నిద్ర విష‌యంలో నిద్ర లేవండి

Wake up in the matter of sleepకాలమనేదే డబ్బుగా, పనియే ముఖ్యంగా మారిన ప్రపంచంలో ప్రతీక్షణం అందిపుచ్చుకోవాలనీ పనిచేయకపోవడం మహాపాపమనీ భావింపబడుతున్న తరుణంలో ఏ పనినీ చేయనీయని, ఏ ఉత్పాదకతా కలుగనీయని మూడొంతుల జీవితంలో ఒకవంతుపైగా ఆక్రమించే ఒక పనికిరాని చర్యగా నిద్రను పరిగణించే దశలో మనం నిద్రగురించి మాట్లాడుకుంటున్నాం. అసాధారణంగా వేగవంతమైన జీవితంలో పెద్ద పెద్ద జీవితలక్ష్యాలు అందుకోవాలని మనిషి పరుగులిడే ఈ కాలంలో నిద్ర అంత ముఖ్యమైన విషయంగా కనబడకపోవడం సర్వసాధారణం ఐపోయిందన్నది వాస్తవం. పగలు రాత్రి అని ఒక రోజును రెండు భాగాలుగా అనుభవించిన జీవజాతులతో పాటు పరిణామం చెందుతూ వచ్చిన మానవుడు అకస్మాత్తుగా రాత్రి ఆనేదే లేని థామస్‌ అల్వా ఎడిసన్‌ అనంతర (post Edison era) యుగంలోకి అడుగుపెట్టి నిద్ర యొక్క అవసరం ఏంటని ఈరోజు ప్రశ్నించుకుంటున్నాడు. అభివద్ధి అనబడే పరుగుపందెంలో దూసుకుపోతున్న సమాజాలకు నిద్ర ఒక పనికిరాని అనవసరమైన అడ్డుగోడగా, జీవితోన్నత శిఖరారోహణకు ప్రధానమైన శత్రువుగా కనిపించడం మొదలైంది. కాసేపు కళ్ళు మూసుకుని పడుకోవడం సోమరితనంగా పరిగణించబడుతోంది.
మానవుడిని అలసట అనేది ఎరుగని యంత్రంగా, అతడి ఆత్మస్థైర్యంతో, కాఫీవంటి నిర్నిద్ర పానీయాలతో నిద్రని శాశ్వతంగా దూరంపెట్టగలడనే కొత్త భావాలు ఉబికివస్తున్నాయి. ఈ వింత పోకడలను వాటినుండి మానవ సమాజం ఎదుర్కోబోయే పెను ప్రమాదాలను గమనించిన సైంటిఫిక్‌ సమాజం ‘నిద్రవిషయంలో నిద్రలేవండి’ అనే అలారం మోగించాల్సిన సమయం వచ్చింది. ప్రపంచంలో ఈరోజు నిద్రలేమి అన్నది కేవలం జబ్బు మాత్రమే కాదు. ఒక నూతన సామాజిక అలవాటు. ఈ రెంటినీ వేరు చేసి చూడటం అవసరం. అభివృద్ధి చెందిన దేశాలలో ముప్పైశాతం మంది నిద్రలేమితో బాధపడుతున్నారని WHO లెక్కలు చెబుతున్నా, మొత్తానికి చూసుకుంటే ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నిద్రలేమితో బాధపడేవాడు తనకు నిద్రకావాలని కోరుకుంటాడు. కానీ నిద్ర అనవసరం అనుకునే ధోరణి పెరిగిన సందర్భంలో మొత్తానికి నిద్రలేనివారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుంది. ఒకవైపు మారుతున్న సామాజిక పరిస్థితుల కారణంగా పెరుగుతున్న శారీరక మానసిక సమస్య వలన నిద్రలేమి insomnia కలుగుతుండగా మరోవైపు గ్లోబలైజేషన్‌ లో భాగంగా తమ పనులు పూర్తి చేసుకోవడం కోసం రాత్రంతా డ్యూటీలు చేస్తూ నిద్రను బలవంతంగా అణుచుకుంటూ సొంతగా నిద్రలేమిని కోరుకుని తెచ్చుకుంటున్న తరమే ఏర్పడింది. ఐతే కారణం ఏదైనా నిద్రలేమి అనేక దీర్ఘకాలిక జబ్బులకు కారణమౌతోందని నూతన పరిశోధనలు చెబుతున్నాయి.
