మూడో ఏడాదిలోకి ఉక్రెయిన్‌ సంక్షోభం!

Crisis in Ukraine in the third year!ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన సైనిక చర్య మూడో ఏడా దిలోకి ప్రవేశించింది.2022 ఫిబ్రవరి 24న దాడులు ప్రారంభ మైనప్పటికీ 21వ తేదీనే వ్లదిమిర్‌ పుతిన్‌ అధికారికంగా ఆదేశాలు జారీ చేశాడు. ఉక్రెయిన్‌ సరిహద్దుల వైపు రష్యా దళాల అసాధారణ కదలిక ఉన్నట్లు 2021 నవంబరు పదవ తేదీన అమెరికా వెల్లడించింది. ఒకవేళ దాడికి దిగితే బలమైన ఆర్థిక, ఇతర చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుం దని డిసెంబరు ఏడున అమెరికా అధినేత జో బైడెన్‌ బెది రించాడు. నాటో కూటమిలో ఉక్రెయిన్‌ చేరకుండా నిషే ధం విధించాలని పుతిన్‌ డిసెంబరు 17న ప్రతిపాదిం చాడు. దాన్ని జెలెన్‌స్కీ తిరస్కరించాడు. జనవరి 17న తన మిత్రదేశమైన బెలారస్‌తో సైనిక విన్యాసాలు జరిపేందుకు రష్యా ఆరువేల మంది సైనికులు, 60 జెట్‌ విమానాలను పంపింది. తన దళాలను సన్నద్ధం చేసినట్లు జనవరి 24న నాటో ప్రకటించింది. ఫిబ్రవరి 10న పది రోజుల పాటు సాగే మిలిటరీ విన్యాసాలు 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియా, ఉక్రెయిన్‌ సరిహద్దులో ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్రం ప్రకటించుకున్న రెండు తూర్పు ప్రాంతాలపై ఫిబ్రవరి 17న ఉక్రెయిన్‌ మిలిటరీ విరుచుకుపడింది. అదే నెల 21న పుతిన్‌ సైనిక చర్యకు ఉత్తరులు ఇవ్వటంతో పాటు రెండు ఉక్రెయిన్‌ తిరుగు బాటు ప్రాంతాలు డాటెస్క్‌, లుహాన్స్క్‌లకు స్వతంత్ర దేశాలుగా గుర్తిం పు ఇస్తున్నట్లు కూడా ప్రకటించాడు, 24వ తేదీన దాడులు ప్రారం భమయ్యాయి.
రెండేండ్ల ఈ సంక్షోభాన్ని స్థూలంగా చూసినపుడు ఉక్రెయిన్‌పై రష్యా పట్టు మరింత బిగిసింది. భారీ ఎత్తున ఆయుధాలు ఇచ్చిన పశ్చిమ దేశాలు ప్రచారం చేసిన మాదిరి ఉక్రెయిన్‌ ఎదురుదాడులు ఎలాంటి ఫలితాన్నివ్వలేదు. రెండు వైపులా ఎందరు మరణించిందీ ఇంతవరకు విశ్వసనీయమైన ఆధారాల్లేవు.లక్షల్లో ప్రాణ నష్టం ఉం టుందని భావిస్తున్నారు. రష్యా మీద ప్రకటించిన ఆర్థిక, ఇతర ఆంక్ష లు దేనికీ కొరగాకుండా పోయాయి.ఈ సంక్షోభం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో తెలియదు.ఉక్రెయిన్‌ ఎక్కువ కాలం ప్రతిఘటన సాగించలేదని, పశ్చిమ దేశాల్లో వైరుధ్యాల గురించి పుతిన్‌, రష్యా గురించి పశ్చిమ దేశాలు వేసుకున్న తొలి అంచనాలు తప్పాయి. పశ్చిమ దేశాలకు ధీటుగా రష్యా కూడా ప్రచారదాడులతో జవాబి చ్చింది. దీంతో జనాల బుర్రలు ఖరాబు అయ్యాయి. తమ నేతలు చెప్పిన అంశాలు, పలికిన ప్రగల్భాల గురించి పశ్చిమ దేశాల జనాల్లో అనుమానాలు, సందేహాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అటు అమెరికా, ఇటు రష్యాలోనూ ఎన్నికల్లో ఇది ఒక ప్రధాన అంశంగా మారనుంది. దీంతో రెండింటికీ ఈ సంక్షోభం ప్రతిష్టాత్మకంగా మారింది. రానున్న రోజుల్లో అనూహ్య పరిణామాలు సంభవిస్తే తప్ప అమెరికా నాయకత్వంలోని నాటో కూటమి మరింతగా ఆయుధాలు, ఆర్థిక సాయం అందించటం తప్ప దళాలను ప్రత్యక్షంగా దించే అవకాశాలు కనిపించటం లేదు. ఇవేవీ ఇంతవరకు రష్యాను వెనుకడుగు వేయించలేకపోయాయి. ఈ సంక్షోభానికి ఎప్పుడు,ఎలా తెరపడుతుంది అన్న చర్చ జరుగుతున్నది.
