బీఆర్ఎస్ లో అసమ్మతి..అభ్యర్థుల ఎంపికపై మొదలైన కసరత్తు

– పట్టించుకోని అధిష్టానం
– జిల్లాలో మళ్లీ సిట్టింగ్ లకే టిక్కెట్లు దక్కే అవకాశం
– అభ్యర్థుల ఎంపికపై మొదలైన కసరత్తు
– ఎమ్మెల్యేలు, ఆశావహులంతా ప్రగతి భవన్ వైపు
నవతెలంగాణ-పెద్దపల్లి : వచ్చే సాధారణ ఎన్నికలకు ఇతర పార్టీల కంటే ముందే అధికార బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోంది. అందుకుగాను తమ పార్టీ అభ్యర్థుల ఎంపిక పై కసరత్తు మొదలు పెట్టింది. అందులో భాగంగా మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఎక్కువశాతం సీట్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పెద్దపల్లి జిల్లాలో గత ఎన్నికల్లో మూడు స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నిలబడగా రెండు స్థానాల్లో గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఈసారి మార్చాలని అదే పార్టీలో అసమ్మతి రాగం మొదలైంది. అయినప్పటికీ కూడా అధిష్టానం లెక్కచేయకుండా పెద్దపల్లి జిల్లాలో ఉన్న ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టిక్కెట్లు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఒక స్థానంలో గత ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థికి జెడ్పి చైర్మన్ పదవి ఇచ్చినప్పటికీ మళ్ళీ అదే స్థానంలో ఆయనకే టికెట్ ఇవ్వనున్నట్లు సమాచారం.
మరోసారి సిట్టింగ్ లకే….
పెద్దపెల్లి జిల్లాలో పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల్లో 2018 సాధారణ ఎన్నికల్లో అప్పటికే ఉన్న సిట్టింగ్ లకే టిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికల్లో భాగంగా టిక్కెట్లు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గం నుండి దాసరి మనోహర్ రెడ్డి గెలుపొందగా, రామగుండం నుంచి అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే సోమవారం సత్యనారాయణతో పాటు మంథని నుంచి పోటీ చేసిన పుట్ట మధు ఓడిపోయారు. రామగుండం నియోజకవర్గం నుండి అప్పటి ఎన్నికల్లో టీఆర్ఎస్ రెబల్ గా ఆర్.ఎస్.పి నుంచి పోటీ చేసిన కోరుకంటి చందర్ గెలుపొందారు. తరువాత టీఆర్ఎస్ జాయిన్ అయ్యారు. దీంతో ప్రస్తుతం పెద్దపెల్లి జిల్లాలో బిఆర్ఎస్ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండగా మంథని నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఉన్నారు. శ్రీధర్ బాబుపై ఓడిపోయిన పుట్ట మధుకు జడ్పీ చైర్మన్ పదవి ఇచ్చారు. అయితే ఇప్పుడు వచ్చే సాధారణ ఎన్నికల్లో పుట్ట మధుతో పాటు సిట్టింగులైన దాసరి మనోహర్ రెడ్డి, కొరుకంటి చందర్ కు మరోసారి టిక్కెట్లు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అసమ్మతి రాగం..