జీవులసలు ఎందుకు నిద్రపోవాలి. భూమి మీద జీవం మొదలైనప్పటినుండి పగలు రాత్రి ఉన్నట్లే నిద్ర మెలకువలు ఉన్నాయి. క్షీరదాల్లో సరీసృపాల్లో పక్షులలో ఉభయచరాల్లో నిద్ర స్పష్టంగా కనిపిస్తుంది. చేపల్లో కనురెప్పలు లేకున్నా అవి నిద్రలాంటి విశ్రాంతిని తీసుకుంటాయని తెలుస్తోంది. డాల్ఫిన్లు మెదడులోని ఒక భాగాన్ని నిద్రపుచ్చి మరో భాగంతో అలెర్ట్‌గా ఉండగలిగిన వింతైన జీవులు. పురాతన కాలం నుండి మనిషి నిద్రపై వివిధ వర్ణనలు ఆలోచనలు పరిశీలనలూ చేస్తూనే ఉన్నాడు. గ్రీకులు hypnos దేవతను కొలిచారు. ఈజిప్షియన్లు నిద్రలో మనిషి పరలోకానకి వెళ్తాడని భావించి నిద్రలో మరణానికి జారుకోకుండా ప్రార్థనలు చేసేవారు. మెసపటోమియన్లు నిద్రను ఇహ పరలోకాలకు వారధిగా తలిచి దేవుళ్ళు కలల ద్వారా మాట్లాడతారని నమ్మారు. నిద్ర మెలకువలను యిన్‌ -యాంగ్‌ లుగా భావించి ఇవి రెండూ తటస్థంగా ఉండాలని చైనీయులు అనుకున్నారు. భారతదేశంలో పూర్తి స్పృ‌హతో నిద్రపోవడాన్ని యోగనిద్రగా అభివర్ణించారు. ఆయుర్వేదంలో ఆహార విహారాదులతోపాటు నిద్రకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. ఐతే ఇరవైయవ శతాబ్దంలో నిదురను మొదటిసారి శాస్త్రీయంగా అవగాహన చేసుకునే ప్రయత్నాలు జరిగాయి. నిద్ర-మెలకువ చక్రం (sleep awake cycle) యొక్క పనితీరు అర్థమవడం మొదలైంది. తర్వాత టెక్నాలజీ పెరిగేకొద్దీ మెదడు ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్‌, పాలీసోమ్నోగ్రఫీ వంటివి అందుబాటులోకి రావడంతో నిదురను మరింత శాస్త్రీయంగా లోతుగా అధ్యయనం చేయడం సాధ్యపడింది. నిదుర గురించి అర్థమయ్యే కొద్దీ మానవజీవితంలో నిద్ర మనమనుకున్న దానికంటే ఎక్కువ ప్రాధాన్యత కలదని అర్థమవడం మొదలైంది. నిద్రలేమి మధుమేహం, రక్తపోటు, గుండెపోటు, పక్షవాతం, కాన్సర్‌ వంటి భయంకరమైన దీర్ఘకాలిక రోగాలకు కారణమని అర్థమైంది. నిద్రలేమి కొన్ని మానసిక జబ్బులకు లక్షణంగా మాత్రమే కాకుండా, కారణం కూడా పరిణమించింది. జన్యువులలోనుండి నిదురకు సమాధానాలు దొరుకుతాయా అనే పరిశోధనా మొదలైంది. డిఎన్‌ఏను కనుక్కున్న వారిలో ఒకరైన క్రిక్‌ నిదురలోని రహస్యాలను డిఎన్‌ఏలో కనుక్కోవాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. అరుదైన జన్యు వ్యాధిగా progressive insomnia అనే జబ్బు ఒకటుందని అర్థమైంది. ఈ జబ్బు మధ్యవయసు వారిలో కనబడుతుంది. ఈ జబ్బు ఉన్న పేషంట్లకు నిద్ర రావడం పూర్తిగా ఆగిపోతుంది. పూర్తినిద్రలేమితో వీళ్ళు శల్యమై ఒకటి రెండు సంవత్సరాలలో మరణిస్తారు. అంటే నిద్రలేమి మరణానికి కూడా కారణమౌతుంది. అందుకే ఇంత ప్రాముఖ్యత కలిగిన నిద్రను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం అయింది. 1950 లో REM stage sleep అనేది ఒకటుంటుందని తెలుసుకున్నాక నిదురను మరింత అర్థం చేసుకోవడం మొదలైంది.