తాజా పరిణామాలను చూద్దాం. తూర్పు ఉక్రెయిన్‌లోని అడీవికా ప్రాంతాన్ని రష్యన్‌ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. జన నష్టాన్ని నివారించేందుకు తామే ఖాళీ చేసినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించుకుంది. గతేడాది మే నెల తరువాత రష్యన్లకు ఇది పెద్ద విజ యంగా చెబుతున్నారు. తగిన సంఖ్యలో మిలిటరీ, ఉన్న వారి దగ్గర మందుగుండు లేకనే ఇది జరిగిందని వార్తలు. అడీవికా పతనం కాగానే తమ వద్ద ఉన్న శతఘ్నులను మొత్తం ఇస్తామని డెన్మార్క్‌ ప్రకటించింది. మీరు ఇచ్చినా వాటిని వెంటనే వినియోగించే స్థితిలో లేమని ఉక్రెయిన్‌ చేతులెత్తేసింది. గత రెండు రోజులుగా రష్యా మరిన్ని దాడులకు పూనుకుంది. మ్యూనిచ్‌ నగరంలో జరుగుతున్న భద్రతా సమావేశంలో జెలెన్‌స్కీ మాట్లాడుతూ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందని దయ చేసి మమ్మల్ని అడగకండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించు కోండి, పుతిన్‌ ఇప్పటికీ కొనసాగించటానికి ఎలా వీలవు తున్నదో చూడండి అని ఐరోపా సమాఖ్యతో అన్నాడు. ఈ సంక్షో భంలో తాము తటస్థంగా ఉన్నామని చైనా మరోసారి స్పష్టం చేసింది. అన్ని స్థాయిల్లో చైనాతో సంబంధాలు కొనసాగుతున్నాయని ఉక్రెయిన్‌ ప్రకటించింది. ఐరోపాకు రష్యా ముప్పుకొనసాగుతూనే ఉందని, అది కొన్ని నెలలు, సంవత్సరాలు, ఒక తరం వరకు ఉండవచ్చని బ్రిటన్‌ లేబర్‌ పార్టీ నేత డేవిడ్‌ లామీ అన్నాడు. ఉక్రెయిన్‌ ఇప్పుడు జీవన్మరణ స్థితిలో ఉందని, దాని విధిని నిర్ణయించేది తామేనని పుతిన్‌ ప్రకటిం చాడు.తాము మద్దతు ఇస్తున్నప్పటికీ ఉక్రెయిన్‌తో ఆహార ధాన్యాలు, ట్రక్కుల రవాణా సమస్యలు ఉన్నట్లు పోలాండ్‌ మంత్రి సికోరిస్కీ చెప్పాడు. ఉక్రెయిన్‌కు భద్రత ఉండాలంటే తమ సభ్యత్వం ఇవ్వాలని ఐరోపా యూనియన్‌ ప్రతినిధి జోసెఫ్‌ బోరెల్‌ అన్నాడు. మరో పద్దె నిమిది నెలల పాటు ఉక్రెయిన్‌ పౌరులకు వీసాలను పొడిగిస్తున్నట్లు బ్రిటన్‌ తెలిపింది.దీన్ని బట్టి పశ్చిమ దేశాలకు ఈ సమస్య పరిష్కారం పట్ల ఆసక్తి లేదన్నది స్పష్టమౌతోంది.