పెద్దపల్లి టీఆర్ఎస్ లో మొదటి నుంచి అసమ్మతి రాగం కొనసాగుతూ వస్తుంది. ప్రధానంగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కార్యకర్తలను పట్టించుకోకపోవడంతో పాటు ఆయన కాకుండా ఇతరులకు అవకాశాలు కల్పించాలని గత కొంత కాలం క్రితం ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు, నల్ల మనోహర్ రెడ్డి మరోవైపు ఈద శంకర్ రెడ్డి ప్రయత్నాలు కొనసాగించారు.అధిష్టానం ఆదేశాలతో ఏడాది నుంచి వీరి ప్రయత్నాలు ఆగిపోయాయి. వారికి సాగింది.పెద్దపల్లి నియోజకవర్గం లో రెడ్డి, రావు లకు కాకుండా బీసీ లకు అవకాశం ఇస్తే కనుక తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు జూలపల్లి జెడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ విధంగా జడ్పిటిసి లను ఎంపీపీలను సర్పంచులను కూడగడుతున్నారు. “కేసీఆర్ సేవాదళం” సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి తలనొప్పిగా మారాయి. మరో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రామగుండం నియోజకవర్గం నుండి ఈసారి తప్పకుండా అవకాశం కల్పించాలని పాలకుర్తి జెడ్పిటిసి కందుల సంధ్యారాణి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆమెకు తోడు ఇటీవల కోరుకంటి చందర్ కు టికెట్ ఇవ్వొద్దంటూ ఇతరులకు ఎవరికైనా అవకాశం కల్పించాలని టీజీబీకేఎస్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, జెడ్పిటిసి కందుల సంధ్యారాణి, పాతపెల్లి ఎల్లయ్య మరో కొందరు కార్పొరేటర్లు ఏకంగా రామగుండంలో పాదయాత్ర నిర్వహించి ధర్నా కూడా చేసి అధిష్టానానికి తమ అసమ్మతిని గట్టిగా వినిపించారు. అదేవిధంగా జడ్పీ చైర్మన్ పుట్ట మధు కు కూడా అసమ్మతి తప్పడం లేదు. పుట్ట మధుకు మంథని నియోజకవర్గంలో పోటీలో ఎవరు లేకపోయినప్పటికీ ఆయనకు కాకుండా ఇతరులకు ఎవరికైనా అవకాశం కల్పించాలంటూ ఇటీవల ముత్తారం మాజీ జడ్పీటీసీ, రామగిరి ఎంపీపీ మరో కొంతమంది బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అందరూ కలిసి సమావేశం నిర్వహించి తమ అసమ్మతిని అధిష్టానానికి తెలియజేశారు.
జిల్లా రాజకీయంపై పట్టించుకోని అధిష్టానం
బీఆర్ఎస్ పార్టీ వచ్చే సాధారణ ఎన్నికలకు తమ అభ్యర్థుల ఎంపిక కసరత్తు మొదలుపెట్టింది. ఈనెల 21 వరకు మొదటి విడతలో 70 మంది వరకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఇప్పటివరకు ఆయా నియోజకవర్గాల్లో ఆయనే స్వయంగా చేపట్టిన సర్వేలోనీ వివరాల సమాచారం ఆధారంగా అభ్యర్థులను జాబితా సిద్ధం చేసినట్లుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలపై కొన్ని విమర్శలు ఆరోపణలు వచ్చినప్పటికీ వాటిని లెక్కచేయకుండా మళ్లీ సిట్టింగ్ లకు ఎక్కువ శాతం టికెట్లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలిసింది. పెద్దపల్లి జిల్లాలో పెద్ద పల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మంథని నుంచి జడ్పీ చైర్మన్ పుట్ట మధు పై సొంత పార్టీలోని నాయకులు, కార్యకర్తలు అసమ్మతిని తెలియజేసినప్పటికీ మళ్లీ వారికే ఈసారి టిక్కెట్లు ఇయ్యనున్నట్లుగా సమాచారం. గురువారమే పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హైదరాబాదులో మకాం వేశారు. శుక్ర, శనివారాల్లో కోరుకంటి చందర్, కొప్పుల ఈశ్వర్, జడ్పీ చైర్మన్ పుట్ట మధు కూడా హైదరాబాదులో మకాం వేయనున్నారు. ఈనెల 21న మొదటి జాబితాను ప్రకటించనున్న నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు టెన్షన్ మొదలైంది. వారితోపాటు పెద్దపెల్లి జిల్లాలో ఆశావాహులు కూడా హైదరాబాద్ కు తరలి వెళ్తున్నారు. అధిష్టానం నాయకులతో చర్చలు జరుపుతున్నారు.

Spread the love