మానవ వైజ్ఞానిక వికాసంలో నిదురది కూడా కీలకమైన పాత్ర. నిద్ర అనేదే లేకపోతే మనిషి మెదడు ఇంతగా వికసించేది కాదు. అసీమిత తారా గగనాలను, సముద్రలోతులనూ, సృష్టి రహస్యాలనూ అసలు ఛేదించేదే కాదు. కోట్ల సంవత్సరాలుగా పరిణామంలో నిదురను నిలుపుకుంటూ వచ్చాడే తప్ప నిదుర అనే ప్రక్రియ అంతరించిపోలేదంటే నిదుర మనకు తెలియని ఏదో అత్యంత అవసరమైన పని చేస్తోందని అర్థం. నిదురలో మనిషి మెదడు అభివృద్ధి చెందుతుంది. మన నిదురలో NREM దశ (75-80 min) REM (10-15min) దశలని రెండు దశలుగా ఉంటాయి. ఈ రెండు కలిస్తేనే తొంభై నిమిషాల నిడివి గల ఒక సైకిల్‌ పూర్తవుతుంది. వీటికనుగుణంగా మెదడు తరంగాలను కొలవవచ్చు. మనం మెలకువతో ఉన్నపుడు బీటా తరంగాలు ఉంటాయి. నిదురకు ఉపక్రమించి కాసేపు రిలాక్స్‌ కాగానే ఆల్ఫా తరంగాలు మొదలవుతాయి. అపుడు మగతనిద్ర అనబడే stage 1 నిద్ర మొదలౌతుంది. ఈ దశలో తీటా తరంగాలుంటాయి. ఇది ఒక ఐదు నిమిషాలుంటుంది. ఆ తర్వాత stage 2లో sleep spindles లేదా k complexes అనబడే తరంగాలుంటాయి. ఇది చాలా ముఖ్యమైన దశ. ఇది పది నిమిషాలుంటుంది. ఆ తర్వాత ఐదునిమిషాల కంటే తక్కువగా stage 3 దశలో డెల్టా తరంగాలుంటాయి. అప్పుడు stage 4 తీటా తరంగాలతో గాఢనిద్రలోకి మనిషి జారుకుంటాడు. ఇది దాదాపు 45 నిమిషాలుంటుంది. ఆ తర్వాత మళ్ళీ రివర్స్‌లో 10 నిముషాలు స్టేజి 3 దశకు చేరుకుంటాడు. అపుడు ఆల్ఫా, బీటా, తీటా తరంగాలతో కలగలిసిన REM stage ఉంటుంది. Rapid eye movement దశ. ఈ దశలో మనం గమనిస్తే మనిషి తన కను గుడ్లను కదుపుతూ ఉంటాడు. ఈ దశలోనే మనిషి కలలను కంటాడు. ఇలా ఒక NREM, REM దశలు కలిస్తే ఒక సైకిల్‌. ఒక రాత్రిలో 5 నుండి 6 సైకిల్స్‌ జరుగుతుంటాయి.