రెండేండ్ల తరువాత రష్యాను శత్రుదేశంగా చూస్తున్నప్పటికీ ఐరోపాలో యుద్ధ ఆయాసం కనిపిస్తోంది. ఉక్రెయిన్‌కు రానున్న రోజు ల్లో విజయాలు సంభవిస్తే ఫరవాలేదు లేకుంటే మరింత నీరసం, దాన్నుంచి ఎందుకీ తలనొప్పి అనే భావం కూడా తలెత్తవచ్చు. మొత్తమ్మీద ఎన్ని మల్లగుల్లాలు పడినా నాటో కూటమి ఐక్యంగానే ఉంది. ఫిన్లండ్‌ కొత్తగా చేరగా స్వీడెన్‌ ఆ బాటలో ఉంది. ఉక్రెయిన్‌లో రష్యా గెలిస్తే అంతర్జాతీయ రాజకీయ వ్యవస్థ వైపు తిరిగే మలుపు పశ్చిమ దేశాల ప్రయోజనాల ఫణంగా జరుగుతుందని భావిస్తు న్నారు. బాల్టిక్‌ దేశాలు ఉక్రెయిన్‌కు గట్టి మద్దతు ఇవ్వాలని కోరుతుం డగా నాటోలోని హంగరీ, స్లోవేకియా పెదవి విరుస్తున్నాయి. నెదర్లాండ్స్‌,స్లోవేకియాలో గతేడాది జరిగిన ఎన్నికలు నాటో ఐక్యత మీద ప్రశ్నలను ముందుకు తెచ్చాయి. జెలెన్‌స్కీకి మిలిటరీ మద్దతులో కోత పెట్టాలనే నినాదంతో పోటీ చేసిన పచ్చిమితవాద ఫ్రీడమ్‌ పార్టీ నెదర్లాండ్స్‌లో గెలిచింది.రష్యాకు అనుకూలంగా ఉండాలన్న వైఖరితో ఉన్న స్లోవాక్‌ సోషల్‌ డెమోక్రసీ పార్టీ 22.9శాతం ఓట్లతో పెద్ద పార్టీగా అవతరించింది. అయితే ఈ రెండు చోట్లా ఈ పార్టీలకు సంపూర్ణ మెజారిటీ లేదు. ఉక్రెయిన్‌కు యాభై నాలుగు బిలియన్‌ డాలర్ల అదనపు సాయం అందించాలన్న ప్రతిపాదనను అడ్డుకొ నేందుకు హంగరీ ప్రయత్నించింది. ఇప్పటి వరకు చూస్తే జెలెన్‌స్కీ దళాలకు తాము ఇచ్చిన ఆధునిక ఆయుధాలను ఉపయోగించటంలో నాటో దేశాలు శిక్షణ ఇస్తున్నాయి తప్ప ముందే చెప్పినట్లు ప్రత్యక్షంగా పాల్గొనటం లేదు. అంతర్జాతీయ వేదికల మీద రాజకీయ మద్దతు, రష్యాను ఒంటరి చేసేందుకు చేయాల్సిందంతా చేస్తున్నాయి.
డోనాల్డ్‌ ట్రంప్‌ గతంలో అధికారంలో ఉన్నపుడు మా నుంచి రక్షణ పొందేది మీరు, దానికయ్యే ఖర్చును కూడా మేమే భరించాలా? కుదరదు మీ కేటాయింపులు పెంచాలని తెగేసి చెప్పాడు. ఇప్పుడు అమెరికా ఎన్నికల్లో ఇది కూడా ఒక సమస్యగా ముందుకు వచ్చింది. ఐక్యతకే ముప్పు తెచ్చేదిగా ఉందని కొరదరు చెబుతున్నారు. అవస రాలకు అనుగుణ్యంగా నిధులు కేటాయించని దేశాలకు రక్షణ ఇవ్వాల నుకోవటం లేదని ఇటీవల ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ చెప్పాడు.ఈ అంశంలో బైడెన్‌-ట్రంప్‌ వైఖరిలో చాలా తేడా ఉంది. అది కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసమే అనే వారు కూడా లేకపోలేదు. ఎవరేం మాట్లా డినా అంతిమంగా అమెరికా ప్రయోజనాలకే పెద్దపీట వేస్తారు. నాటో దేశాలు పైకి బింకంగా కనిపిస్తున్నప్పటికీ ఉక్రెయిన్‌ సంక్షోభం నుంచి ఎలా బయటపడాలో వాటికి తోచటం లేదు.నష్టదాయకమైన షర తులతో రష్యాతో రాజీకి అంగీకరించటమా లేక పోరును పొడిగించి ఓటమిని మూటగట్టుకోవటమో ఏదో ఒకటి జరుగుతుందని అనేక మంది నమ్ముతున్నారు.ఏది జరిగినా ప్రపంచ రాజకీయాల్లో అమెరికా, దాని మిత్ర దేశాలకు ప్రతికూలత మరింత పెరుగుతుంది.
