డిప్రెషన్‌కు గురయ్యా

– ఆత్మహత్య ఆలోచనలు వచ్చాయి
– బ్రిజ్‌ భూషణ్‌ లైంగిక వేధింపులే కారణం
– మహిళా రెజ్లర్‌ ఆరోపణలు
న్యూఢిల్లీ : రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళల్లో ఒకరు తనకు ఎదురైన మానసిక వేదనను వెలిబుచ్చారు. తాను డిప్రెషన్‌తో బాధపడుతున్నాననీ, లైంగిక వేధింపుల కారణంగా ఆత్మహత్య ఆలోచనలు వచ్చాయని వివరించారు. బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌పై గత నెలలో దాఖలు చేసిన చార్జిషీట్‌లో మహిళ ఆరోపణలను పోలీసులు పేర్కొన్నారు. డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌ ఐపీసీలోని సెక్షన్‌ 354, 354ఏ, 354డీ కింద శిక్షార్హుడని పోలీసులు చార్జీషీట్‌లో పేర్కొన్నారు. 1599 పేజీల చార్జిషీట్‌లో ఆరుగురు రెజ్లర్‌ ఫిర్యాదుదారుల వాంగ్మూలాలు ఉన్నాయి. బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ చర్యల కారణంగా తాను డిప్రెషన్‌లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలో పడ్డానని వారిలో ఒక మహిళ చార్జిషీట్‌లో పేర్కొన్నది. బ్రిజ్‌భూషణ్‌ ను కలిసేందుకు నిరాకరించడంతో ప్రధాని మోడీని కలిసేందుకు వెళ్లిన అథ్లెట్ల జాబితా నుంచి తన పేరు తొలగించారని ఆ మహిళ ఆరోపించింది. మరో ఫిర్యాదుదారు 2009లో సింగ్‌తో ”రాజీ” చేసుకోవడానికి నిరాకరించినందున రెజ్లింగ్‌ రంగానికి తిరిగి రాలేకపోయానని వివరించింది. 2021లో తన అడ్వాన్సులను తిరస్కరించిన తర్వాత బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ తన కెరీర్‌ను ముగించేస్తానని బెదిరించాడని మరో రెజ్లర్‌ ఆరోపించారు.

Spread the love