మాట

మాట భావ వ్యక్తీకరణకు మార్గం. మాటే మనిషి సంస్కారాన్ని తెలియజేస్తుంది. అందుకే ‘వాక్కు వ్యక్తిత్వానికి వాచక రూపం’ అంటారు పెద్దలు. కొంతమంది ఆలోచించి మాట్లాడితే, కొంతమంది మాట్లాడిన తరవాత ఆలోచిస్తారు. దాన్ని సరి చేసుకునేందుకు నానా పాట్లు పడతారు. కాలు జారితే తీసుకోవచ్చు. నోరు జారితే తీసుకోలేం. పెదవి దాటితే పృథ్వి దాటుతుందని నానుడి. అది అక్కడితో ఆగక చిలవలు పలవలై వ్యాప్తి చెందుతుంది. అందుకే ఎవరితో, ఎవరి గురించి, ఏది, ఎందుకు, ఎలా, ఏ పరిస్థితుల్లో మాట్లాడుతున్నావు, అసలు మాట్లాడవలసిన అవసరం ఉందా అని ఆలోచించుకుని మాట్లాడాలంటాడు సోక్రటీస్‌. మాటల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మీయత, నమ్మకం ఉట్టిపడాలి. విషయం సూటిగా స్పష్టంగా ఉండాలి. లేకపోతే అపార్థాలకు దారి తీస్తుంది. మానవ సంబంధాలు దెబ్బతింటాయి. మాటే చిక్కుల్లో పడేస్తుంది. అదే మాట చిక్కుల్లో నుంచి బయట పడేస్తుంది. చెప్పదలచుకున్న విషయాన్ని కఠినంగా కాకుండా మృదువుగా చెప్పాలి. వ్యవహారాల్లో అన్నదమ్ములైనా కచ్చితంగా నిర్మొహమాటంగా మాట్లాడాలి. మిత్రులు సమ వయస్కులతో వ్యాఖ్యలతో సరదాగా, భార్యతో చతురోక్తులతో, కవి మిత్రులతో రసస్ఫోరకంగా, పెద్దలతో వినయంగా సూటిగా పొదుపుగా, పిన్నలతో ఆదరంగా ప్రోత్సాహకరంగా, నూతన పరిచయస్తులతో మర్యాదగా మాట్లాడాలి. సొంతలాభం కోసం వుత్త మాటలు చెప్పకూడదు. ఉత్తర ప్రగల్బాలు పలక్కూడదు. ఉత్తమమైన మాట ఒక్కటి చెప్పినా ఫాయిదా వుంటుంది. చిన్న విషయమైనా, పెద్ద విషయమైనా మాట్లాడేప్పుడు కచ్చితంగా ఉండాలి. ఆచితూచి మాట్లాడాలి. ముఖ్యంగా ఒక విషయంలో మాట ఇస్తున్నామంటే ఇచ్చిన మాటని నెరవేర్చే గుణాన్ని అలవరుచుకోవాలి. కాస్త అటుఇటయినంత మాత్రాన కొంపలు మునుగుతాయా అనే నిర్లక్ష్యం తగదు. కొన్ని విషయాల్లో చెప్పుకోదగిన నష్టాలు ఉండకపోవచ్చు. కానీ మాట మీద నిలబడే వారు కాదని ఎదుటివారు అంచనా వేసే వీలుంటుంది. మాటకు విలువ లేని చోట, మనోభావాన్ని అర్థం చేసుకోలేని వ్యక్తుల దగ్గర మౌనమే ఉత్తమం. మాట్లాడే విషయం మీద అవగాహన లేనప్పుడు మౌనమే శ్రేయోమార్గం. నోటి దురుసుతనం, ఆధార రహిత అనాలోచిత నిందారోపణలు, అసూయాగ్రస్త అపవాదులు, వివేచన లేని వాగ్వివాదాలు సమాజంలో సామరస్యాన్ని దెబ్బతీస్తాయి. సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, సాహిత్య రంగాలలో మాటలకు ఎంతో విలువ వుంది. ప్రభావితశక్తితో కూడిన మాటలు పెనుప్రకంపనలు సృష్టిస్తాయి. చిన్న మాట గొప్ప మార్పుకు దారితీయవచ్చు. కొన్నిసార్లు చిన్న మాటనే అశాంతినీ, కల్లోల్లాన్నీ ప్రేరేపించవచ్చు. అందుకని ఏమరుపాటున ఉండకూడదు. మరీ ముఖ్యంగా కొన్ని వందల, వేలమంది తమని గమనిస్తున్నారని తెలిసినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. మర్యాదల్ని అతిక్రమించకూడదు. మాటలు తూలకూడదు. మనం చెప్పాలనుకున్నది ఎదుటివారిని నొప్పించకుండానే సూటిగా, పదునుగా, కచ్చితంగా చెప్పడం మంచిది. మన మాటల్లో ఆవేశకావేశాల కన్నా నిజాయితీ, నిండైన విశ్వాసం కనిపించాలి. అప్పుడే మన మాటలకు సానుకూల స్పందన వస్తుంది. అంతే కానీ, మనకు నచ్చని మాటలు మాట్లాడితే వారిని మాటలతోనే మానసికంగా హింసించడం నేటి రాజకీయ అవసరంగా మారిపోయింది. మాట్లాడుతూ పోతుంటే మనకు తెలిసిందే పునరావతం అవుతుంది. వింటుంటే ఎన్నో కొత్త విషయాలు, ఇతరుల అభిప్రాయాలు తెలుస్తాయి. ఏ విషయాన్నీ పూర్తిగా వినకుండా నిర్ణయానికి రాకూడదు. అనుమానాలు ఉంటే సౌమ్యంగా నివృత్తి చేసుకోవాలి.

Spread the love