అవసరమేరకు పచ్చిరొట్ట విత్తనాలు సరఫరా

అవసరమేరకు పచ్చిరొట్ట విత్తనాలు సరఫరా– మంత్రి తుమ్మల ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రైతుల అవసరం మేరకు పచ్చిరొట్ట విత్తనాలు సరఫరా చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆ విత్తనాల విలువ రూ. 61.15కోట్లు ఉంటుందని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విత్తన కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన హామీమేరకు విత్తన ప్యాకెట్లు సరఫరా చేశాయా? లేదా? సరఫరా చేస్తే అవి రైతులకు చేరాయా? లేదా? అనే విషయాలను తనిఖీ చేయాలని సూచించారు.ఎరువల విషయంలో కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేయాలన్నారు. రెండు నెలల ముందుగానే ఎరువులు తెప్పించేలా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని మంత్రి ఆదేశించారు. పంటల నమోదు ప్రక్రియ అనేది ఎలాంటి లోపాలకు తావులేకుండా పారదర్శకంగా జరగాలని కోరారు. అదేవిధంగా డ్రిప్‌, స్ప్రింక్లర్ల సౌకర్యం కేవలం ఆయిల్‌ పామ్‌ పంటకే కాకుండా ఇతర పంటలకు వర్తింప చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన, ఇతరశాఖల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను దేనికోసమైతే కేటాయించాలో, ఆ లక్ష్యాలను నెరవేర్చే విధంగా ఉపయోగంలోకి తీసుకొచ్చి రైతులకు ప్రయోజనం చేకూర్చాలని సూచించారు. విత్తనోత్పత్తి క్షేత్రాల్లో విత్తనాలను ఉత్పత్తి చేయడంతోపాటు పూలు, పండ్ల మొక్కలను తక్కువ ధరకు రైతులకు సరఫరా చేయాలని సూచించారు.పహడిషరీఫ్‌లో వక్ఫ్‌ భూముల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లలో సబ్‌మార్కెట్‌ను ప్రారంభించేందుకు అవకాశాలను పరిశీలించాల్సిందిగా మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. గతంలో సూచించిన విధంగా సౌరవిద్యుత్‌ యూనిట్లను నెలకొల్పేందుకు ఉన్న అవకాశాలపై మార్కెటింగ్‌, గిడ్డంగుల అధికారులు, మార్క్‌ఫెడ్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా వ్యవసాయశాఖ డైరెక్టర్‌ గోపి, తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎమ్‌డీ హరిత మాట్లాడుతూ 1,09,937 క్వింటాళ్ళ విత్తనాలను రైతులకు అందచేసామన్నారు. ఇంకా అవసరమైతే విత్తనాలు తెప్పించి ఇస్తున్నామని తెలిపారు. 15 జూన్‌ నాటికి 64,34,215 పత్తి ప్యాకెట్లు రైతులకు అందుబాటులో ఉంచామంటూ జూన్‌, జులై నెలల అవసరాలమేరకు అన్ని ఎరువులు తెప్పించి రైతులకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు. 7,97,194 మెట్రిక్‌ టన్నుల యూరియా, 75,278 మెట్రిక్‌ టన్నుల డీఏపీ 4,27,057 మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు, 26,396 మెట్రిక్‌ టన్నుల మ్యూరెట్‌ ఆఫ్‌ పొటాష్‌ ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు .ఉద్యానశాఖ డైరెక్టర్‌ అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ఆయిల్‌పామ్‌ కంపెనీల ప్రగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామనీ, నిర్దేశిత లక్ష్యాలమేర ఫలితాలు చూపని కంపెనీలకు నోటీసులు ఇచ్చామన్నారు. అలాంటి కంపెనీలపై వెంటనే చట్టప్రకారం తగు చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, హాకా ఇన్‌చార్జి ఎమ్‌డీ సత్యశారద, ఆగ్రో ఎమ్‌డీ కె. రాములు, వేర్‌ హౌస్‌ ఎమ్‌డీ జితేందర్‌రెడ్డి, మార్క్‌ఫెడ్‌ ఎమ్‌డీ సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love