ఐతే మనిషి శరీరంలో NREM దశ ఒకపని చేస్తే REM మరో పని చేస్తుంది. NREM దశలో శరీరం తన శక్తిని భద్రపరుచుకుంటుంది. మెదడులోని వివిధ న్యూరానుల మధ్య చలనాలు ఆగి ప్రశాంతత లభిస్తుంది. అంటే కండరాలు మెదడు అన్నీ విశ్రాంతిని పొందుతాయి. REM దశలో మెదడు కొంత యాక్టివ్‌గా ఉంటుంది కానీ శరీర కండరాలు ఇంతకుముందు దశలాగే నిస్సత్తువగా ఉంటాయి. ఐతే వృద్ధాప్యంలో లేదా పార్కిన్సన్‌ వంటి జబ్బులలో REM దశలో మెదడుతో పాటు కండరాలు కూడా యాక్టివ్‌ గా ఉండటంతో వీరు నిదురలోనే నడవడంవంటివి చేస్తుంటారు. అంటే వీరు తమ కలను తమకు తెలియకుండానే యాక్ట్‌ చేస్తారు. REM దశలో వచ్చే కలలు అణచివేసి ఉంచిన కోరికలను తీర్చేవిగా ఉంటాయని సైకో అనలిస్టులు చెబితే, ఈ దశ కంటి కండరాల ఆక్సిజెనేషన్‌ కి పనికి వస్తుందని అనటమిస్టులు చెబుతారు. పిల్లల నిద్రలో REM దశ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే, పిల్లల మెదడు వికసించేది ఈ దశలోనే. పిల్లల మొత్తం నిద్రలో ఎనభైశాతం REM దశనే ఆక్రమిస్తుందంటే వారి మెదడు ఎదుగుదలలో దీని ప్రాముఖ్యత అర్థం చేసుకోవచ్చు. ఐతే పెద్దలలో ఇది చాలా తక్కువ సమయం ఆక్రమిస్తుంది. పెద్దలలో ఈ దశ మెదడు రిపేర్‌ కి పనికివస్తుంది. ఐతే ముఖ్యంగా మనం గమనించవలసిన అంశం ఒకటుందిక్కడ. రాత్రి పడుకుని పొద్దున అయ్యేకొద్దీ ఒక నిదుర సైకిల్‌ లో REM దశ సమయం పెరుగుతూ పోతుంది. అందుకే మనకు ఉదయం పూట వచ్చే కలలు గుర్తుండిపోతాయి. ఉదయం పూట త్వరగా లేచే అలవాటు లేని వ్యక్తిని ఉదయమే లేపామనుకోండి అతడు చాలా మటుకు REM నిద్రను కోల్పోతాడు. అదే పిల్లలైతే వారి మెదడును శక్తివంతం చేసే ఈ REM దశను మరింతగా కోల్పోతాడు.
