఆగేయాసియాను రూపొందించటంతో పాటు, వెలుపలి దేశాల వృద్ధికి కూడా పాటు పడతామని ఇండోనేషియా రాజధాని జకర్తాలో గురువారంనాడు ముగిసిన నలభై మూడవ ఆసియన్‌ శిఖరాగ్ర సమావేశం పేర్కొన్నది. ఆసియన్‌ ఆమోదించిన నాలుగవ ఒప్పందం ఈ క్రమంలో గట్టి పునాదిగా ఉంటుందని, ఈ కూటమి దేశాల విజన్‌ 2045 పరిపూర్తికి కృషి చేస్తామని పేర్కొన్నది. ఒకే దృష్టి, ఒకే గుర్తింపు, ఒకే సమాజం అనే లక్ష్యాలతో 1967లో ఆగేయ ఆసియాలోని ఇండోనేషియా, మలేసియా, ఫిలిప్పైన్స్‌, సింగపూర్‌, థాయిలాండ్‌ దేశాలతో ఏర్పడిన ఈ సంస్థ తరువాత బ్రూనీ, వియత్నాం, లావోస్‌, మయన్మార్‌, కంపూచియాలతో విస్తరించింది. ఈ కూటమిని ఐరాస చర్చల భాగస్వామిగా గుర్తించి పరిశీలక హౌదా ఇచ్చారు. 1991తరువాత చైనా, జపాన్‌, దక్షిణ కొరియాలతో అనుసంధానం చేసి ఆసియన్‌ ప్లస్‌- 3గా తరువాత భారత్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో ప్లస్‌-6గా మార్చినప్పటికీ పూర్తి సభ్వత్వం పది దేశాలకే ఉన్నది. చర్చలు, ఒప్పంద అమలు భాగస్వామ్య పక్షాలుగా ప్రస్తుతం మొత్తం 27 దేశాలు ఉన్నాయి.
జకర్తాలో ”ఆసియన్‌ సమస్యలు: అభివృద్ధి కేంద్రం” అనే ఇతివృత్తంతో సభ జరిగింది. సహజంగానే ఈ సభలో పాల్గొన్న ప్రముఖులందరి ఉపన్యాసాలు, సూచనలు, సలహాలు దీని చుట్టూనే ఉన్నాయని వేరే చెప్పనవసం లేదు. ఆగేయాసియాలో కమ్యూనిజం వ్యాప్తి నిరోధం, చైనాను అడ్డుకొనేందుకు అమెరికా ఏర్పాటు చేసిన ఈ కూటమి ముఖ్యంగా 1991లో సోవియట్‌ యూనియన్‌ను కూల్చివేసిన తరువాత అనేక మార్పులకు లోనైంది. నాటో తరహాలో 1954లో ఆగేయాసియా మిలిటరీ కూటమిని (సీటో) కూడా అమెరికా ఏర్పాటు చేసింది. ప్రధానంగా ఇండో చైనా దేశాలైన వియత్నాం, కంపూచియా, లావోస్‌లను ఆక్రమించి తమ తొత్తు పాలకులను ఏర్పాటు చేసేందుకు, ఆ ప్రాంతంలో కమ్యూనిస్టులను అణచివేసేందుకు దీన్ని ఉద్దేశించారు. ఈ కూటమిలో ఫిలిప్పైన్స్‌, థాయిలాండ్‌ మాత్రమే ఆ ప్రాంత దేశాలు కాగా అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ ఇతర సభ్యులు. 1975లో ఇండోచైనాలో కమ్యూనిస్టులు, ఇతర పురోగామి శక్తుల చేతిలో జపాన్‌, ఫ్రాన్స్‌, అమెరికా పరాభవం, చివరికి అమెరికా సేనలు ఆ ప్రాంతం నుంచి పారిపోయిన తరువాత ఆ కూటమి ఉనికిలో లేకుండా పోయింది.
