హైకమాండ్‌ చేతిలో సీఎం ఎంపిక

 ఖర్గే చేతిలో కొత్త ముఖ్యమంత్రి
కర్నాటక కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ నిర్ణయం

 ముగ్గురు ఏఐసీసీ పరిశీలకుల సమక్షంలో

భేటీబెంగళూరు : కర్నాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయించాలని కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేను కోరింది. బెంగళూరులోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో ఆదివారం కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ సమావేశం జరిగింది. కర్ణాటకలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు జరిగిన ఈ సమావేశానికి ఏఐసీసీ పరిశీలకులు సుశీల్‌ కుమార్‌ షిండే, జితేంద్ర సింగ్‌, దీపక్‌ బబారియా హాజరయ్యారు. సమావేశానికి ముందు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డి.కె. శివకుమార్‌లతో ఎఐసిసి పరిశీలకులు సమావేశమయ్యారు. కర్నాటకలో కొత్త ముఖ్యమంత్రి, మంత్రివర్గం ఈ నెల 18వ తేదీ గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ కార్యక్రమానికి సోనియా, రాహుల్‌, ప్రియాంక, ఖర్గే హాజరవుతారని, ప్రతిపక్ష పార్టీలకు కూడా ఆహ్వానం పంపుతారని తెలిసింది. గత అసెంబ్లీ గడువు ఈ నెల 24తో ముగియనున్నందున కర్నాటకలో కొత్తగా ఎన్నికైన అసెంబ్లీని అంతకుముందే ఏర్పాటు చేయాల్సి ఉంది. పార్టీ నేతలు సిద్ధరామయ్య,శివకుమార్‌ సిఎం పదవిపై ఆసక్తి వ్యక్తం చేశారు.
సిద్ధరామయ్య,శివకుమార్‌లకు మద్దతుగా పోస్టర్లు
సిద్ధరామయ్య మద్దతుదారులు బెంగళూరు లోని ఆయన ఇంటి వెలుపల ”కర్నాటక తదుపరి ముఖ్యమంత్రి” అని పేర్కొంటూ పోస్టర్‌ను ఏర్పాటు చేశారు. ”కర్నాటక కొత్త ముఖ్యమంత్రి”కి ”పుట్టినరోజు శుభాకాంక్షలు” తెలుపుతూ శివకుమార్‌ మద్దతుదారులు ఇంటి బయట పోస్టర్లు ఏర్పాటు చేశారు. సోమవారం ఆయన పుట్టినరోజు.224 మంది సభ్యుల సభలో కాంగ్రెస్‌ 135 సీట్లను కైవసం చేసుకుంది. ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా ఆ పార్టీకి మద్దతు ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. హర్సన్‌హల్లి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన లత మల్లికార్జున్‌ కాంగ్రెస్‌కు బేషరతుగా మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ 66,జనతాదళ్‌ (సెక్యులర్‌) 19 స్థానాలను గెలిచిన సంగతి తెలిసిందే.
ప్రజలకే సేవచేయడమే కాంగ్రెస్‌ ప్రాధాన్యత : ఖర్గే
పార్టీకి ఎవరు ఓటు వేసినా, వేయకపోయినా రాష్ట్ర ప్రజలకు సేవ చేయడమే కాంగ్రెస్‌ ప్రాధాన్యత అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఢిల్లీలోని10 రాజాజీ మార్గ్‌ నివాసంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది, మద్దతుదారులు ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ప్రజల విజయమని అన్నారు. ప్రజలు బీజేపీని తిరస్కరించారని, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతితో సతమతమవుతున్న ప్రజలు కాంగ్రెస్‌ను భారీ మెజారిటీతో గెలిపించారని అన్నారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కోసం కాంగ్రెస్‌కు అతిపెద్ద ఆదేశం ఇచ్చారని చెప్పారు. ‘మా మంత్రివర్గం ఏర్పడిన తొలిరోజే ఐదు హామీలకు జీవం పోసి వాటిని అమలు చేస్తాం.. అందుకే మాకు పెద్ద ఆదేశం వచ్చింది, ప్రజలకు సేవ చేయాలి.. ప్రజలకు సేవ చేయడం, సంక్షేమం చేయడమే మా పని..” అని ఆయన అన్నారు. ప్రజలు, ముఖ్యంగా పేదలు, మహిళలు, మైనార్టీలు, దళితులు కాంగ్రెస్‌ ఐదు హామీలను అంగీకరించారని, వారి అంచనాలకు అనుగుణంగా వాటిని అమలు చేస్తామని ఖర్గే చెప్పారు. ”ప్రభుత్వాన్ని సక్రమంగా నడపాలి, ఇది ఏకాభిప్రాయంతోనే సాధ్యం. మాది ప్రజాస్వామ్య పార్టీ…. ఎన్నికల్లో ఇప్పటి వరకు అంతా సజావుగా ఉంది, మాకు మెజారిటీ వచ్చింది, వీలైనంత త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం” అని తెలిపారు.

 

Spread the love