మనుషులలో నిద్రవిషయంలో రెండు రకాల వ్యక్తులుంటారు. మామూలు ఇంగ్లీషు భాషలో Early larks and late owls అని, Early bird, late bird అని కూడా అంటారు. రాత్రి ఎనిమిది తొమ్మిదికల్లా నిద్రపోయేవారిని early lark అనీ, రాత్రంతా మేలుకుని ఏ మూడు నాలుగు గంటలకో నిదురపోయే వాళ్ళను late owl అనీ అంటారు. ఐతే ఇవి వ్యక్తుల అలవాట్లకు సంబంధించినవి మాత్రమే కాక ఇవి జెనెటికల్లీ కూడా నిర్మితమై ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఒక వ్యక్తి లేటుగా పడుకోవడానికి అతడి అలవాట్లు కారణమా లేక అది జెనిటికల్‌ గా నిర్మితమైన అంశమా అని చెప్పడం కష్టం. కానీ సాధారణంగా యుక్తవయసులో late owl గా ఉన్నవారు కూడా వయసు పెరిగేకొద్దీ early lark గా మారడం కూడా గమనించవచ్చు. ఐతే సమాజం లేటుగా పడుకోవడాన్ని తప్పుగా చూస్తుంది. సమాజం మొత్తం తొందరగా నిద్రలేచి పనుల్లోకి పోయేవిధంగానే నిర్మించబడ్డది. ఒక స్టడీ ప్రకారం జనాభాలో 40 శాతం early larks 30శాతం late owls మిగిలిన 30% ఈ రెంటికీ మధ్యలో ఉంటారు. ఐతే దీర్ఘకాలిక జబ్బులు late owlsలో కలగటానికి కారణం వారికి సరైన నిద్రను సమాజం కలిగించకపోవడమే. ఏ మూడు నాలుగ్గంటలకు పడుకున్న late owl ఐనా మళ్ళీ ఉదయమే లేచి స్కూలుకో, కాలేజీకో, ఆఫీసుకో పోవలసిందే. ఉదయమే లేవకపోతే అతడిని బద్ధకస్తుడిగా మనం గుర్తిస్తుంటాం. పైగా తొందరగా పడుకోవచ్చు కదా అని వొత్తిడి చేస్తుంటాం. అతడికి జెనెటికల్‌ మేకప్‌ ప్రకారం నిద్రరాదు అని అంటే డాక్టర్‌ దగ్గరనుండి నిద్ర ట్యాబ్లెట్లు అలవాటు చేస్తాం. పసిపిల్లలలో రోజుకి 16 గంటల నిద్ర అవసరం. స్కూలు వయసు పిల్లలకు పదిగంటల నిద్ర అవసరం. పెద్దవారికి ఎనిమిది గంటలు ముసలివారికి ఏడు గంటల నిద్ర అవసరం. ఐతే ఒక స్కూలు పిల్లగాడు late owl అనుకుందాం. ఏ రాత్రి పన్నెండు గంటలకో ఒంటిగంటకో పడుకుంటే ఉదయం ఆరుగంటలకు లేచి అతడు స్కూలుకి రెడీ కావలసి ఉంటుంది. అంటే అతడు తనకు అవసరమైన నిద్రను కోల్పోతున్నాడు. అంతమాత్రమే కాదు ఇందాకా చెప్పినట్టు ఉదయం పూట REM SLEEP STAGE ఎక్కువ గా ఉంటుంది. అది మెదడు పనితీరును అభివృద్ధి పరుస్తుంది అనుకుంటే ఉదయం పూట లేచిన late owl విద్యార్థి తనకు చాలా ముఖ్యమైన REM STage నిద్రను కోల్పోతాడు. దీనితో అతడిలో నిస్సత్తువ పెరిగి, చదువులో వెనుకబడతాడు. మన సమాజంలో నిదురకు సంబంధించిన అవగాహన పెరగలేదు కాబట్టి మన జీవితాన్ని బ్రహ్మ ముహూర్తంలోనే లేవడం వంటి ఆదర్శ భావనలతో మరింత కఠినతరంగా చేసుకుని నిదురను విస్మరిస్తుంటాం. శాస్త్రీయ దక్పథం పెరిగేకొద్దీ అందుకు తగ్గ మార్పులను మనం చేసుకోవలసి ఉంటుంది.
