ఆట గాయపడింది

ఆవుతోలు కప్పుకున్న మగాలకు
ఆటైనా ఒక్కటే
పాటైనా ఒక్కటే

మేక వన్నె పులుల మధ్య
ఆట గాయపడాల్సిందే
పాట గాయ పడాల్సిందే

న స్త్రీ స్వాతంత్ర మర్హతి !

తన బాదల్ని
ముఖాల మీద చల్లుతూ
తన గాదల్తో
మెదడు మొద్దుబారుస్తూ
మనసు ద్వారాలు మూసుకున్న
ఒక మౌన మనువు
ఏక పక్ష నాలుక
చెలరేగుతుంటే
గంతలు కట్టుకున్న గాంధారి
ధ్యానంలో
ఆట
ఢిల్లీ గుండెల మీద కూర్చుంది

ఆర్థికంలా
ఆడతనం
అనాధరోదనైనప్పుడు
ఆటస్థలం
నడి వీధిలోకి వచ్చింది

ఓ కవచమయ్యే
నలుగురిలో నిలబడి
దిక్కుల్ని అర్ధిస్తున్నప్పుడు –

”భేటీ బచావో భేటీ బచావో
చెద పురుగులు
వ్యాపించాయి దేశమంతా
భేటీ బచావో భేటీ బచావో ”

ఆకాశంలోంచి అరుస్తున్నారు
చేతుల్లో
చెరో తుపాకీతో
హీరాబెన్‌…పూలన్‌ దేవి

– వడ్డెబోయిన శ్రీనివాస్‌

Spread the love