ఆ నమ్మకమే నడిపించింది

ఆ నమ్మకమే నడిపించిందిహీరో పథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటించిన ‘ది గోట్‌ లైఫ్‌’ (ఆడు జీవితం) సినిమా ఈ నెల 28న పాన్‌ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను బెన్యామిన్‌ రాసిన గోట్‌ డేస్‌ నవల ఆధారంగా అవార్డ్‌ విన్నింగ్‌ డైరెక్టర్‌ బ్లెస్సీ రూపొందించారు. విజువల్‌ రొమాన్స్‌ బ్యానర్‌ ఈ సినిమాను నిర్మించింది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ఈ సినిమాను తెలుగు స్టేట్స్‌ లో రిలీజ్‌ చేస్తోంది. ఈ సినిమాతో 16 ఏళ్లు సుదీర్ఘ ప్రయాణం చేసిన హీరో పథ్వీరాజ్‌ సుకుమారన్‌ మూవీ రిలీజ్‌ సందర్భంగా మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు. వాస్తవ కథతో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు బ్లెస్సీ. 90వ దశకంలో జీవనోపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లిన నజీబ్‌ అనే వ్యక్తి జీవిత కథ ఈ సినిమాకు ఆధారం. నజీబ్‌ ఎడారిలో సాగించిన ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తూ గోట్‌ డేస్‌ అనే పుస్తకాన్ని బెన్యామిన్‌ రాశారు. కేరళలో అనూహ్య పాఠక ఆదరణ పొందిన ఈ పుస్తకం రైట్స్‌ కోసం మలయాళ సినీ పరిశ్రమలో ప్రతి స్టార్‌ హీరో, దర్శక, నిర్మాతలు పోటీ పడ్డారు. ఆ హక్కులను మా డైరెక్టర్‌ బ్లెస్సీ దక్కించు కున్నారు. అప్పుడు ఈ ప్రాజెక్ట్‌తో 2008లో బ్లెస్సీ నన్ను సంప్రదించారు. అలా ఈ సినిమాతో నా జర్నీ మొదలైంది. ఈ సినిమా కోసం 31 కిలోల బరువు తగ్గాను. నజీబ్‌ ఎడారిలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొని ఉంటాడని ఊహించుకుంటూ ఈ క్యారెక్టర్‌లో నటించాను. ఓ మంచి సినిమా చేస్తున్నామనే నమ్మకమే మమ్మల్ని 16 ఏళ్లు సినిమాతో ముందుకు సాగేలా చేసి, ఈ సినిమా రిలీజ్‌ కలని సాకారం చేసింది.

Spread the love