దీర్ఘకాలిక జబ్బులకే కాకుండా రోడ్‌ యాక్సిడెంట్లకూ నిద్రలేమి ప్రధాన కారణం. ఆల్కాహాల్‌ కంటే నిద్రలేమివలన జరిగే యాక్సిడెంట్లే ఎక్కువగా ఉంటాయంటే అతిశయోక్తి కాదు. చెర్నోబైల్‌ వంటి సంఘటనలు జరగడానికి కూడా అక్కడ పనిచేసేవారి నిద్రలేమి కూడా కారణమనే వాదన ఒకటుంది. ఫ్లైట్‌ యాక్సిడెంట్లకూ పైలెట్ల నిద్రలేమినే కారణమమనీ, వారు సుదూర ప్రాంతాలకు తిరుగుతూ ఉండటంతో బయలాజికల్‌ గడియారం పనిచేయక వారి పనితీరులో లాజికల్‌ థింకింగ్‌ తగ్గి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందనీ పరిశోధనలు చెబుతున్నాయి. పైలట్లనే కాదు సాధారణ మనుషులు సైతం నిద్రలేమి వలన సరైన నిర్ణయాలు తీసుకొలేరు. పరీక్షలలో సరిగ్గా నెగ్గలేరు. ముఖ్యంగా విద్యార్థులకూ, కఠినమైన పనులు చేసేవారికీ, ట్రక్కు డ్రైవర్లు, పైలెట్లు వంటివారికి నిదురకు సంబంధించిన కచ్చితమైన షెడ్యుల్‌ ఉండవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ర్యాంకుల వెంట పరిగెట్టే యువత నిదురను అలక్ష్యం చేస్తూ చదవడం వలన మెదడు పనితీరును బండబారుస్తున్నారనే విషయం తెలుసుకోవాలి. సరైన నిదురలేకుండా చదివే extra time చదువు వలన లాభం లేకపోగా నష్టమే ఎక్కువ అని గుర్తెరగాలి. నిదుర రాకూడదని కాఫీ, టీల మీద అధారపడుతూ చదివే చదువు శ్రేయస్కరం ఏవిధంగాను కాదు.
ఐతే నిద్రలేమితో పాటు ఈ మధ్య పెరుగుతున్న మరో సమస్య OSA (OBSTRUCTIVE SLEEP APNEA). డ్రైవర్లలో డెభ్భైశాతం మందికి ఈ సమస్య ఉందని, దానిలో పది శాతం మందికి తీవ్రంగా ఉందని ఒక సర్వే చెబుతోంది. గొంతు కండరాలలోపల కొవ్వు పెరగడంవలన నిదురలో వీరి నాలుక నోటి కుహరంలో వెనుకకి పడిపోవడం గురకవస్తుంది. దాని వలన గాలి నోటిలోనే ఆగిపోయి సరైన ఆక్సిజన్‌ శరీరానికి అందదు. అప్పుడు శరీరంలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ శాతం పెరిగి దాని ప్రభావంతో మెదడు సడెన్‌గా యాక్టివ్‌ కావడంతో ఆ వ్యక్తి నిదురనుండి లేస్తాడు. దీనిని apnea cycle అంటారు. ఐతే ఈ లేవడం తనకు గుర్తు ఉండదు. ఇలా గంటలో 40 నుండి 100 apnea cycle జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి టాన్సిల్స్‌, లింఫ్‌ గ్రంధుల వాపు, చిన్న గాలి గొట్టాల వలన కూడా ఇలా జరగవచ్చు. ఐతే దీనిని పూర్తిగా అలక్ష్యం చేస్తారు. OSA బీపికి, గుండెజబ్బులకు, సడెన్‌ కార్డియాక్‌ డెత్‌ లకూ కారణం ఔతుంది. దీనిని సకాలంలో గుర్తించి CPAP వంటి మిషిన్ల సహాయంతో చికిత్స తీసుకోవాలి. లేకపోతే ఉదయం పూట ఎపుడంటే అపుడు పనులు చేస్తూ కూడా నిద్రపోవడం దీని ప్రధాన లక్షణం. డెభ్భైశాతం డ్రైవర్లలో ఈ లక్షణం గుర్తించారంటే మనం దీనిని ఎంతగా అలక్ష్యం చేస్తున్నామో రోడ్‌ ట్రాఫిక్‌ యాక్సిడెంట్లకు ఏది ప్రధానమైన కారణమో అర్థం చేసుకోవచ్చు. ఐతే. ఈ సమస్యలేవీ గుర్తించకుండా నిదుర రాకుండా ఉండేందుకు అలర్ట్‌ గా ఉండేందుకు కాఫీ, టీ వంటి పదార్థాలని తీసుకుంటూ ఉంటారు. సుదూర ప్రాంతాలకు నడిపే డ్రైవర్లు నిదుర వచ్చినపుడల్లా వాహనం పక్కకు తీసుకుని కాఫీ తాగుతూ ఉంటారు. కాఫీ ఎఫెక్ట్‌ పోగానే బలవంతంగా ఆపుకున్న నిద్ర ఆపుకోలేని దశకు చేరి వాహనం నడుపుతుండగానే నిద్రపోతుంటారు. పరిణామం మనకు తెలిసినదే.