ఇటీవలి వరకు అమెరికా, ఐరోపా దేశాల ఎగుమతులకు మార్కెట్‌గా ఉన్న ఆసియన్‌ కూటమి దేశాలు ఇప్పుడు వాటిని పక్కకు నెట్టేసి చైనాతో వాణిజ్య లావాదేవీలను ఎక్కువ జరుపుతున్నాయి. ఒక కూటమిగా ఉన్నప్పటికీ దేశాల మధ్య కొన్ని వివాదాలు పరిష్కారం కావటం లేదు. దీన్ని అవకాశంగా తీసుకొని వాటిని మరింతగా పెంచేందుకు, ఆ సాకుతో ఇటీవలి కాలంలో చైనాను ఒంటరిపాటు చేసేందుకు దక్షిణ చైనా సముద్రంలో స్వేచ్చగా నౌకా రవాణా జరగాలని, ఆ ప్రాంతంలోని చమురు నిల్వలను చైనా ఆక్రమించేందుకు చూస్తోందంటూ రెచ్చగొట్టేందుకు, ఆ ప్రాంత దేశాలతో వ్యతిరేక కూటమి ఏర్పాటు చేసేందుకు అమెరికా పూనుకుంది. ఈ పరిణామాలను గమనంలో ఉంచుకొనే నూతన ప్రచ్చన్న యుద్ధాని వ్యతిరేకించాలని, సహకారాన్ని పెంపొందించుకొనే దిశగా ముందుకు సాగాలని 26వ చైనా-ఆసియన్‌ సభలో చైనా ప్రధాని లీ క్వియాంగ్‌ పిలుపునిచ్చాడు. విబేధాలు ఉంటే వాటిని సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పాడు. భారత్‌-ఆసియన్‌ సంబంధాలు, సహకారం మెరుగుదలకు ప్రధాని నరేంద్రమోడీ పన్నెండు అంశాలను ప్రతిపాదించారు. వాటి గురించి ఆసియన్‌ దేశాల నేతలతో మోడీ సంప్రదింపులు జరిపారు. సముద్రయాన సహకారం, ఆహార భద్రతకు సంబంధించి రెండు సంయుక్త ప్రకటనలను కూడా వెలువరించారు.
అమెరికా, ఐరోపా సమాఖ్య పెత్తనాన్ని అడ్డుకొనేందుకు ఆర్థిక యూనియన్‌గా ఏర్పడేందుకు, ఒకే కరెన్సీని ఉనికిలోకి తెచ్చేందుకు కొన్ని దేశాలు చూసినప్పటికీ అమెరికా వాటిని పడనివ్వలేదు.ఈ కూటమిని తమతో తీసుకుపోయేందుకు చూస్తున్నప్పటికీ సాధ్యం కావటం లేదు. ఉక్రెయిన్‌ – రష్యా సంక్షోభంలో తటస్థంగా ఉండి ఒత్తిళ్లకు లొంగలేదు. ఏ శక్తికీ బినామీగా ఉండకూడదని తమ కూటమి నిర్ణయించిందని ప్రస్తుతం అధ్యక్ష స్థానంలో ఉన్న ఇండోనేషియా అధినేత విడోడో జొకోవీ 43వ శిఖరాగ్ర సభ ప్రారంభ ఉపన్యాసంలో చెప్పటం హర్షణీయం. ఐరోపాలో రష్యాపై పశ్చిమ దేశాలు, ఆసియాలో చైనాను నిలువరించే అమెరికా ఆధిపత్య వైఖరితో ఉద్రిక్తతలు పెరుగుతున్నట్లుగా, చైనాతో విడగొట్టుకోవటం సాధ్యం కాదని ఇండోనేషియా గుర్తించినట్లు జొకోవీ మాటలు వెల్లడిస్తున్నట్లు చెప్పవచ్చు. ప్రజాస్వామ్య పునరుద్దరణకు కూటమి సూచించిన ఐదు అంశాలను పక్కన పెట్టిన మయన్మార్‌ మిలిటరీ పాలకుల చర్యను తొలిసారిగా ఆసియన్‌ కూటమి జకార్తాలో చేసిన ఒక ప్రకటనలో ఖండించింది. 2026లో దానికి దక్కాల్సిన అధ్యక్ష స్థానాన్ని తిరస్కరించి ఫిలిప్పైన్స్‌కు అప్పగించటమే కాదు, మరో పది సంవత్సరాల వరకు మయన్మార్‌కు అవకాశం రాకుండా ఒక పద్ధతిని రూపొందించటం ఒక విశేషం. ఇది నిరంకుశ పాలకులకు ఒక హెచ్చరిక.

 

Spread the love