మట్టిలో.. మాణిక్యాలు..

– నేటి నుండి జిల్లా స్థాయి సీఎం కప్‌ క్రీడాపోటీలు
– ప్రారంభించనున్న మంత్రి జగదీశ్‌రెడ్డి
– పాల్గొనున్న 1500కు పైగా క్రీడాకారులు
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్‌
క్రీడాకారులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి వారిని మరింత ప్రోత్సహించి మాణిక్యాలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చీఫ్‌ మినిస్టర్స్‌ కప్‌-2023 క్రీడా పోటీలకు నిర్వహిస్తోంది. ఇందుకోసం ఏర్పాట్లను కూడా చేస్తుంది. క్రీడలపై ఆసక్తి ఉండి చదువును మధ్యలోనే ఆపివేసిన వారు సరైన ఆదరణ లేక వెనుకబడుతున్నారు. అలాంటి ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చీఫ్‌ మినిస్టర్‌ 2023 పేరుతో మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను నిర్వహిస్తోంది. ఈ పోటీలలో 15 నుండి 35 సంవత్సరాలలోపు వయస్సు గల యువతి, యువకులు పాల్గొననున్నారు. అథ్లెటిక్స్‌, వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో, ఫుట్‌ బాల్‌ పోటీలను మండల స్థాయిలో ఈనెల 15 నుంచి 17వరకు నిర్వహించారు. మండల స్థాయిలో నిర్వహించిన పోటీలకు అదనంగా స్విమ్మింగ్‌, బ్యాట్మెంటన్‌, బాస్కెట్బాల్‌, బాక్సింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్‌, హ్యాండ్‌బాల్‌, అథ్లెటిక్స్‌ (లాంగ్‌ జంప్‌, షాట్‌ పుట్‌) పోటీలను నిర్వహించారు. మండల స్థాయిలో విజేతలైన టీంలకు జిల్లా స్థాయిలో నేటి నుండి 24 వ తేదీ వరకు క్రీడ పోటీలను నిర్వహించనున్నారు. అయితే జిల్లాస్థాయి క్రీడలను నేడు ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్‌ అవుట్‌ డోర్‌ స్టేడియంలో విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రారంభించనున్నారు.
11 క్రీడలతో జిల్లా స్థాయి పోటీలు…
మండల స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు, జట్లు జిల్లా స్థాయిలో నిర్వహించే క్రీడా పోటీలలో పాల్గొని పోటీపడనున్నారు. జిల్లా స్థాయిలో మండల స్థాయిలో నిర్వహించిన పోటీలకు అదనంగా క్రీడా పోటీలను నిర్వహించనున్నారు. జిల్లాస్థాయిలో అథ్లెటిక్స్‌, ఫుట్బాల్‌, కబడ్డీ, కోకో, వాలీబాల్‌, బ్యాట్మెంటన్‌, బాస్కెట్‌ బాల్‌, బాక్సింగ్‌, హ్యాండ్‌ బాల్‌, స్విమ్మింగ్‌, రెజ్లింగ్‌లు ఉన్నాయి.
పాల్గొననున్న 15 వందలకుపైగా క్రీడాకారులు
మండల స్థాయి క్రీడలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు, జిల్లా స్థాయిలో నేరుగా పాల్గొనే క్రీడాకారులు సుమారు 15 వందలకు పైగా క్రీడాకారులు జిల్లాస్థాయి క్రీడా పోటీలలో పాల్గొనే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈనెల 24 వరకు నిర్వహించే జిల్లా స్థాయి క్రీడా పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు, జట్లు రాష్ట్రస్థాయిలో ఈనెల 28 నుండి 31 వరకు హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే 18 క్రీడాభిభాగాలలో పాల్గొని పోటీ పడనున్నారు. అయితే జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయనున్నారు. జిల్లాస్థాయిలో మెడల్స్‌, కప్స్‌, సర్టిఫికెట్లను విజేతలకు అందజేయనున్నారు. రాష్ట్రస్థాయిలో వ్యక్తిగత పోటీలకు ప్రధమ బహుమతి 20 వేల గోల్డ్‌ మెడల్‌, ద్వితీయ బహుమతి 15 వేల సిల్వర్‌ మెడల్‌, తృతీయ బహుమతి 10వేల కాంస్య బహుమతిని అందజేయనున్నారు. అదే జట్టుకైతే మొదటి బహుమతి లక్ష రూపాయల గోల్డ్‌ బహుమతి, ద్వితీయ బహుమతిగా 75 వేల సిల్వర్‌ బహుమతి, తృతీయ బహుమతిగా 50వేల కాంస్య బహుమతిని అందజేస్తారు. వీటితోపాటు క్రీడలలో పాల్గొని విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు సర్టిఫికెట్లను కూడా ఇవ్వనున్నారు. అయితే ఈ సర్టిఫికెట్లు క్రీడాకారులకు భవిష్యత్తులో వివిధ విభాగాలలో ఉపయోగకరంగా ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు.