మనిషి ఎక్కువ సమయం పని చేసే కొద్దీ మెదడులో ఇంక చాలు అని చెప్పేందుకు అడినోసిన్‌ అనే పదార్థం నిండుతూ ఉంటుంది. అంటే సాయంత్రం దాటి రాత్రి సమీపించే కొద్దీ మెదడులో ఎడినోసిన్‌ ఎక్కువగా చేరుతుంది. కానీ సాయంత్రం తాగే కాఫీ, టీలలోని కెఫిన్‌ పదార్థం అడినోసిన్‌ రిసెప్టర్‌ లను నింపేసి నిదురను తాత్కాలికంగా నిలుపుదల చేస్తుంది. కానీ కెఫిన్‌ half life ఏడు గంటలు. సాయంత్రం ఒక కప్పు కాఫీ తాగితే దాని ప్రభావం పూర్తిగా తొలగిపోవడానికి అర్ధరాత్రి దాటి ఉదయానికి కూడా సమీపించవచ్చు. వృద్ధులలో కెఫిన్‌ పూర్తిగా తొలగడానికి మరింత సమయం పడుతుంది. ఐతే విపరీతంగా కెఫిన్‌ పదార్థాలకు (కొన్ని చల్లని పదార్థాలలో కూడా) ప్రజలు అలవాటు పడ్డారు. దీనితో సరైన నిద్ర లేక రాత్రులలో ఇబ్బంది పడుతూ పొద్దున లేవలేక, లేచినా సరిగా ఏకాగ్రత నిలపలేక సతమతమౌతూ ఉంటారు. ఇవే మెల్లిగా దీర్ఘకాలిక జబ్బులకు దారి తీస్తాయి. ఉదయం పూట మీరు బలవంతంగా నిద్ర ఆపుకోవలసి వస్తున్నదా? నిదురపోకుండా ఉండేందుకు యాక్టివ్‌ గా ఉంటుందని కాఫీ తాగుతున్నారా లేదా సాయంత్రం వరకు మరోసారి లేదా పదే పదే కాఫీ లేదా టీ తాగకపోతే మీకు మగతగా నిస్సత్తువగా అనిపిస్తుందా..? ఐతే మీరు తప్పక అర్థం చేసుకోవలసిన అంశం మీకు సరైన నిద్ర లేదని. చాలా ఆఫీసులలో పని క్షేత్రాలలో యేళ్ళ తరబడి ఇదే రొటీన్‌ ని అలవాటు చేసుకున్నవారు, తాము తక్కువగా నిదుర పోతున్నామని గుర్తించరు. Sleep debt (నిద్ర బాకీ) అని ఒక భావన ఉంది. ఒక వ్యక్తి తనకు కావలసిన నిద్ర పోకపోతే ఆ మిస్సైన నిద్ర మెదడులో Sleep debt గా స్టోరై ఉంటుంది. అవసరం వచ్చినపుడు ఆ వ్యక్తి ఆ మిగిలిన నిద్రను తీర్చుకుంటూ ఉంటాడు. సాధారణంగా మనిషిలో ఎనిమిది నుండి పదిగంటల Sleep debt ఉంటుంది. ఐతే ఎపుడైతే ఇది యాభై గంటలను దాటుతుందో అది తీవ్రదశకు చేరుకున్నట్టు. వీళ్ళకు రక్తపోటు, గుండెపోటు, సడెన్‌ డెత్‌, పక్షవాతం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఆదివారాలో లేక పండగ సెలవు దినాలకో వీలైనంత నిద్రపోవడం వలన చాలామటుకు Sleep debt తగ్గించుకోవచ్చు. కానీ అందుకు భిన్నంగా కాఫీ, టీలతో మన శరీరాలను ఆరోజే ఎక్కువగా నింపుతుంటాం.
