ముగిసిన పోరు!

– శ్రీకాంత్‌, ప్రియాన్షు ఓటమి
– సింగపూర్‌ ఓపెన్‌ 2023
సింగపూర్‌: భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు మరో టోర్నీలో నిరాశపరిచారు. సింగిల్స్‌, డబుల్స్‌ విభాగాల్లో పతక ఆశలు ఆవిరి చేశారు. పి.వి సింధు, సైనా నెహ్వాల్‌, సాత్విక్‌-చిరాగ్‌లు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించగా.. తాజాగా ప్రీ క్వార్టర్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌, ప్రియాన్షు రజావత్‌ పోరాటానికి తెరపడింది. డబుల్స్‌లో అర్జున్‌, కపిల సైతం ఓటమి చెందగా సింగపూర్‌ ఓపెన్‌లో భారత పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్‌లో యువ షట్లర్‌ ప్రియాన్షు రజావత్‌ వరుస గేముల్లో విఫలమయ్యాడు. మూడో సీడ్‌, జపాన్‌ స్టార్‌ కొడారు నరోక 21-17, 21-16తో వరుస గేముల్లోనే ప్రియాన్షుపై విజయం సాధించాడు. 47 నిమిషాల పాటు సాగిన ప్రీ క్వార్టర్స్‌లో ప్రియాన్షు పోటీ ఇచ్చే ప్రయత్నం చేసినా.. జపాన్‌ షట్లర్‌ పైచేయి సాధించాడు. పురుషుల సింగిల్స్‌ మాజీ వరల్డ్‌ నం.1 కిదాంబి శ్రీకాంత్‌ నిరాశపరిచాడు. చైనీస్‌ తైపీ షట్లర్‌ చియ హవో లీకి వరుస గేముల్లోనే క్వార్టర్స్‌ బెర్త్‌ కోల్పోయాడు. 15-21, 19-21తో శ్రీకాంత్‌ పోరాడినా ఫలితం దక్కలేదు. తొలి గేమ్‌లో శ్రీకాంత్‌ను చిత్తు చేసిన చైనీస్‌ తైపీ ఆటగాడు.. రెండో గేమ్‌లో కాస్త ప్రతిఘటన ఎదుర్కొన్నాడు. చివర్లో 19-19తో స్కోరు సమం చేసిన శ్రీకాంత్‌ ఉత్కంఠ రేపాడు. కానీ వరుస పాయింట్లతో లీ ముందంజ వేశాడు. భారత స్టార్‌ షట్లర్‌పై లీ 37 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించాడు. పురుషుల డబుల్స్‌లో ఎంఆర్‌ ఆర్జున్‌, ధ్రువ్‌ కపిల జోడీ ఇంటిబాట పట్టింది. 15-21, 19-21తో ఇంగ్లాండ్‌ జోడీ బెన్‌ లేన్‌, సీన్‌ వెండీలతో చేతిలో ఓటమి చెందారు. 41 నిమిషాల్లోనే భారత జోడీపై గెలుపొందిన లేన్‌, సీన్‌ క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించారు.

Spread the love