కొందరు కొరియా నమూనాలో పోరు ముగియవచ్చని చెబుతున్నారు. 1950 దశకంలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి ఒకే దేశంగా ఉండాల్సిన కొరియా రెండు భూభాగాలుగా ఉంది తప్ప సాంకేతికంగా యుద్ధ విరమణ ఒప్పందం ఇప్పటికీ లేదు. దక్షిణ కొరియా రక్షణకు హమీ ఉన్నట్లుగా ఉక్రెయిన్‌కు నాటో రక్షణ హామీని రష్యా ఎట్టి పరిస్థితిలో అంగీకరించదు గనుక అది కూడా జరగక పోవచ్చన్నది మరో వాదన. ఉక్రెయిన్‌ సంక్షోభం మొదలైన తరువాత చైనా -రష్యా సంబంధాలు మరింత బలపడటమే గాక రెండూ దగ్గ రయ్యాయి. అంటే ప్రచ్చన్న యుద్ధకాలంలో మాదిరి రెండు శిబి రాలుగా ప్రపంచం చీలిందని సూత్రీకరించేవారు కూడా లేకపోలేదు. తటస్థంగా ఉన్నా, ఆయుధాలను సరఫరా చేయకున్నా, పశ్చిమ దేశాల ఆంక్షల ప్రభావం నుంచి తప్పించేందుకు చైనా ఇటీవలి కాలం లో రష్యా నుంచి తన దిగుమతులను పెంచుకొన్నది.ఈ పరిణా మంతో అట్లాంటిక్‌ ప్రాంత దేశాలు వీటికి వ్యతిరేకంగా దగ్గర అవుతు న్నాయి. రక్షణ బడ్జెట్లను, మిలిటరీని పెంచుతున్నాయి.గత ప్రచ్చన్న యుద్ధానికి ఇప్పటిదానికి చాలా తేడా ఉన్నది. సోవియట్‌-చైనా బంధం కంటే ఇప్పుడు చైనా-రష్యా బంధం ఎంతో ప్రాధాన్యత కలిగింది.నాడు చైనా ఆర్థికంగా మిలిటరీ రీత్యా నేటి మాదిరి బలం కలిగి లేదు. గతంలో సోవియట్‌-చైనా మధ్య ఉన్న విబేధాలను అమెరికా వినియోగించుకుంది, ఇప్పుడు అలాంటి అవకాశం లేదు.
ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే ఏ పక్షమూ గెలిచే లేదా ఓడిపోయే స్థితి లేదని మరికొంతకాలం కొనసాగుతుదంటున్న వారు కొందరు. గతేడాది ఆర్భాటం చేసి ప్రారంభించిన ఎదురుదాడిలో మొత్తంగా చూసినపుడు ఉక్రెయిన్‌కు మరిన్ని నష్టాలు, కొత్త ప్రాంతాలను కోల్పోవటం, ఆత్మరక్షణలో భారీ సంఖ్యలో ప్రాణాలను బలిపెడుతున్నది. మరోవైపు రష్యా కూడా ప్రాణాలను పెద్ద సంఖ్యలో కోల్పోవటంతో పాటు యుద్ధ సామగ్రిని కూడా భారీగా నష్టపోతు న్నది. రానున్న ఎన్నికల కారణంగా పెద్ద సంఖ్యలో మిలిటరీ రిక్రూట్‌మెంట్లు కూడా చేసే పరిస్థితి లేదు. జనాభా రీత్యా తక్కువ సంఖ్య ఉన్న ఉక్రెయిన్‌కు ఇంకా కష్టం. పశ్చిమ దేశాలు ఊహించినదానికి భిన్నంగా పుతిన్‌ తనకు కావాల్సిన ఫిరంగి గుండ్లు ఇతర వాటిని ఇరాన్‌, ఉత్తర కొరియా నుంచి పొందుతున్నాడు. ఉక్రె యిన్‌కు నాటో సరఫరాలు సరేసరి. ఉక్రెయిన్‌ లొంగు బాటు తప్ప మరే చర్చలు లేవని పుతిన్‌ తెగేసి చెప్పాడు. పదేండ్ల నాడు కోల్పోయిన క్రిమియాతో సహా అన్ని ప్రాంతాలను తిరిగి తమకు అప్పగిస్తే తప్ప రాజీ లేదని జెలెన్‌స్కీ చెప్పటం, ఈ ఏడాది నవం బరులో అమెరికా ఎన్నికలు ఉన్నందున ఏడాది పొడవునా పోరు కొనసాగవచ్చు.
ఎం కోటేశ్వరరావు
8331013288

Spread the love