కాఫీ ఫుడ్‌ సప్లిమెంట్‌ కాదు. ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా వాడబడుతున్న సైకో యాక్టివ్‌ సబ్స్టెన్స్‌ కాఫీ. పెట్రోలియం తర్వాత అతి ఎక్కువగా వాణిజ్యమౌతున్న పదార్థం కాఫీ. మనం కృత్రిమ సైకో యాక్టివ్‌ సమాజాన్ని సృష్టించుకున్నాం. అందుకే నిద్రలేమి ఒక పాండెమిక్‌ గా మారింది. ఐతే నిద్రలేమికి విరుగుడుగా నిద్రమాత్రలను వాడటం సరైన పద్ధతి కాదు. చాలామంది డాక్టర్లు కూడా నిద్ర శుభ్రతను (sleep hygiene) పేషంట్లకు వివరించడంలో సఫలీకృతం కాలేకపోతున్నారు. పేషంట్‌ సాటిస్ఫాక్షన్‌ కోసమని నిదుర మాత్రలు రాయడం తప్పని పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాం. పేషంట్లతో పాటు డాక్టర్లు కూడా నిద్ర శుభ్రతను అర్థం చేసుకుని పేషంట్‌కి తగ్గట్టు కష్టమైజ్‌ చేయగలగాలి. Late owls ని గుర్తించి వారు మరీ త్వరగా నిదుర లేవడం వలన వారిని బద్ధకస్తులని వారిపై బలవంతంగా ఆదర్శాలను రుద్దడంవలన లాభం ఉండదనీ గుర్తించాలి. విద్యార్థులలో నిదుర ప్రాముఖ్యత గురించి కార్పోరేట్‌ స్కూళ్ళల్లో, కాలేజీల్లో సెమినార్లు నిర్వహించి అవగాహన పెంచాలి. నిద్రకు సంబంధించి నిర్థారణ కాని జబ్బులు వందకు పైగా ఉన్నాయి. సరైన సమయంలో వ్యాధి నిర్ధారణ జరగాలంటే ముందు నిద్రపైన అవగాహన పెరగాలి. నిద్ర సులువుగా కొట్టివేయవలసిన అంశం కాదనీ, నిర్లక్ష్యం వహించవలసిన అంశం అసలే కాదనీ గుర్తెరగాలి. నిద్రకు ఆల్టర్నేటివ్‌ ఏదీ లేదు. అన్నానికి బదులు ఆకులు, అలములు, పళ్ళు తిని బతకవచ్చు. కానీ నిద్రకు బదులుగా మరేది లేదు. నిద్రపోవాల్సిందే. World sleep Society అందుకే నిదురపై అవగాహనను పెంచడంకోసం ప్రతిసంవత్సరం మార్చి 15 ను sleep day గా గుర్తించి అవగాహన కోసం ప్రయత్నిస్తోంది. 2024 సంవత్సరానికి గాను అందరికీ సమానమైన నిద్ర అవసరాన్ని గుర్తు తెస్తుంది. కొందరు ‘మాకు చాలా తక్కువ సమయం నిద్ర సరిపోతుంది’ అని గొప్పలు పోవడం చూస్తుంటాం. అది ఏమాత్రం గొప్ప కాదనీ, అది తెలియని ఒక నిద్రసంబంధ జబ్బని గుర్తించి సరైన చికిత్స తీసుకోవాలి. అందుకే ఈ oxymoron ‘మేలుకోండి.. సరైన నిద్ర అవసరమని గుర్తించండి’.
– విరించి విరివింటి, 9948616191

Spread the love