బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఇసుర్రాళ్ల మధ్య నలుగుతున్న తెలంగాణ

Between the BRS and the Congress Telangana is shaking– కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐదేండ్లుంటే సర్వనాశనమే
– బీజేపీని గెలిపిస్తే ఆకాంక్షలను నెరవేరుస్తాం
– ప్రజల ఆశ్వీరాదంతో మూడోసారి అధికారం మాదే : నాగర్‌కర్నూల్‌ బీజేపీ విజయ సంకల్ప బహిరంగ సభలో ప్రధాని మోడీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అనే రెండు ఇసుర్రాళ్ల మధ్య తెలంగాణ నలిగిపోతున్నదనీ, తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐదేండ్లు ఉంటే సర్వనాశనమే అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు. తెలంగాణ ప్రజలు బీజేపీని అశ్వీరదిస్తే మూడోసారి అధికారంలోకి వస్తామనీ, అప్పుడు ఇక్కడి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని హామీనిచ్చారు. తెలంగాణ దక్షిణ భారతదేశానికి ముఖద్వారమని చెప్పారు. పదిరోజులు మీతో ఉంటే తెలుగు మాట్లాడుతానన్న ఆశ ఉందన్నారు. శనివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, నల్లగొండ పార్లమెంటరీ నియోజకవర్గాల బీజేపీ అభ్యర్థులు పి.భరత్‌, డీకే అరుణ, సైదిరెడ్డి గెలుపును కాంక్షిస్తూ నిర్వహించిన విజయసంకల్ప యాత్రలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో అన్ని సీట్లను గెలిపించి గిఫ్టుగా ఇస్తే పగలూ, రాత్రి ప్రజల కోసం పనిచేస్తామని హామీనిచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడు దశాబ్దాలుగా దేశాన్ని లూటీ చేసిందని ఆరోపించారు. పేదల జీవితాల కోసం ఆ పార్టీ చేసిందేమీ లేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను ఓటుబ్యాంకుగా వాడుకుంటున్నదని ఎండగట్టారు. ద్రౌపది ముర్ముని రాష్ట్రపతి కాకుండా అడ్డుకోవాలని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ చూశాయని విమర్శించారు. దళితబంధు ఇస్తామనీ, దళితున్ని సీఎం చేస్తానని కేసీఆర్‌ మోసం చేశారన్నారు. ఇప్పుడు ఆయన రాజ్యాంగాన్ని మార్చాలంటూ అంబేద్కర్‌ను అవమానపరుస్తున్నారని విమర్శించారు. యాదగిరి గుట్టలో సీఎం, ఇతర మంత్రులు పెద్ద పీట మీద కూర్చుని దళితుడైన డిప్యూటీ సీఎంను చిన్న పీటపై కూర్చోబెట్టి అవమానపరిచారన్నారు. దళితులకు న్యాయం చేస్తానని హామీనిస్తున్నానన్నారు. తాము మాత్రం ఈ పదేండ్ల కాలంలో పేదలకు విద్యుత్‌, నీళ్లు, ఇండ్లు, ఉపాధి, వ్యాక్సినేషన్‌, ఇలా పేదల కోసం ఎన్నో చేశామని తెలిపారు. మీరు మెజార్టీ ఇవ్వడం వల్లనే మార్పు వచ్చిందన్నారు. తాను 140 కోట్ల ప్రజల కోసం రేయింబవళ్లు ప్రజల కోసం పనిచేస్తున్నాననీ, ఏనాడూ తన కోసం పనిచేయలేదని తెలిపారు. ఆర్టికల్‌ 370 రద్దుచేశామనీ, రామమందిరాన్ని కట్టించామని చెప్పారు. తెలంగాణలో ప్రజల కోసం కోటి ఖాతాలను తెరిచాం, చారుకి పెట్టే ఖర్చుతో కోటిన్నర మందికి బీమా కల్పించాం. 67 లక్షల మంది చిరువ్యాపారులకు ముద్రా లోన్లు ఇచ్చాం. 80 లక్షల మంది ఆయుష్మాన్‌ భారత్‌ కింద లబ్ది పొందేలా చేశాం అని వివరించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లో అవినీతిలో భాగస్వామ్యులని అని విమర్శించారు. అవినీతి, కుటుంబ పార్టీలకు ఇంటికి సాగనంపేందుకు తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కావాలన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓట్‌ షేరింగ్‌ను డబుల్‌ చేశారనీ, ఇక్కడి ప్రజల ఆశీస్సులు చూస్తుంటే కచ్చితంగా ఎంపీ సీట్లు డబుల్‌ డిజిట్‌ దాటుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Spread the love