పతంజలి క్షమాపణకు సుప్రీం నో

Patanjali's apology Supreme No– మా ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించారు
– తదుపరి చర్యకు సిద్ధంగా ఉండండి : తేలిగ్గా తీసుకుంటున్నారంటూ రాందేవ్‌పై ఆగ్రహం
న్యూఢిల్లీ : పతంజలి సంస్థకు బుధవారం సుప్రీంకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన బాబా రాందేవ్‌, ఆచార్య బాలకృష్ణల ‘బేషరతు క్షమాపణ’ను న్యాయస్థానం తోసిపుచ్చింది. పతంజలి ఉత్పత్తులకు సంబంధించి ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇచ్చినందుకు సుప్రీంకోర్టు గతంలోనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై అలాంటి ప్రకటనలు ఇవ్వబోమని హామీ ఇచ్చిన పతంజలి సంస్థ, దానిని బేఖాతరు చేసి వాటిని కొనసాగించింది. దీంతో మండిపడిన న్యాయస్థానం రాందేవ్‌, బాలకృష్ణలను తన ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఆ మేరకు వీరిద్దరూ ఇప్పటికే కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. తాజాగా బేషరతుగా క్షమాపణ చెబుతూ అఫిడవిట్లు సమర్పించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇవ్వవద్దని గతంలో తాను ఆదేశించినప్పటికీ పతంజలి సంస్థ వాటిని కావాలనే, ఉద్దేశపూర్వకంగానే పదేపదే ఉల్లంఘించిందని జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ అహ్సనుద్దీన్‌ అమానుల్లాతో కూడిన సుప్రీం బెంచ్‌ తెలిపింది.
అంథులం కాదు
అంతకుముందు పతంజలి తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపిస్తూ ప్రజలు తమ జీవితంలో పొరబాట్లు చేస్తుంటారని వ్యాఖ్యానించారు. దీనిపై న్యాయమూర్తులు జోక్యం చేసుకుంటూ ఆయనను మందలించారు. ఇలాంటి కేసుల్లో ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పారు. ‘మేము అంథులం కాదు. ఈ కేసులో ఉదారంగా వ్యవహరించాలని కోరుకోవడం లేదు’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
వైఫల్యం నుంచి తప్పించుకోలేకనే…
పతంజలి-దాని ఎండీ ఆచార్య బాలకృష్ణ, బాబా రాందేవ్‌ సమర్పించిన రెండు అఫిడవిట్లను విచారణ సమయంలో రోహత్గీ చదివి వినిపించారు. వీటిపై కూడా న్యాయస్థానం స్పందించింది. ‘క్షమాపణ కాగితం పైనే ఉంది. వారు తమ వైఫల్యం నుంచి తప్పించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకే విధిలేక అఫిడవిట్లు సమర్పించారు. వాటిని అంగీకరించడానికి నిరాకరిస్తున్నాము. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన ఉల్లంఘనేనని భావిస్తున్నాం. అఫిడవిట్ల తిరస్కరణతో తదుపరి చర్యకు సిద్ధంగా ఉండండి’ అని అన్నారు.
రాందేవ్‌పై ఆగ్రహంర
వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలంటూ బాబా రాందేవ్‌ అభ్యర్థించడంపై కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విదేశాలకు వెళ్లాలని అనుకుంటున్నానని తెలిపిన రాందేవ్‌, అఫిడవిట్‌లో పాత తేదీతో ఉన్న టిక్కెట్‌ను ఫైల్‌ చేశారు. ‘ఇది కోర్టు ధిక్కరణ కేసు. వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరినప్పుడు నా వద్ద విదేశాలకు వెళ్లేందుకు టిక్కెట్‌ ఉన్నదని చెప్పారు. ఇప్పుడేమో లేదని చెబుతారా? ఈ ప్రక్రియను మీరు తేలిగ్గా తీసుకుంటున్నారు’ అని బెంచ్‌ హెచ్చరించింది.
ముందే మీడియాకు పంపుతారా?
క్షమాపణ అఫిడవిట్‌ను కోర్టుకు అందజేయడానికి బదులుగా దానికి ముందుగానే మీడియాకు బహిర్గతం చేయడంపై కూడా న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ముందుగా వారు ఆ అఫిడవిట్‌ను మంగళవారం రాత్రి 7.30 గంటలకు మీడియాకు పంపారు. దానిని మాకు అప్‌లోడ్‌ చేయలేదు. వారికి ప్రచారంపై ఆసక్తి ఉన్న విషయం స్పష్టమైంది’ అని జస్టిస్‌ కోహ్లీ అన్నారు.
ఉత్తరాఖండ్‌ పైనా అక్షింతలు
పతంజలి ఉత్పత్తులకు లైసెన్సు మంజూరు చేసిన ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాన్ని కూడా న్యాయస్థానం తప్పుపట్టింది. అందుకు కారకులైన ముగ్గురు డ్రగ్‌ లైసెన్సింగ్‌ అధికారులను తక్షణమే సస్పెండ్‌ చేయాలని ఆదేశించింది. ‘పతంజలి సంస్థ మీకు ఇచ్చిన స్టేట్‌మెంటును ఉల్లంఘిస్తుంటే ఏం చేస్తున్నారు? కూర్చొని గోళ్లు గిల్లుకుంటున్నారా? మిమ్మల్ని వేలెత్తి చూపే వరకూ వేచి ఉంటారా?’ అని జస్టిస్‌ కోహ్లీ ప్రశ్నించారు. అధికారులను కూడా వదిలిపెట్టబోమని ఉత్తరాఖండ్‌ లైసెన్సింగ్‌ సంస్థ తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది ధృవ్‌ మెహతాను ఉద్దేశించి జస్టిస్‌ అమానుల్లా హెచ్చరించారు. దీనిని తాము తేలిగ్గా తీసుకోబోమని స్పష్టం చేశారు. అధికారులు పతంజలితో కుమ్మక్కైనట్లు కన్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసిన సుప్రీంకోర్టు, ఆ రోజు విచారణకు హాజరు కావాలని రాందేవ్‌, బాలకృష్ణలను ఆదేశించింది.

Spread the love