అదనపు కలెక్టర్‌ ఆధ్వర్యంలో కమిటీ బాధ్యతలు..
జిల్లా స్థాయి క్రీడా పోటీలను నిర్వహించేందుకు జిల్లా అదనపు కలెక్టర్‌ ఖుష్భు గుప్త ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో జిల్లా పరిషత్‌ సీఈవో ప్రేమ్‌ కరణ్‌రెడ్డి, ఆర్డీఓ జయ చంద్రరెడ్డి, జిల్లా క్రీడల శాఖ అధికారి మక్బుల్‌ అలీ, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి ఉన్నారు. క్రీడా పోటీలు నిర్వహించే చోట ప్రోటోకాల్‌, గ్రౌండ్‌ లెవెలింగ్‌, టెంట్‌, పారిశుద్ధ్యం, త్రాగునీరు, వేదిక, సౌండ్‌, మరుగుదొడ్ల ఏర్పాటు బాధ్యతలను మున్సిపల్‌ కమిషనర్లకు అప్పగించారు. అదేవిధంగా క్రీడాకారులకు వసతి, హాస్టల్లో బస చేయుటకు ఏర్పాటు చేయాలని మైనార్టీ సంక్షేమ శాఖ అధికారికి బాధ్యతలను అప్పగించారు. క్రీడలు జరిగే చోట 108 వాహనం ఏర్పాటు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, వైద్య సిబ్బంది ఏర్పాటు చేయాలని డీఎంహెచ్వోకు సూచించారు. బహుమతులు, ఫ్లెక్సీల ఏర్పాటు, సర్టిఫికెట్ల ప్రధానోత్సవం బాధ్యతలను జిల్లా క్రీడల శాఖ అధికారి, జిల్లా పంచాయతీ అధికారికి అప్పగించారు.
ఉదయం, సాయంత్రమే నిర్వహణ
తీవ్ర ఎండల దృష్ట్యా ఉదయం, సాయంత్రమే క్రీడలను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఉదయం పూట 8 గంటల నుండి 11 గంటల వరకు అనంతరం సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు మాత్రమే క్రీడా పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
దాతలపైనే ఆధారపడ్డ అధికారులు…
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్‌ 2023 క్రీడ పోటీలకు నిధుల కొరత వేధిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలానికి 15 వేల రూపాయలను, జిల్లాకు 75 వేల రూపాయలను కేటాయించినప్పటికీ నేటికీ మంజూరు కాలేదు. నిధుల లేమితో కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దాతలపైనే ఆధారపడ్డ అధికారులు వారి నుండి సేకరించిన నిధులతోనే క్రీడలను నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు.
పగడ్బందీగా ఏర్పాట్లు..
ప్రేమ్‌కరణ్‌రెడ్డి (జెడ్పీ సీఈవో)
జిల్లా స్థాయిలో నిర్వహించే క్రీడా పోటీలకు పగడ్బందీగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కువమంది క్రీడాకారులు పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రత్యేకంగా ట్రాన్స్‌పోర్ట్‌ను ఏర్పాటు చేశాం. మండల స్థాయిలో షీల్డ్‌లు ఇప్పించాం. భోజనాలు పెట్టించాం. ప్రత్యేకమైన ట్రాన్స్‌పోర్ట్‌తో బస్సులలో ఉదయం 7 గంటలలోపే క్రీడాకారులు గ్రౌండ్‌కు చేరేలా ఏర్పాట్లు పూర్తి చేశాం.

Spread the love