అన్నదాత

నాగళ్లను గొర్రు కొయ్యలను
దువ్వెన్లుగా చేసి
నేలతల్లి కురులు నేర్పుగా దువ్వుతాడు
ఆకుపచ్చని అంకురాల రిబ్బన్లతో
అందంగా జుట్టేస్తాడు
ఆతడో గొప్ప ఆలంకారికుడే
పరిచయం చేయాలనుకుంటే….

ఆ పసి హదయానికి
లాలపోసే పనిని
మేఘాలకు అప్పగించి
జోల పాడే గొంతవ్వమని
పక్షులను ఆదేశించి
అక్కడక్కడే తిరుగుతూ
అన్నీ పర్యవేక్షిస్తుంటాడు
తానో గొప్ప సంగీత విద్వాంసుడే
గుంభనంగా గుర్తు చేయాలనుకుంటే….

మట్టి తల్లి
పంటపొలాలను తివాచీలుగా పరిచి
అతన్ని ఆహ్వానిస్తే
గాలి తనంతట తానుగావచ్చి
సంగీత కచేరి నిర్వహించి
మనోల్లాసం కలిగిస్తుంది
ఆతడే మా అతిథేయుడని
చాటుకోడానికి

అప్పుడే నిద్ర లేచి
దొండపండోలె నిగనిగలాడుతూ
ఉదయగిరి మీద నిలబడి
నిట్టూర్పు విడుస్తూనే
పంటపొలాలపై వాలి
బంగారు పూతపూసే పనిలో పడ్డాడు
లోకమంతా
తన రాకకోసం ఎదురుచూస్తే…
అతని కోసం ఎదురుచూసే
లోకబాంధవుడు
ఇంతకంటే గొప్ప ఏముంటుందని?
చెప్పుకోడానికి

తాను పెంచుకున్న తరువు నీడలో
దేహాన్ని మట్టిపెడ్డల మంచానికి
కట్టబెట్టి
మధ్యాహ్న వేళ మగత నిద్రకు పిలుపునిస్తే
చెమట పూలు పూసిన చొక్కాను
జెండాచేసి చెట్టుమీద ఎగరేస్తాడు

అతడు కొత్తగా పరిచయం
చేయనక్కర్లేని ఊరి పాట
మట్టినే నమ్ముకుని నిలబడ్డ
పరిమళాల పూదోట
ఎంత పాతదైనా…
తియ్యగా పలకరించే పద్యం
ఎంత దూరమైనా…
ఆప్యాయతలకు అసలైన అర్థం
పల్లె తల్లికి అతడంటే ప్రాణం
నగరాన్ని నడిపించే చేయూత
ఆతడే మన అన్నదాత
అతడికోసం…
ఎన్ని యాగాలు చేసినా
ఎన్ని త్యాగాలు చేసినా
ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా
ఎన్ని కావ్యాలు సజియించినా
తక్కువే
అతడంటే అందరికీ మక్కువే
– కమలేశ్‌, 9160396596

Spread the love