ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

  •  తొర్రూరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి సరిత
  •  మండలంలోని పలు గ్రామాల్లో న్యాయ విజ్ఞాన సదస్సులు

నవతెలంగాణ పెద్దవంగర: గ్రామీణ ప్రాంత ప్రజలు ఉచిత న్యాయ సేవా, సలహాలను సద్వినియోగం చేసుకోవాలని తొర్రూరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ మట్ట సరిత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బానోత్ లాలు, ఎస్సై రాజు అన్నారు. గురువారం మండలంలోని చిట్యాల, ఉప్పెరగూడెం గ్రామాల్లో సర్పంచులు రావుల శ్రీనివాస్ రెడ్డి, దుంపల జమున సమ్మయ్య అధ్యక్షతన మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సలహాలపై ప్రజలకు అవగాహణ కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. న్యాయం అందరికి సమానమేనని, ధనిక, పేద, కులం, మతం అనే తేడాలు లేవని తెలిపారు. న్యాయ సేవాధికార చట్టం పేదలకు, బాలలకు, మహిళలకు, కల్పిస్తున్న ఉచిత న్యాయ సహాయాన్ని వినియోగించుకోవాలని కోరారు. విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే మంచి సమాజాన్ని నిర్మించుకోగలమన్నారు.
ప్రామిసరీ నోటు లేకుండా నగదు ఇవ్వరాదని చెప్పారు. రైతులు ఎరువులు విత్తనాల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, తప్పనిసరిగా ఎరువులు, విత్తనాల కొనుగోలుకు సంబంధించిన బిల్లులను తీసుకోవాలని రైతులకు సూచించారు. కేసుల విషయంలో పరస్పర అంగీకారంతో రాజీ మార్గాన్ని ఎంచుకోవాలన్నారు. తద్వారా సత్వర న్యాయం అందుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తొర్రూర్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మైలపాక అశోక్, ప్రధాన కార్యదర్శి ధరావత్ నగేష్, న్యాయవాదులు, లింగాల శ్రీను, గణపురం రామకృష్ణ, తలారి యాకాంబ్రం, కృపావతి, సతీష్, వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కేతిరెడ్డి సోమనర్సింహా రెడ్డి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love